లిమా: పెరూలోని మధ్య జునిన్ ప్రాంతంలో శనివారం రాత్రి రెండు వరుస భూకంపాలు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వందలాది మంది నిర్వాసితులుగా మారారు. సహాయక బృందాలు ప్రభావిత పర్వత ప్రాంతాలలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. పెరూ నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం రాజధాని లీమాకు సుమారు 300 కిలోమీటర్ల తూర్పున శనివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 5.1, 3.7 తీవ్రతతో ఈ భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం 24 కిలోమీటర్ల లోతులో సంభవించగా, ఆ తర్వాత 18 కిలోమీటర్ల లోతులో రెండవ ప్రకంపన వచ్చింది. మొదటి భూకంప తీవ్రతను యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ అంతకు ముందు 5.6గా అంచనా వేసింది.
At least six people were killed and 21 injured after two earthquakes struck a mountainous region of Peru, the country's civil defense chief said https://t.co/eqr9SW91lF
— Reuters (@Reuters) July 19, 2026
ఈ భూకంపాల ధాటికి సుమారు 48 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, మరో 18 ఇళ్ళు దెబ్బతిన్నాయని పెరూ నేషనల్ సివిల్ డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధి లూయిస్ వాస్క్వెజ్ తెలిపారు. దాదాపు 300 మంది ఈ విపత్తుకు ప్రభావితమయ్యారు. అధికారులు బాధితులకు అత్యవసర సహాయసహకారాలు అందిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లోని చాలా ఇళ్లు సాధారణ మట్టి కట్టడాలతో కూడినవే కావడం వల్ల, బలమైన భూప్రకంపనల సమయంలో అవి దెబ్బతిన్నాయి. శిథిలాలను తొలగించడానికి అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది తక్షణం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉండటం వల్ల పెరూ ప్రపంచంలోనే అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటిగా ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రం చుట్టూ విస్తరించి ఉన్న భారీ భూకంప, అగ్నిపర్వత కార్యకలాపాల బెల్ట్. నాజ్కా టెక్టోనిక్ ప్లేట్ దక్షిణ అమెరికా ప్లేట్ కింద నెమ్మదిగా జారడం వల్ల దేశంలోని భూకంపాలు చోటుచేసుకుంటాయి.


