గాంధీనగర్: గుజరాత్‌లో చాందీపురా వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 22 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 35 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 15 సంవత్సరాల వయసు లోపు పిల్లల్లో దాదాపు 184 అనుమానిత కేసులు వెలుగుచూడగా, వాటిలో 11 నమూనాల పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది. గాంధీనగర్, సబర్కాంత-హిమత్‌నగర్, పటాన్, రాజ్‌కోట్, భావ్‌నగర్ సివిల్ ఆస్పత్రులలో ఏడుగురు బాధితులు అత్యవసర ప్రత్యేక వైద్యసేవలు పొందుతుండగా, ఆరుగురు కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు ఆరోగ్య మంత్రి ప్రఫుల్ పాన్షేరియా తెలిపారు.
నివారణ చర్యలు.. అత్యవసర ప్రణాళిక
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి బృందాలను రంగంలోకి దించింది. మట్టి గోడల్లోని పగుళ్లను పూడ్చివేయాలని, పశువుల పాకల చుట్టూ క్రిమిసంహారక మందులను పిచికారీ చేయాలని అధికారులు ప్రజలను కోరారు. తీవ్రమైన లక్షణాలు ఉన్నవారికి మల్టీ-ఆర్గన్ ఫెయిల్యూర్ రాకుండా ఆస్పత్రులలో ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయం ఉన్న ఐసీయూ బెడ్లపై తక్షణ చికిత్స అందించాలని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించారు.
చాందీపురా వైరస్ అంటే ఏమిటి?
మహారాష్ట్రలోని చాందీపురా గ్రామంలో 1965లో ఈ వైరస్ తొలిసారిగా వెలుగుచూసింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఇది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన ఆర్ఎన్ఏ వైరస్. దోమలు, పేలు, ఇసుక ఈగలు (శాండ్‌ఫ్లైస్) ద్వారా ఇది వ్యాపిస్తుంది. ముఖ్యంగా మట్టి లేదా ఇసుకతో నిర్మించిన ఇళ్ల గోడల పగుళ్లలో ఇసుక ఈగలు జీవిస్తాయి. 9 నెలల నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
వైద్య నిపుణుల హెచ్చరిక
వర్షాకాలంలో పిల్లలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని బీహార్‌లోని పట్నాకు చెందిన ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ కన్సల్టెంట్ డాక్టర్ నేహా ఖాన్ తెలిపారు. ఈ వైరస్‌ను నివారించడానికి ప్రస్తుతం ఎటువంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదని తెలిపారు. మొదట జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, ఆ తర్వాత మెదడు వాపు వ్యాధికి (ఎన్సెఫాలిటిస్) దారితీసి మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని వివరించారు. అయితే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని, ఇది అంటువ్యాధి కాదని ఆమె తెలిపారు.
ఇది కూడా చదవండి: ప్రశాంత్ కిశోర్ విజయం వెనుక సీజేపీ వ్యూహం?


