తమిళ హీరో రవి మోహన్ అలియాస్ జయం రవి విడాకుల వ్యవహారంలో మరో ట్విస్ట్. తనతో పాటు పిల్లల మెంటెయినెన్స్ కోసం తన భర్త నెలకు రూ.40 లక్షల భరణం ఇచ్చే సదుపాయం కల్పించాలని ఆర్తి కోర్టుని ఆశ్రయించింది. సదరు పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.3 లక్షలు ఇస్తే చాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఆర్తి తల్లి సుజాత విజయకుమార్ స్పందించారు. భరణం వార్తలని ఖండించారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.
(ఇదీ చదవండి: డిలీట్ చేయకపోతే కేసు పెడతా: మృణాల్ ఠాకుర్)
'ఆర్తి తన కోసం నెలకు రూ.40 లక్షలు అడగలేదు. రవిమోహన్ వల్ల మాకు చాలా అప్పులు ఉన్నాయి. ఇంటిపై బ్యాంకు జప్తు నోటీసు కూడా జారీ అయింది. పిల్లల స్కూల్ ఫీజులు, ఆహారం, ట్యూషన్ ఖర్చులు భరించడం మాకు చాలా కష్టంగా మారింది. పిల్లల విద్య, కుటుంబ పోషణకు సంబంధించి ఇప్పటికే కోర్టు రవిమోహన్‌కు ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు చదువుతున్న అమెరికన్ స్కూల్ ఏడాది ఫీజు రూ.86 లక్షలు రవిమోహనే చెల్లించాలని కోర్టు తెలిపింది. ఆర్తికి నెలకు రూ.3 లక్షలు, కొడుకులు ఆరవ్, అయాన్‌లకు తలో రూ.1 లక్ష చొప్పున ప్రతి నెల చెల్లించాలని స్పష్టం చేసింది. పిల్లల అదనపు విద్య, ఇతర కార్యకలాపాల ఖర్చులని కూడా భరించాలని పేర్కొంది' అని సుజాత చెప్పుకొచ్చారు.
రవిమోహన్.. పిల్లలని కలవకుండా ఆర్తి అడ్డుకుందనే ఆరోపణలని కూడా సుజాత ఖండించారు. 'మేమెప్పుడూ పిల్లలు తండ్రిని కలవొద్దని చెప్పలేదు. గత రెండేళ్లుగా ఇరువర్గాలను కలిపేందుకు ప్రయత్నించాం. ఇప్పుడు కోర్టు క్రమం తప్పకుండా తండ్రి-పిల్లలు కలుసుకునేలా ఆదేశాలు ఇవ్వడం మాకు ఊరటనిచ్చింది. గతంలో ఈ మీటింగ్స్ ఒక హీలర్ సమక్షంలో జరగాలనే రూల్ ఉండేసరికి పిల్లలు అసౌకర్యానికి గురయ్యారు. అందుకే వారు రాలేదు. ఏ తల్లి కూడా పిల్లలని తండ్రికి దూరం చేయాలని కోరుకోదు. ఈ నెల నుంచి కుటుంబంలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశిస్తున్నాను' అని అన్నారు.
2009లో పెళ్లి చేసుకున్న రవి మోహన్.. దాదాపు 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ 2024 సెప్టెంబరులో ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ విడాకుల వ్యవహారంలో కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.
(ఇదీ చదవండి: త్రిష.. రాజకీయాల్లోకి రావాలి)


