సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ఐజీఎంసీ)లో ఇది వెలుగు చూసింది. గర్భంలో పెరుగుతున్న ఒక పిండం నోటిలో మరో పిండం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ఈ అరుదైన పరిస్థితిని ‘ఫెటస్ ఇన్ ఫెటు’ (గర్భంలో పిండం)అని అంటారు. సాధారణంగా ప్రసవం తర్వాత బయటపడే ఈ రకమైన కేసులు, గర్భధారణ సమయంలోనే అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా నిర్ధారణ కావడం విశేషం. ఈ కేస్ రిపోర్ట్‌ను వైద్య నిపుణులు ఇటీవల ఒక అంతర్జాతీయ వైద్య పత్రికలో ప్రచురించారు.
మీడియాకు అందిన వివరాల ప్రకారం 20 ఏళ్ల గర్భిణికి 22వ వారంలో నిర్వహించిన సోనోగ్రఫీ పరీక్షలో పిండం దవడలో అసాధారణంగా ఉన్నట్లు వెల్లడైంది. నోటిలో ప్రత్యేక నిర్మాణం కనిపించడంతో వైద్యులు అల్ట్రాసౌండ్, అధునాతన ఇమేజింగ్ పద్ధతుల ద్వారా సమగ్ర పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో నోటిలో ఉన్న ఆ నిర్మాణం 'ఫెటస్ ఇన్ ఫెటు'గా తేలింది. కవలల గర్భధారణ సమయంలో ఒక పిండం సరిగా అభివృద్ధి చెందక, మరొక పిండం శరీరంలో ఉండిపోవడం జరుగుతుంది. అయితే ఇలా నోటి భాగంలో, అది కూడా దవడలో తీవ్రమైన లోపాలతో పరాన్నజీవి పిండం ఏర్పడటం అత్యంత అరుదని వైద్యులు తెలిపారు.
పిండంలో తీవ్రమైన అసాధారణతలు ఉన్నట్లు నిర్ధారించడంతో, గర్భిణి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్యుల సలహా మేరకు చట్టపరమైన ప్రక్రియను అనుసరించి గర్భాన్ని తొలగించారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించడం వల్ల తల్లి ప్రాణాలకు ముప్పు తప్పిందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఐజీఎంసీ వైద్యుల ఈ అరుదైన అనుభవం అంతర్జాతీయ వైద్య రంగంలో గుర్తింపు పొందింది.
ఇది కూడా చదవండి: ‘విరాళాల గోల్‌మాల్’ : ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్!


