ముంబై: మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది. టీఈటీ పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బ్రిజేంద్ర గుప్తాతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ముఠా ఒక్క టీఈటీ పేపర్ లీకేజీతో ఆగకుండా, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే ‘సెట్’ పరీక్షా పత్రాన్ని కూడా లీక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆగ్రాలోని ఓ ముద్రణాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ శర్మ ద్వారా ఈ పత్రాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.
ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానాల ద్వారా ఈ ముఠాలు ఏవిధంగా ప్రశ్నపత్రాలను తస్కరిస్తున్నాయనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లలో నిఘా ఉంచి, కిందిస్థాయి సిబ్బందిని ఆకర్షించి పత్రాలను బయటికి పంపడం, అలాగే ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలను దక్కించుకుని వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం వంటి పద్ధతులను ఈ నెట్‌వర్క్ వాడుతున్నట్లు తేలింది.
టీఈటీ పరీక్షా పత్రాన్ని రూ. 8,000 పెట్టి కొనుగోలు చేసిన ఈ ముఠా, మహారాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు రూ. 80,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. భివాండి నగరంలో ఈ పేపర్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో థానే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి హరియాణా, బిహార్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు


