కాంగ్రెస్ మీటింగ్‌లో ట్విస్ట్‌.. మాజీ సీఎం ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు.. | Punjab Congress Clash: 'Bhupesh Baghel Go Back' Slogans at Party Meeting | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మీటింగ్‌లో ట్విస్ట్‌.. మాజీ సీఎం ‘గో బ్యాక్’ అంటూ నినాదాలు..

Aug 7 2026 11:52 AM | Updated on Aug 7 2026 12:00 PM

Punjab Congress Baghel go back slogans In party meeting

పంజాబ్ కాంగ్రెస్‌లో పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తున్న ‘హర్ బూత్, కాంగ్రెస్ మజ్‌బూత్’ సంస్థాగత కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ భూపేష్ బఘేల్‌కు వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ‘భూపేష్ బఘేల్‌ గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది.

కాగా, పార్టీ ఇన్‌చార్జ్‌ భూపేశ్ బఘేల్, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ వేదికపై ఉన్న సమయంలోనే కొందరు కార్యకర్తలు ‘బఘేల్ గో బ్యాక్’ అని ముద్రించిన టీ షర్టులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, మాజీ మంత్రి భారత్ భూషణ్ అషుకు అనుకూలంగా కూడా నినాదాలు చేశారు. అనంతరం, పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నిరసనకారులను బయటకు వెళ్లాలని రాజా వారింగ్ కోరారు. దీంతో వారింగ్, అషు అనుచరుల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకుంది.

అనంతరం స్పందించిన రాజా వారింగ్.. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన వారు ఆర్‌ఎస్‌ఎస్ అనుకూల వర్గం అంటూ ఆరోపించారు. తమ కార్యక్రమాలను భంగం కలిగించే ప్రయత్నం జరుగుతుందనే ముందస్తు సమాచారం తమకు ఉందని చెప్పుకొచ్చారు. కొద్దిమంది మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యక్రమాలకు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు. అయితే, రాజా వారింగ్ వ్యాఖ్యలను భారత్ భూషణ్ అషు అనుచరులు తీవ్రంగా ఖండించారు.‘మేము కాంగ్రెస్ కార్యకర్తలమే. మాకు కాంగ్రెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం రాజా వారింగ్‌కు లేదు’ అంటూ వారు స్పందించారు.

మరోవైపు.. రాజా వారింగ్ మాట్లాడుతూ, గతంలో విజిలెన్స్ బ్యూరో కేసులో అషు అరెస్టు అయినప్పుడు ఎనిమిది రోజుల పాటు విజిలెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆయనకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకుడి వ్యక్తిగత ఆస్తి కాదని, అందరి పార్టీ అని స్పష్టం చేశారు. మరోవైపు భూపేష్ బఘేల్‌ స్పందిస్తూ.. పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రమశిక్షణా ఉల్లంఘనలను ఏమాత్రం సహించబోమని, బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్‌కు బయట ప్రత్యర్థులతో పాటు పార్టీలోనే ఉన్న ‘స్లీపర్ సెల్స్, ‘అంతర్గత విధ్వంసక శక్తులను’ కూడా గుర్తించి బయటకు పంపాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement