ఆ ముగ్గురే సూత్రధారులు  | Inside NEET Leak Network: Experts Chits and Telegram Trail Exposed | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురే సూత్రధారులు 

Aug 7 2026 11:32 AM | Updated on Aug 8 2026 5:10 AM

Inside NEET Leak Network: Experts Chits and Telegram Trail Exposed

నీట్‌ ప్రశ్నలను బయటకు చేర్చిన సబ్జెక్టు నిపుణులు

ప్రశ్నలను అనువాదం చేసే సమయంలోనే ఈ బాగోతం  

కాగితం ముక్కలపై రాసుకొని, గుర్తుపెట్టుకొని, పుస్తకాల్లో మార్క్‌ చేసి..  

వేర్వేరు పద్ధతుల్లో ప్రశ్నల లీకేజీ  

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ  

న్యూఢిల్లీ: నీట్‌ పేపర్‌ లీకేజీకి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్టిఏ)కు చెందిన ముగ్గురు సబ్జెక్టు నిపుణులు పి.వి.కులకర్ణి(కెమిస్ట్రీ), మనీషా సంజయ్‌ హవల్దార్‌(ఫిజిక్స్‌), మనీషా గురునాథ్‌ మంధారే(బోటనీ, జువాలజీ) కీలక సూత్రధారులు అని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ కోర్టులో తాజాగా 94 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసింది. 

కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లో ప్రశ్నపత్రాల అనువాదం లేదా పునరనువాదం సమయంలో రఫ్‌ వర్క్‌ (ప్రాథమిక పని) కోసం ఈ ముగ్గురు నిపుణులకు ఖాళీ కాగితాలను అందించినట్లు విచారణలో తేలింది. 

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు పి.వి.కులకర్ణి రసాయన శా్రస్తానికి సంబంధించిన మొత్తం 135 ప్రశ్నలను, వాటి సమాధానాల ఆప్షన్లను చిన్న కాగితం ముక్కలపై క్లుప్తంగా రాసుకుని, వాటిని రహస్యంగా బయటకు తీసుకెళ్లాడని చార్జ్‌షీట్‌లో సీబీఐ అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్టీఏ ఆఫీసులోని కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌లోకి ప్రవేశించేటప్పుడు లేదా నిష్క్రమించేటప్పుడు సబ్జెక్టు నిపుణులను తనిఖీ చేయడం గానీ, సోదా చేయడం గానీ జరగలేదని తెలియజేశారు. కులకర్ణి సులభమైన కొన్ని ప్రశ్నలను కంఠస్థం చేసి, తన హోటల్‌ గదికి తిరిగి వచ్చిన తర్వాత వాటిని ఒక కాగితంపై రాసుకున్నాడని పేర్కొన్నారు. సీబీఐ చార్జిషీట్‌లో ఇంకా ఏం ప్రస్తావించారంటే..  

నిందితులకు కలిసొచ్చిన పరిస్థితులు  
ఎన్టిఏలో బోటనీ పేపర్‌ను ఇంగ్లిష్‌ నుంచి మరాఠీ భాషలోకి అనువాదకురాలిగా, జువాలజీ పేపర్‌ పునరనువాదకురాలిగా పనిచేసిన మనీషా మంధారే ఆ రోజు తన పని ముగించుకుని హోటల్‌ గదికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో సంబంధిత పేరాలను మార్క్‌ చేసేవారు. ఆయా సబ్జెక్టులపై ఆమెకు ఉన్న దశాబ్దాల అనుభవంతో నీట్‌ ప్రశ్నలను ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలోని సంబంధిత అంశాలతో సులభంగా అనుసంధానించగలిగారు.

 మార్క్‌ చేసిన పేరాల ఆధారంగా ఆయా ప్రశ్నలు, వాటి జవాబులను గుర్తించారు. ఇక ఫిజిక్స్‌ ప్రశ్నల అనువాదకుడిగా పనిచేసిన మనీషా సంజయ్‌ హవల్దార్‌ రోజువారీ పని ముగించుకుని ఢిల్లీలోని తన బసకు తిరిగి వచ్చిన తర్వాత ప్రశ్నలను క్లుప్తంగా రాసుకునేవారు. ఎన్టీఏ కార్యాలయంలో సీసీటీవీ లైవ్‌ ఫీడ్‌ను పర్యవేక్షించడానికి ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ లేకపోవడం నిందితులకు బాగా కలిసొచ్చింది. వారి నిర్వాకం ఎవరి దృష్టికీ రాలేదు. నీట్‌ పేపర్‌లోని తుది ప్రశ్నలు ఆయా నిపుణుల నుంచి మధ్యవర్తులకు, సమన్వయకర్తలకు చేరాయి.  

అభ్యర్థులతో సంప్రదింపులు  
కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్లు, కన్సల్టెన్సీలను నడిపించే తేజస్‌ హర్షద్‌కుమార్‌ షా, డాక్టర్‌ మనోజ్‌ భగవాన్‌రావ్‌ షిరూరే, శివరాజ్‌ మోతేగాంకర్, ధనంజయ్‌ నివృత్తి లోఖండే, శివరాజ్‌ రఘునాథ్‌ మోతేగాంకర్‌లకు నీట్‌ ప్రశ్నలు చేరాయి. ఈ మొత్తం ప్రక్రియలో చివరి దశగా రాజస్తాన్‌లోని శుభమ్‌ మధుకర్‌ ఖైర్నార్, మంగిలాల్‌ బివాల్, దినేష్‌ బివాల్, వికాస్‌ బివాల్, హరియాణాలోని యశ్‌ యాదవ్‌ ద్వారా నీట్‌ అభ్యర్థులకు చేరాయి. శుభమ్‌ మధుకర్‌ ఖైర్నార్‌ డబ్బు కోసం అభ్యర్థులతో సంప్రదింపులు జరిపాడు. సెక్యూరిటీ కోసం వారి విద్యా పత్రాలు, ఖాళీ చెక్కులను సేకరించాడు. మధ్యవర్తులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వ్యవహారం చక్కబెట్టాడు. మంగిలాల్‌ బివాల్‌ మొబైల్‌ ఫోన్‌ నుంచి సేకరించిన ఆడియో ఫైళ్లు ఈ కుట్రకు సంబంధించిన ప్రణాళికను బట్టబయలు చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement