కోల్‌కతా: దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కోల్‌కతాలో అడుగుపెట్టారు. అన్యాయం ఎంతకాలం కొనసాగినా అది శాశ్వతం కాదనడానికి తన రాక ఒక నిదర్శనమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ఏ రచయిత కూడా దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి రాకూడదని ఆమె ఆకాంక్షించారు.
శనివారం కోల్‌కతాలో నిర్వహించిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ భావోద్వేగంతో మాట్లాడారు. తాను కోల్పోయిన జీవితంలో ఒక భాగాన్ని తిరిగి పొందిన అనుభూతి కలుగుతోందన్నారు. మహిళల హక్కుల గురించి మాట్లాడేందుకే తాను ఇక్కడకు వచ్చానని, దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. యూరప్ తనకు ఆశ్రయం కల్పించినప్పటికీ, బంగ్లాదేశ్ లేదా పశ్చిమ బెంగాల్‌లో కనీసం నివసించడానికి ఒక చిన్న చోటు కూడా దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రచనల కారణంగా మత ఛాందసుల వ్యతిరేకతను ఎదుర్కొంటూ దేశ బహిష్కరణ శిక్ష అనుభవించాల్సి వచ్చిందని తెలిపారు.
ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌లోని రవీంద్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తస్లీమా నస్రీన్ రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాజ్యాంగం, భావప్రకటనా స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు రాష్ట్రంలో పూర్తి రక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. కాగా ఆమె రాసిన ‘ద్విఖండితో’ ఆత్మకథలోని కొన్ని అంశాలు వివాదాస్పదం కావడంతో, 2007 నవంబర్‌లో అప్పటి లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఆమెను కోల్‌కతా నుంచి బహిష్కరించింది. ఇస్లామిక్ ఛాందసవాదుల బెదిరింపుల కారణంగా ఆమె 1994లో బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ప్రవాస జీవితం గడుపుతున్నారు.
ఇది కూడా చదవండి: సిద్ధివినాయక ఆలయంలో రూ. 18 కోట్ల కుంభకోణం?


