డిజైన్‌.. ఫీజు దిమ్మతిరిగెన్‌.. | Permission to pay additional fees to Foster and Partners and designer of construction works in Amaravati | Sakshi
Sakshi News home page

డిజైన్‌.. ఫీజు దిమ్మతిరిగెన్‌..

Aug 8 2026 5:48 AM | Updated on Aug 8 2026 5:49 AM

Permission to pay additional fees to Foster and Partners and designer of construction works in Amaravati

హైకోర్టు, అసెంబ్లీ డిజైన్‌లకు ఏకంగా రూ.206.59 కోట్లు 

2025లో ఈ పనులు ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌కు రూ.136.90 కోట్లకు అప్పగింత 

తాజాగా వివిధ కారణాలు చూపుతూ అదే సంస్థకు భారీగా పెంపు 

నిర్మాణ వ్యయంలో 5.20 శాతం డిజైన్, ఆర్కిటెక్చర్‌ సేవలకు చెల్లించడానికి సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ 

2016లో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుతో కూడిన ఏజీసీ మాస్టర్‌ ప్లాన్, డిజైన్‌లు తయారీ 

అప్పట్లో ఆ పనులు చేసిన ఇదే సంస్థకు రూ.67.86 కోట్లు చెల్లింపు 

సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వ్యయమే కాకుండా, వాటి ఆర్కిటెక్చర్‌ డిజైన్‌లను రూపొందించే ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ (యూకే) సంస్థకు చెల్లించే మొత్తాన్ని రూ.136.90 కోట్ల నుంచి రూ.206.59 కోట్లకు ప్రభుత్వం పెంచేసింది. హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం పెరగడం, అత్యాధునిక డిజైన్‌ల కోసం అదనపు నిపుణులను నియమించాల్సి రావడం, డిజైన్లను వేగంగా సమర్పించడం, బ్రిటీష్‌ పౌండ్‌ మారకపు విలువ పెరగడం.. వాటికి జీఎస్టీ కలపడం వల్ల ఫీజు వ్యయం పెరిగినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు డిజైనర్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌కు అదనంగా చెల్లించేందుకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణ వ్యయం ఇప్పటికి రూ.3,975.12 కోట్లు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే.. వాటి నిర్మాణ వ్యయంలో 5.20 శాతాన్ని డిజైన్‌ల కోసం చెల్లిస్తుండటంపై ఇంజినీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా నిలిచే భవనానికే డిజైన్‌ల వ్యయం దాని నిర్మాణ వ్యయంలో ఒకటి లేదా 1.5 శాతం లోపే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో బ్రిటీష్‌ పౌండ్‌ మారకపు విలువ పెరిగితే మళ్లీ డిజైనర్‌కు చెల్లించే మొత్తం పెరుగుతుందన్నది ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో చెప్పకనే చెప్పింది. 

రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలను నిర్మించే ప్రాంతాన్ని అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ (ఏజీసీ) అని ప్రభుత్వం నామకరణం చేసింది. ఏజీసీ మాస్టర్‌ ప్లాన్‌తోపాటు కొత్త సచివాలయం టవర్లు, హైకోర్టు, అసెంబ్లీ భవనాల డిజైన్‌లను 2016లోనే ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ రూపొందించింది. ఇందుకు ఆ సంస్థకు రూ.67.86 కోట్లు అప్పట్లోనే చెల్లించారు. ఇప్పుడు కేవలం హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర డిజైన్‌ల కోసం ఏకంగా రూ.206.59 కోట్లు చెల్లిస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 

హైకోర్టు శాశ్వత భవనం వ్యయం రూ.2,027.76 కోట్లు 
»  హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి, మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో 4.52 శాతం అధిక (ఎక్సెస్‌) ధరకు అంటే రూ.786.05 కోట్లకు కోట్‌ చేసిన ఎన్‌సీసీ లిమిటెడ్‌ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్‌లో సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ లెక్కన హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్నమాట.  

» ఈ భవనానికి హైసైడ్‌ ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ (హీటింగ్‌ వెంటిలేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ (సీసీ టీవీ, ఫైర్‌ అలారమ్‌తో కూడిన భద్రత వ్యవస్థ) పనులు చేపట్టడానికి మరో రూ.556 కోట్లను మంజూరు చేస్తూ ఫిబ్రవరి 27న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  

» హైకోర్టు శాశ్వత భవనం వెలుపల అభివృద్ధి పనులు చేపట్టేందుకు జూన్‌ 5న రూ.547.07 కోట్లు మంజూరు చేసింది. దాంతో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ వ్యయం రూ.2,027.76 కోట్లకు చేరుకుంది. ఈ భవనాన్ని ఏజీసీలో ‘ఎఫ్‌’ బ్లాక్‌లో 42.36 ఎకరాల్లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తోంది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.9,978లు చొప్పున ఖర్చు చేస్తోంది.  

» రాజధాని అమరావతిలో ఇప్పటికే రూ.173 కోట్ల వ్యయంతో హైకోర్టు తాత్కాలిక భవనాన్ని 2017–18లో ప్రభుత్వం నిర్మించింది. కొత్త భవనం పూర్తయితే తాత్కాలిక భవనం కోసం చేసిన వ్యయం రూ.173 కోట్లు వృథా అవనుంది.  

అసెంబ్లీ భవనం నిర్మాణ వ్యయం చదరపు అడుగు రూ.17,356.54  
» అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్‌లో బేస్‌మెంట్, గ్రౌండ్‌ ఫ్లోర్, 3 అంతస్తుల్లో (బీ+జీ+3) 11,21,975 చదరపు అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్‌ను కూడా ఫోస్టర్స్‌ అండ్‌ పార్టనర్స్‌ సంస్థే రూపొందించింది.  
» ఈ భవన నిర్మాణ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్‌ విధానంలో 24 నెలల్లో పూర్తి చేసి.. మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ టెండర్‌లో 4.48 శాతం అధిక ధరకు అంటే రూ.617.33 కోట్లకు కోట్‌ చేసిన ఎల్‌ అండ్‌ టీ లిమిటెడ్‌ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్‌ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. 
» ఇటీవల ఈ భవనంలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్‌వీ పనులు చేపట్టేందుకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.  
»  అసెంబ్లీ భవనంలో స్పైర్, పార్కింగ్‌ రింగ్, రింగ్‌ రూఫ్‌ వంటి సివిల్‌ స్ట్రక్చర్‌ పనులు చేపట్టడానికి మరో రూ.798 కోట్లు మంజూరు చేసింది. దాంతో అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం రూ.1,947.36 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగు రూ.17,356.54 కోట్లకు చేరుకుంది. రెండున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.971 కోట్లతోనే అత్యాధునిక వసతులతో భారత మణిహారంలో కలికితురాయిగా నిలిచేలా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం గమనార్హం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement