టెహ్రాన్/వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధిపై ఒమన్‌తో కుదుర్చుకుంటున్న ఒప్పందం తుది దశకు చేరుకుందని ఇరాన్ వెల్లడించింది. త్వరలోనే ఈ అంశంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ జలసంధిని మళ్లీ తెరిచే దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు ఈ పరిణామాలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి. అయితే ఈ ఒప్పందం అమలులో పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. వ్యూహాత్మక జలమార్గంపై ఇరాన్ తన ప్రభావాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఇరాన్‌కు నియంత్రణ కల్పించే లేదా రవాణా సుంకాలు వసూలు చేయడానికి అనుమతించే ఏ ఒప్పందాన్నయినా అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఒమన్‌తో ఒప్పందానికి సంబంధించి ముసాయిదా తయారీ తుది దశకు చేరుకుందని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘీ తెలిపారు. కొన్ని వర్గాలు దీనికి ఆటంకం కలిగించకపోతే త్వరలోనే సంయుక్త ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. ఈ చర్చల గురించి తెలిసిన ఇద్దరు ప్రాంతీయ అధికారులు మాట్లాడుతూ, ఇరాన్, ఒమన్ ప్రతినిధులు ముసాయిదా ఒప్పందాన్ని ఖరారు చేశారని, ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతొల్ల అలి ఖమేనీ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు, ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు కష్టతరంగానే ఉన్నాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఈ ఘర్షణలను ముగింపునకు తెచ్చే ప్రయత్నాలు క్లిష్టంగా మారాయని, కొన్నిసార్లు చర్చలు ముందుకు వెళ్లడానికి బదులు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. కాగా, ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో ఐదో వంతు హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. ఈ ఘర్షణల కారణంగా ఈ సముద్ర మార్గంలో రవాణా తీవ్రంగా దెబ్బతిని, ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
ఇదిలాఉంటే, యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు సౌదీకి చెందిన చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించారు. గల్ఫ్‌లోనూ ఒక వాణిజ్య నౌక సమీపంలో పేలుడు సంభవించినట్లు సమాచారం. మరోవైపు, ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి మళ్లీ తూట్లు పడ్డాయి. దక్షిణ లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.
ఇది కూడా చదవండి: మనిషికి బదులు ఏఐని బాస్‌గా పెడితే..


