అఖిలేశ్‌కు షాక్ ఇచ్చిన యోగి సర్కార్ | Yogi Govt Scraps 2016 UP Madrasa Salary Bill | Sakshi
Sakshi News home page

అఖిలేశ్‌కు షాక్ ఇచ్చిన యోగి సర్కార్

Aug 6 2026 8:47 AM | Updated on Aug 6 2026 8:47 AM

Yogi Govt Scraps 2016 UP Madrasa Salary Bill

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ హయాంలో తీసుకువచ్చిన వివాదాస్పద ఉత్తరప్రదేశ్ మదర్సా (ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగుల వేతనాల చెల్లింపు) బిల్లు-2016ను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాసనసభ ఉభయ సభల నుంచి అధికారికంగా వెనక్కి తీసుకుంది. దీనితో సుమారు ఒక దశాబ్దంగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు అధ్యాయం పూర్తిగా ముగిసింది. చట్టపరమైన, రాజ్యాంగపరమైన అడ్డంకుల కారణంగా ఈ బిల్లు ఎప్పుడూ అమలులోకి రాలేదు.

ఎస్పీ ప్రభుత్వ హయాంలో 2016లో మదర్సాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి క్రమం తప్పకుండా వేతనాలు అందజేసే ఉద్దేశంతో ఈ బిల్లును అసెంబ్లీ, మండలిలో ఆమోదించారు. అయితే, వేతనాల చెల్లింపులో ఆలస్యమైతే అందుకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చనే నిబంధనతో సహా పలు అంశాలపై తీవ్ర వివాదం చెలరేగింది.

ఉభయ సభల ఆమోదం తర్వాత ఈ బిల్లును నాటి గవర్నర్ రామ్ నాయక్ పరిశీలనకు పంపారు. కొన్ని నిబంధనలపై ఆయన అసమ్మతి తెలుపుతూ, రాష్ట్రపతి ఆమోదం కోసం దానిని కేంద్రానికి పంపించారు. కేంద్ర హోంశాఖ ఈ బిల్లును పరిశీలించి, దీనిలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగ, చట్టపరమైన దృక్పథంలో సరైనవి కాదని స్పష్టం చేసింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ బిల్లును వెనక్కి తీసుకోవడం జరిగింది.

ఎలాంటి రాజ్యాంగబద్ధమైన ఆమోదం పొందకుండా, ఎన్నడూ అమలుకు నోచుకోని ఈ బిల్లును శాశ్వతంగా నిలిపివేస్తూ యోగి ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల పాటు వివిధ శాఖల పరిశీలనలో అపరిష్కృతంగా ఉన్న ఈ అంశానికి తాజా పరిణామంతో చరమగీతం పాడారు.

ఇది కూడా చదవండి: హోర్ముజ్ దౌత్యంలో ఇరాన్ సామ్రాజ్య కాంక్ష.. అమెరికా ఉక్కుపాదం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement