మెుక్కజొన్న విక్రయాల్లో మార్క్‌ ఫెడ్‌ చరిత్ర | Markfed creates history in maize sales | Sakshi
Sakshi News home page

మెుక్కజొన్న విక్రయాల్లో మార్క్‌ ఫెడ్‌ చరిత్ర

Aug 3 2026 10:25 PM | Updated on Aug 3 2026 10:25 PM

Markfed creates history in maize sales
  •  మొక్కజొన్న అమ్మకాల్లో మార్క్‌ఫెడ్ చరిత్ర
  •  ఈ-వేలంలో మెట్రిక్ టన్నుకు సగటున రూ.25,370 ధర
  •  మంత్రి తుమ్మల నిర్ణయాలతో ప్రభుత్వానికి భారీ లాభం
  •  ఈ-టెండర్‌కు బదులుగా ఈ-వేలం విధానంతో రికార్డు ధరలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ మొక్కజొన్న విక్రయాల్లో చరిత్ర సృష్టించింది. మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు సంప్రదాయ ఈ-టెండర్ విధానాన్ని విరమించి పారదర్శకమైన ఈ-వేలం (E-Auction) విధానాన్ని అమలు చేయడంతో మొక్కజొన్నకు రికార్డు స్థాయిలో ధర లభించింది. ఈ వేలాల్లో మెట్రిక్ టన్నుకు గరిష్టంగా రూ.26,500, కనిష్టంగా రూ.24,100, సగటున రూ.25,370 ధర నమోదైంది. కొనుగోలు ధరతో పోలిస్తే టన్నుకు సుమారు రూ.1,500 లాభం రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరనుంది.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదిన్నర కాలంలో మార్క్‌ఫెడ్‌కు నష్టాలు తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. అనంతరం సంస్థను లాభాల బాట పట్టించేలా తీసుకున్న సంస్కరణల్లో భాగంగానే ఈ-టెండర్ విధానానికి బదులుగా పోటీని పెంచే ఈ-వేలం విధానాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయం వల్ల మార్కెట్‌లో పోటీ పెరిగి రైతులు, ప్రభుత్వానికి ప్రయోజనం చేకూరే విధంగా అత్యుత్తమ ధర లభించింది.

యాసంగి 2025-26 సీజన్‌లో మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14.60 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేయబడింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో మొక్కజొన్న కొనుగోలు జరగడం ఇదే తొలిసారి.

ఇంత పెద్ద మొత్తంలో మొక్కజొన్నను నిల్వ చేసేందుకు తగినన్ని గిడ్డంగులు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఓపెన్ షెడ్లు, కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు తదితర తాత్కాలిక గిడ్డంగుల్లో నిల్వ చేయాల్సి వచ్చింది. వీటిలో సుమారు 3.80 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న వర్షాలకు తడిచిపోయే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో ఉండటంతో, ఆ స్టాక్‌ను 30 రోజుల్లో లిఫ్టింగ్ పూర్తి చేయాలనే నిబంధనతో ప్రత్యేక ఈ-వేలం ద్వారా మెట్రిక్ టన్నుకు రూ.22,000 ధరకు త్వరితగతిన విక్రయించారు. దీంతో వర్షాల కారణంగా మొక్కజొన్న దెబ్బతిని ప్రభుత్వానికి సంభవించే భారీ నష్టాన్ని పూర్తిగా నివారించడం సాధ్యమైంది.

మిగిలిన సుమారు 10.98 లక్షల మెట్రిక్ టన్నుల సురక్షిత గిడ్డంగుల్లో ఉన్న మొక్కజొన్నకు మార్కెట్ పరిస్థితులను విశ్లేషించి బేస్ ప్రైస్‌ను మెట్రిక్ టన్నుకు రూ.24,000గా నిర్ణయించి, జూలై 31, ఆగస్టు 1, ఆగస్టు 3 తేదీల్లో మూడు విడతలుగా ఈ-వేలాలు నిర్వహించారు.

ఈ మూడు విడతల వేలాల్లో నమోదైన ధరలు 

- మొదటి ఈ-వేలం: 3,70,895 మెట్రిక్ టన్నులు విక్రయం. కనిష్ట ధర రూ.24,900, గరిష్ట ధర రూ.25,600, సగటు ధర రూ.25,192.
- రెండో ఈ-వేలం: 3,68,154 మెట్రిక్ టన్నులు విక్రయం. కనిష్ట ధర రూ.24,100, గరిష్ట ధర రూ.26,500, సగటు ధర రూ.25,329.
- మూడో ఈ-వేలం: 3,59,339 మెట్రిక్ టన్నులు విక్రయం. కనిష్ట ధర రూ.25,200, గరిష్ట ధర రూ.26,000, సగటు ధర రూ.25,594.

మొత్తంగా 10,98,388 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఈ-వేలం ద్వారా విక్రయించగా, కనిష్ట ధర రూ.24,100, గరిష్ట ధర రూ.26,500, సగటు ధర రూ.25,370 లభించింది. మార్క్‌ఫెడ్ చరిత్రలో ఇంత భారీ పరిమాణంలో మొక్కజొన్నను ఇంత మంచి ధరకు విక్రయించడం ఇదే తొలిసారి.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు, పారదర్శక ఈ-వేలం విధానం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న వ్యూహాత్మక చర్యల ఫలితంగానే ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడంతో పాటు ప్రజాధనాన్ని పరిరక్షించగలిగామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement