వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి | Medical student Priyanka passes away | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

Aug 8 2026 5:21 AM | Updated on Aug 8 2026 5:55 AM

Medical student Priyanka passes away

ఐదురోజులు మృత్యువుతో పోరాడి ఓడిన బాధితురాలు

బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు హైదరాబాద్‌ ఆస్పత్రిలో ప్రకటన 

ఆమె అవయవాలు దానం చేసిన కుటుంబసభ్యులు 

తెలంగాణలోని గద్వాల్‌ జిల్లా ఎక్లాస్‌ పురానికి మృతదేహం తరలింపు 

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మద్యం తాగిన ఇద్దరు యువకులు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఐదురోజులుగా మృత్యువుతో పోరాడుతున్న వైద్య విద్యార్థిని కనికే ప్రియాంక (28) శుక్రవారం మృతిచెందింది. ఈ నెల 3న ప్రియాంక స్నేహితుడితో కలిసి ప్రసాదిత్య మాల్‌లో సినిమాకి వెళ్లి బైక్‌పై బయటకు వస్తుండగా.. మద్యం తాగిన ఇద్దరు యువకులు తమ కారుతో ఆ బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టి వేగంగా వెళ్లిపోయారు. ఈ ఘటనలో ప్రియాంక తలకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత స్థానికంగా ఉన్న స్వతంత్ర ఆస్పత్రిలో చేర్చిన ఆమెను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించారు. ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. కుటుంబసభ్యులు ఆమె అవయవాలను దానం చేశారు. 

ఎంబీబీఎస్‌లో మెరిట్‌ స్టూడెంట్‌ 
కర్నూలు నుంచి తెలంగాణలోని గద్వాల్‌ జిల్లా ఎక్లాస్‌పురానికి వలస వెళ్లిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి వెంకటేష్‌కు ముగ్గురు కుమార్తెలు. వారిలో రెండో కుమార్తె ప్రియాంక. కర్నూలులోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆమె మెరిట్‌ స్టూడెంట్‌గా ప్రతిభ కనబర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న రాజమహేంద్రవరంలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో పీజీ డెర్మటాలజీలో చేరింది. ప్రియాంక మృతి వార్తతో ఎక్లాస్‌పురంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి శుక్రవారం రాత్రి ఎక్లాస్‌పురానికి తీసుకెళ్లి, శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

నిందితులకు 14 రోజుల రిమాండ్‌ 
వైద్య విద్యార్థిని వెళుతున్న బైక్‌ను కారుతో ఢీకొట్టి ఆమె మృతికి కారకులైన సూరారపు ధస్వంత్, ఆండ్రు జోసెఫ్‌లను పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించడంతో వారిని రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. వీరిలో సూరారపు ధస్వంత్‌ సున్నపుబట్టీల వ్యాపారికాగా ఆండ్రు జోసెఫ్‌ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నారు.

వారిద్దరు ఘటన జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్‌ బ్యారెల్‌ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి కారులో కూర్చుని కొంతసేపు తాగారు. తర్వాత మరో ప్రాంతంలో కూర్చుని తాగి, అనంతరం ప్రసాదిత్య మాల్‌కు వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరూ కారుని అతివేగంగా లోపలికి పోనివ్వడం, మాల్‌ సిబ్బంది వారిని అడ్డుకోవడం, వారు అదే వేగంతో బయటకు వెళుతూ ప్రియాంక కూర్చున్న బైక్‌ను మూడుసార్లు ఢీకొట్టిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement