బంగ్లాదేశ్, నేపాల్‌లతో పని లేదు
మనకు మహాత్ముడు ఉన్నాడు
జెన్ జీ ఉద్యమంపై సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే వ్యాఖ్య
పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ
ఛత్రపతి శంభాజీనగర్: విద్యార్థి లోకం ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన స్ఫూర్తి కోసం బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగుదేశాల వైపు చూడాల్సిన అగత్యంలేదని, మనకు మహాత్మాగాంధీ ఉన్నారని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే వ్యాఖ్యానించారు. సోమవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో పీటీఐకి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీప్కే పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
‘‘ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి కణికలు దేశ నలుచెరుగులా ఎగసిపడుతుండగా మళ్లీ ఉద్యమస్ఫూర్తి కోసం విదేశాల వైపు చూడాల్సిన అగత్యం మన యువతరానికి పట్టలేదు. వాస్తవానికి బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఉద్యమాలకు భారత ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగిన ప్రయత్నాలు. అక్కడ ఉద్యమాలు హింసాత్మక బాటలో కొనసాగాయి. కానీ భారత్‌లో మనం ప్రత్యేకం. రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాం.
మన విద్యార్థుల విదేశీయుల మాదిరి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకారు. సంయమంతో డిమాండ్ల సాధన కోసం పోరాడతారు. జంతర్ మంతర్‌లో ఎంతో మంది విద్యార్థులు, సీజేపీ కార్యకర్తల తలలు పగలాయి. కాళ్లు, చేతులు విరిగాయి. అయినాసరే సంయమనం కోల్పోకుండా మొక్కవోని దీక్షతో నీట్ ఉదంతం సహా పరీక్షల వ్యవస్థ, విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం శాంతియుతంగా పోరాడారు’’అని అన్నారు.
విద్య ప్రధాన అజెండాగా మారాలి
‘‘దేశంలో ప్రతి ఎన్నికల్లోనూ కులం, మతం, ప్రాంతం వంటివి ప్రధానాంశాలుగా మారే సంస్కృతికి చరమగీతం పాడుదాం. ఎన్నికల్లో విద్య అనేది ప్రధాన అజెండాగా మారాలి. విద్యకు ఎన్నికల్లో ప్రధాన అజెండా హోదా దక్కకపోతే భవిష్యత్ గురించి ఆలోచన పెట్టుకోవడం వృథా. దేశ భవిష్యత్తకు విద్య అనేదే అసలైన పెట్టుబడి. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీతో మనస్తాపం చెంది ప్రాణాలుతీసుకున్న బాధితుల కుటుంబాలకు హామీ ప్రకారం అందజేస్తామన్న నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మంజూరుచేయకపోవడం దారుణం. రాత్రికిరాత్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వందల అధికార పారీ్టల వద్ద కోట్లకొలదీ డబ్బు ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలను కొనేందుకు వందల కోట్ల నగదును సిద్ధంగా ఉంచుకుంటారు. తీరా నీట్ ఉదంతంలో బాధిత విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలంటే మాత్రం రూపాయి కూడా బయటకు తీయరు. ఇకనైనా బాధితులకు వీలైనంత త్వరగా నష్టపరిహారం ఇవ్వాలి. ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమబాటలో పయనిస్తాం’’అని దీప్కే స్పష్టంచేశారు.
బీజేపీ నేతల స్థాయి మాకు చేతకాదు
‘‘బీజేపీ నేతలు పార్లమెంట్‌లో, సభలు, సమావేశాల్లో ఇష్టమొచి్చనట్లు మాట్లాడతారు. అంతటి తెలివితేటలు, స్థాయి మా జెన్ జీ తరానికి లేవు. అది మాకు చేతకాదు. గూండాలకు, విద్యార్థులకు చాలా తేడా ఉంది. ఆ తేడా ఎప్పుడూ ఉంటుంది’’అని బీజేపీపై వెటకారంగా మాట్లాడారు.
జార్ఖండ్‌లో పోరుకు మా మద్దతు
‘‘జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల్లో తీవ్రస్థాయిలో అవకతవకలు జరిగాయి. న్యాయం కోసం జార్ఖండ్‌లో పరీక్షార్థులు ఉద్యమిస్తున్నారు. వాళ్లకు మా సీజేపీ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. పబ్లిక్ సరీ్వస్ పరీక్షలతోపాటు ఇతర నియామక పరీక్షల్లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందే. నియామక ఏజెన్సీల్లో సంస్కరణలు తేవాలి. జార్ఖండ్‌లో పరీక్షార్థుల ఉద్యమం ఏ రాజకీయ పారీ్టతో సంబంధంలేదు. లోపభూయిష్ట పరీక్ష వ్యవస్థమీదనే వాళ్లు పోరాడుతున్నారు. వాళ్ల డిమాండ్లకు మేం మద్దతిస్తున్నాం. విద్యావ్యవస్థ బాగు కోసం ఏ రాష్ట్రంలో ఉద్యమం ఆరంభమైనా సీజేపీ తన వంతు మద్దతు తెలుపుతుంది. అక్కడ ఏ పార్టీ అధికారంతో ఉంది అనేది మాకు సంబంధం లేదు’’అని దీప్కే స్పష్టంచేశారు.
అక్కడ అద్భుతమైన వసతులు
‘‘విద్యా వ్యవస్థ మౌలిక వసతుల దగ్గరికొచ్చేసరికి విదేశాల్లో అద్భుతమైన వనరులు, వసతులు ఉంటాయి. భారత్‌లో ఆ స్థాయిలో పరిస్థితులు లేనేలేవు. ఎంతో నేర్చుకుందామనుకుంటే అంతలా అక్కడి మౌలిక వసతులు విదేశీ విద్యార్థులను దోహదపడతాయి. మౌలికవసతుల రూపంలో విద్యార్థులకు ఎంతో తోడ్పాటుఅందుతుంది. భారత్‌లో ఇంకా పరిస్థితులు గ్రేడ్‌లు ఇవ్వడానికి పరిమితమయ్యాయి.
నేను అమెరికా విద్యనభ్యసించేటప్పుడు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్య, సిలబస్ ఉంది. భారత్‌లోనూ అలాగే ప్రాక్టికల్ అభ్యసన విధానం ఉంటే బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలతో పోలిస్తే ప్రస్తుత మోదీ సర్కార్ విద్యకు తక్కువ నిధులు కేటాయిస్తోంది. విద్యకు కేటాయింపులను కేంద్రప్రభుత్వం ఎందుకు తగ్గిస్తోందో అర్థంకావట్లేదు. కేటాయింపులు ఎంతగా పెరిగితే దేశ పునాదులు అంత పటిష్టంగా మారతాయి’’అని దీప్కే అన్నారు.
ఆ నిధిని ఉపయోగించుకోవాలి
‘‘పీఎం కేర్స్ ఫండ్‌లో ఎంత నగదు ఉందో ఎవరికీ తెలీదు. వేల కోట్ల నగదు నిల్వలు మూలుగుతుంటే మాత్రం వాటిలో కొంత మేర విద్యాభివృద్ధికి తప్పకుండా కేటాయించాలి. నాణ్యమైన విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం సామాన్యుడికి అది అందని ద్రాక్ష అయింది’’అని దీప్కే ఆవేదన వ్యక్తంచేశారు.
అది కీలక భేటీయే..
‘‘రేపు(5న) ఛత్రపతి శంభాజీనగర్‌లో జరగబోయే సీజేపీ భేటీ కీలకమైంది. తాజా ఉద్యమం విజయవంతం కావడంతో మాపై బాధ్యత పెరిగింది. సీజేపీ దేశవ్యాప్తంగా ఎదిగి విద్యార్థుల కోసం పోరాడాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే సీజేపీని విస్తరించాలని భావిస్తున్నాం. ఆగస్ట్ ఐదునాటి భేటీలో మా తదుపరి కార్యాచరణను ఖరారుచేయాలని యోచిస్తున్నాం. మా ఇంట్లో సీజేపీ కీలక 10 లేదా 15 మంది సభ్యులతో పలు అంశాలపై చర్చించనున్నాం’’అని దీప్కే వెల్లడించారు.


