సైన్యంలోకి యువరాణి..!రాచరిక చరిత్రలో అరుదైన ఘట్టం.. | Princess Isabella: First Danish Royal Woman To Begin Military Service | Sakshi
Sakshi News home page

సైన్యంలోకి అందాల యువరాణి..!రాచరిక చరిత్రలో అరుదైన ఘట్టం..

Aug 6 2026 12:50 PM | Updated on Aug 6 2026 12:53 PM

Princess Isabella: First Danish Royal Woman To Begin Military Service

డెన్మార్క్‌ యువరాణి ఇసాబెల్లా 11 నెలల సైనిక శిక్షణను ప్రారంభించి,  పూర్తిస్థాయి సైనిక సేవలో చేరిన డానిష్ రాజకుటుంబం మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. ఇది డానిష్‌ రాచరిక చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం. కింగ్ ఫ్రెడరిక్ ఎక్స్‌, క్వీన్‌ మేరీల పెద్ద కుమార్తె హైస్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొద్ది వారాలకే గార్డ్ హుస్సార్ రెజిమెంట్‌లో చేరారు. తన వేసవి సెలవుల నుంచి తిరిగి వచ్చిన ఇసాబెల్లా తన మొదటి రోజున ఎవరికీ కనపడకుండా ఒక నల్లటి ఎస్‌యూవీలో స్వయంగా బ్యారక్స్‌కు వెళ్లారు. 

వదులుగా ఉండే జీన్స్, స్వెడ్ జాకెట్ వంటి సాధారణ దుస్తులలో, ఆమె ఒక పెద్ద బ్యాక్‌ప్యాక్, ఒక చిన్న పర్సును పట్టుకుని ప్రవేశ ద్వారం వైపు నడిచింది. అక్కడ విధిలో ఉన్న గార్డుకు తన గుర్తింపు పత్రాన్ని చూపించింది. అక్కడే ఉన్న కొద్దిమంది పాత్రికేయులకు, ఫోటోగ్రాఫర్లకు అభివాదం చేసి మరి లోనికి వెళ్లారు. యువరాణి ఇసాబెల్లా తన అన్నయ్య యువరాజు క్రిస్టియన్‌ అడుగుజాడల్లో నడుస్తోంది. అతను అదే బ్యారక్స్‌లో తన సైనిక సేవను శిక్షణను పూర్తి చేసి, ఇప్పుడు సెకండ్ లెఫ్టినెంట్‌గా శిక్షణ పొందుతున్నాడు. 

డెన్మార్క్ రాజకుటుంబ సభ్యులు సాంప్రదాయకంగా సాయుధ దళాలలో సేవ చేస్తారు, కానీ దేశం విస్తరించిన కార్యక్రమం కింద క్రియాశీల సైనిక నిర్బంధాన్ని రాజకుటుంబం నుంచి పూర్తి చేసిన తొలి మహిళ ఇసాబెల్లా. అయితే ఆమె ఇతర సైనికుల్లా కాకుండా జీతం లేకుండా పనిచేయనుంది. ఆమె చెల్లింపులను తిరస్కరించినట్లు సమాచారం. బదులుగా తన సైనిక సేవ సమయంలో పేరెంట్స్‌ ఇచ్చే ఆర్థిక సహాయంపై ఆధారపడుతుంది రాజకుటుంబం ధృవీకరించింది. నిజానికి డెన్మార్క్‌లో సైనికులు సాధారణంగా వారి 11 నెలల సేవలో పన్ను రహిత రోజువారీ భత్యంతో పాటు నెలవారీ జీతం పొందుతారు.

సైనిక సేవను విస్తరిస్తోన్న డెన్మార్క్‌..
ఉక్రెయిన్‌లో యుద్ధం, ఆర్కిటిక్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలతో సహా ఐరోపాలో పెరుగుతున్న భద్రతాపరమైన ఆందోళనలకు ప్రతిస్పందనగా డెన్మార్క్ తన సాయుధ దళాలను బలోపేతం చేస్తున్న తరుణంలో ఇసాబెల్లా సైన్యంలో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఈ దేశం 2024లో మహిళలకు తప్పనిసరి సైనిక సేవను ప్రవేశపెట్టి, సేవా కాలాన్ని నాలుగు నెలల నుంచి 11 నెలలకు పొడిగించింది. 

ఈ వారం సుమారు 1,600 మంది యువకులు కొత్తగా పొడిగించిన సైనిక సేవను ప్రారంభించారు. ఈ నెల చివరలో, కార్యకలాపాలకు సంబంధించిన విధుల్లో సహకరించేందుకు కొంతమంది రిక్రూట్‌లను మొదటిసారిగా గ్రీన్‌లాండ్‌కు కూడా పంపనున్నారు.

(చదవండి: చెత్తలో పారేసిన లాటరీ టికెట్‌..ఏకంగా అన్ని కోట్లా..! కన్నీళ్లు పెట్టుకున్న మహిళ)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement