పగబట్టిన ప్రకృతి! | Sakshi Editorial On Earthquakes | Sakshi
Sakshi News home page

పగబట్టిన ప్రకృతి!

Jun 26 2026 12:46 AM | Updated on Jun 26 2026 12:46 AM

Sakshi Editorial On Earthquakes

శతాబ్ద కాలంలో ఎన్నడూ చవిచూడని పెను ఉత్పాతం గురువారం (స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి) వెనెజులాపై విరుచుకుపడింది. సెకన్ల వ్యవధిలో రెండుసార్లు వచ్చిన భూకంపాలు– మొదట రిక్టర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రతతో, అటుపై 7.5 తీవ్రతతో–ఆ దేశాన్ని కాటేశాయి. వెంటవెంటనే ఇంత తీవ్రతతో భూకంపాలొస్తే జన నష్టం, ఆస్తి నష్టం అపారంగా ఉండే అవకాశాలుంటాయి. అటుపై వరసగా 30 సార్లు ప్రకంపనలు వచ్చాయంటే అదెంత భయానకమో ఊహించవచ్చు. దీంతోపాటే అమెరికాలోని కాలిఫోర్నియాలో, జపాన్‌లో సైతం భూకంపాలు రావటం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని భయపెట్టింది. వీటికితోడు కశ్మీర్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించింది. భూ అంతర్భాగంలో ఏదో చోటు చేసుకోవటం వల్లే ఇలా జరిగిందన్న ఆందోళన కలిగినా ఇవి యాదృచ్ఛికమైనవేనని శాస్త్రవేత్తలు తేల్చారు. జపాన్‌లో ఎప్పుడూ భూకంపాల తాకిడి ఎక్కువ గనుక అక్కడ కూడా 7.2 తీవ్రతతో భూకంపం వచ్చినా పెద్దగా నష్టం కలగలేదు. ఇక వెనెజులా భూకంపానికి సంబంధించి అధికారిక లెక్కల ప్రకారం ఇంత వరకూ మృతుల సంఖ్య వందల్లోనే ఉన్నా... శిథిలాలు తొలగించాక ఇది వేలల్లోకి చేరినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. స్వల్ప వ్యవధిలోనే భూకంపాలు రావటంతో తప్పించుకునే వ్యవధి లేక చాలామంది శిథిలాల్లో చిక్కుకున్నారు. 

పీడ పోకుండానే పిశాచం పట్టుకున్న చందాన వెనెజులా వరస కష్టాలు ఎదుర్కొంటున్నది. ఈ ఏడాది జనవరిలో అమెరికా మెరైన్‌ దళాలు దాడి చేసి దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను అపహరించి తమ దేశానికి తరలించాయి. ఇప్పుడు మదురోపై విచారణ ప్రహసనం నడుస్తోంది. అంతకు చాన్నాళ్ల ముందే అమెరికా ఆంక్షల చట్రంలో ఊపిరాడని దేశ ఆర్థిక వ్యవస్థ 2013 తర్వాత మరింత దెబ్బ తింది. చమురు నిల్వల్లో ప్రపంచంలోనే నంబర్‌ వన్‌గా ఉన్న వెనెజులా అమెరికా పీడ లేకుంటే అత్యంత సంపన్నవంతమైన దేశంగా నిలిచేది. కానీ భారీ ద్రవ్యోల్బణం, అవినీతి, అమెరికా ఆర్థిక ఆంక్షల పర్యవసానంగా దాని జీడీపీ 80 శాతం పడిపోయింది. ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్యూజ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అమెరికా కను సన్నల్లో నడుస్తోంది. దీర్ఘకాలంగా ఉన్న 24,000 కోట్ల డాలర్ల రుణ చెల్లింపును పునర్వ్యవస్థీకరించాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌)ను ఆ దేశం కోరింది. ఈ రెండు భూకంపాలవల్లా దేశ ఆర్థికవ్యవస్థకు దాదాపు పదివేల కోట్ల డాలర్ల వరకూ నష్టం సంభవించి ఉండొచ్చని అమెరికా భౌగోళిక సర్వే అంచనా వేస్తోంది. ఆంక్షల వల్ల దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచటం ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. వంతెనలూ, రోడ్లు, ఆసుపత్రులు, విద్యుత్‌ గ్రిడ్‌లు కాలం చెల్లినవి కావటంతో అవి భూకంపం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

ఇతరేతర విపత్తులు ముందస్తు సూచనలు అందించి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లడానికి వీలుగా మనిషికి కొద్దిపాటి వ్యవధినిస్తాయి. కానీ భూకంపాలు ఎలాంటి సూచనా అందించవు. ఏం జరిగిందో గ్రహించే లోగానే శిథిలాల గుట్టలతో భీతావహుల్ని చేస్తాయి. ఈసారి కొంత నయం. ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లో ఉండే యాక్సెలెరోమీటర్‌ అనే సెన్సర్‌ అయిదు, పది సెకన్ల ముందు హెచ్చరించటంతో చాలామంది అప్రమత్తమై భారీ భవంతులనుంచి దూరం జరిగి ప్రాణాలు కాపాడుకున్నారు. భూకంపం బయలు దేరినప్పుడు మొదట విడుదలై శరవేగంతో విస్తరించే పీ–వేవ్స్‌ (ప్రాథమిక తరంగాలు)ను ఆ సెన్సర్‌ పసిగడుతుంది. ఒకే ప్రాంతంలో అనేక ఫోన్లు ఈ పనిచేసినప్పుడు గూగుల్‌ క్లౌడ్‌ సర్వర్‌లోని అల్గారిథమ్‌ వెనువెంటనే అన్ని ఫోన్లకూ హెచ్చరిక సందేశాన్ని విడుదల చేస్తుంది. 

‘భూకంపాల క్రియాశీల దశ’లోకి భూమి చేరుకుని ఉండొచ్చని పదేళ్లక్రితం భూభౌతిక శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. దానిపై ఇంతవరకూ నిర్ధారణగా చెప్పిందేమీ లేదుగానీ...దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ దేశాలన్నీ ముందు జాగ్రత్తలు తీసుకోవటం మేలు. జపాన్‌ ఈ విషయంలో చాలా ముందంజలో ఉంది గనుక, ఇతర దేశాలు దాన్ని అనుసరించాలి. అలాగే ప్రకృతికి చేటుతెచ్చే విధానాలు కట్టిపెట్టాలి. ఉన్నంతలో పర్యావరణహిత విధానాలు అనుసరిస్తే ఇలాంటి విపత్తులకు ఆస్కారం తక్కువ ఉంటుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement