నాజ్కా లైన్స్: పెరూలోని ప్రసిద్ధ నాజ్కా లైన్స్ సమీపంలో శనివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 13 మంది దుర్మరణం చెందారు. విదేశీ పర్యాటకులతో వెళ్తున్న ఒక సైట్‌సీయింగ్ విమానం నాజ్కా నగరం వెలుపల కూలిందని అధికారులు తెలిపారు. పెరూలోని పురాతన నాజ్కా లైన్స్‌ను విహంగ వీక్షణం చేసేందుకు ఈ విమానం బయలుదేరిందని నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం వెల్లడించింది.
శతాబ్దాల కిందట స్థానిక దేశీయ గిరిజన సంఘాలు పెరూ ఎడారిలో భారీ భౌగోళిక చిత్రాలను (జియోగ్లిప్స్) చెక్కాయి. జంతువులు, రేఖాగణిత నమూనాలను తలపించే ఈ భారీ ఆకృతులను విమానంలో నుంచి లేదా పరిశీలనా టవర్ల నుంచి స్పష్టంగా వీక్షించవచ్చు. సమీపంలోని ఇకా నగరంలో బయలుదేరిన ఈ విమానాన్ని పెరూ విమానయాన సంస్థ ‘ఏరోడియానా’ నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
గత 14 ఏళ్లుగా సెస్నా గ్రాండ్ కారవాన్ విమానాల ద్వారా నాజ్కా లైన్స్‌పై సైట్‌సీయింగ్ విమానాలను నడుపుతున్నట్లు ఆ సంస్థ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రమాద సమయంలో విమానంలో 11 మంది విదేశీ పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు పెరూ వాణిజ్య, పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతులలో ఏడుగురు ఇటలీ, ఇద్దరు జర్మనీ, ఇద్దరు స్పానిష్ పర్యాటకులు ఉన్నట్లు ప్రభుత్వ వార్తా సంస్థ ‘అజెన్సియా ఆండినా’ వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పెరూ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: అమెరికాకు ఇరాన్ వార్నింగ్: మరో దాడి చేస్తే..


