రోడ్డుపై వంద రూపాయల కాగితం కనిపిస్తే ఏం చేస్తారు? నోటు మీదా అని అడుగుతారు కొందరు... జేబులో పెట్టేసుకునేవారు ఇంకొందరు.. దేవుడి హుండీలో వేసేవాళ్లు మరికొందరు.. కొందరిది నిజాయితీ, ఇంకొందరిది ఆశ, మరికొందరిది.. పాపభీతి! రూ.వంద స్థానంలో బంగారు గొలుసు ఉంటే...? నార్వేలోనైతే యజమానికి తిరిగి
అప్పగించే ప్రయత్నం చేస్తారట. మెక్సికో, పెరూల్లోనైతే పది రూపాయల కాగితమున్నా.. నొక్కేస్తారట.
ఈ ఏడాది మొదట్లో... జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి కొంతమంది పరిశోధకులు ఖాళీ పర్సులు, కొంత నగదు, తాళం చెవులతో బయలుదేరాడు. ఎందుకు ఇవన్నీ అని అధికారులు అడిగితే సైన్స్ ప్రయోగం అని వివరించారు. వీరంతా... 40 దేశాల్లోని 355 నగరాలకు వెళ్లి... ఎవరూ చూడకుండా అక్కడక్కడ ఒక్కో పర్సు పడేశారు.
ప్రతిదాంట్లో షాపింగ్ లిస్ట్, కొంత నగదు, తాళం చెవి, బిజినెస్ కార్డులు ఉన్నాయి. ఎన్ని తిరిగి యజమానుల (బిజినెస్ కార్డు)కు తిరిగి వస్తాయో చూద్దామని, వాటిద్వారా ఏ దేశం ఎంత నిజాయితీ కలదో అంచనా వేద్దామన్నది శాస్త్రవేత్తల ఉద్దేశం. రోడ్డుపై పడ్డ పర్సులను ప్రజలు తిరిగి ఇస్తారా? పర్సులో డబ్బు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు? వంటివన్నీ పరిశీలించాలని అనుకున్నారు.
ఈ ప్రయోగం ద్వారా తెలిసిందేమిటీ అంటే... ప్రపంచం మొత్తమ్మీద అత్యంత నిజాయితీగల దేశం స్విట్జర్లాండ్ అని!. పడేసిన ప్రతి నాలుగు పర్సుల్లో కనీసం మూడు సొంతదారులకు చేరాయి. కచ్చితంగా చెప్పాలంటే 76 శాతం పర్సులు రిటర్న్ అయ్యాయి. నార్వే, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, పోలండ్, చెక్ రిపబ్లిక్, న్యూజీల్యాండ్, జర్మనీ, ఫ్రాన్స్‌లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. ఈ దేశాల్లో బ్యాంకులు, పోలీస్ స్టేషన్లలో పడేసుకున్న పర్సులు కూడా ఎంచక్కా యజమానులకు చేరాయి. ‘‘మొరాకో, పెరూ, చైనాల్లో చాలా తక్కువ మంది రిటర్న్ చేశారు’’అని ఈ ప్రయోగంలో పాల్గొన్న శాస్త్రవేత్త క్రిస్టియన్ సి.రఫ్ (జ్యూరిచ్ యూనివర్శిటీ) తెలిపారు.
నగదు ఎక్కువైతే...
ఈ ప్రయోగంలో ఆశ్చర్యకరమైన ఫలితం ఏమిటంటే... పర్సుల్లో నగదు ఎంత ఎక్కువైతే.. తిరిగి ఇచ్చేసే వారి శాతం కూడా అంతేస్థాయిలో పెరగడం. దాదాపు 38 దేశాల్లో వంద డాలర్ల వరకూ నగదు ఉన్న పర్సులు ఎక్కువగా (72 శాతం) తిరిగి వస్తే తక్కువ పదిహేను డాలర్ల వరకూ డబ్బున్నవి సగమే వెనక్కు వచ్చాయి. మెక్సికో, పెరూ దేశాలు మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా నడుచుకున్నట్లు తేలింది. అగ్రరాజ్యం అమెరికా, యూకేల్లో పర్సుల్లోని డబ్బుతో సంబంధం లేకుండా కొంచెం అటు ఇటుగా సగం మాత్రమే రిటర్న్ వచ్చినట్లు గుర్తించారు. ఫలితంగా ఈ రెండు దేశాలు 21, 22 స్థానాల్లో నిలిచాయి.
బ్యాంకులు, పోలీస్ స్టేషన్లు, పడేసిన పర్సుల్లో కూడా అత్యధికం యజమానుల చేతుల్లోకి తిరిగి వచ్చినట్లు ఈ ప్రయోగం ద్వారా స్పష్టమైంది. ముజ్యియంలలో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి అప్పగించడంపై వీటిల్లో ఏర్పాట్లు ఏమీ లేకపోవడం కారణం కావచ్చునని అంచనా. ఇన్ని చెప్పుకున్న తరువాత.. అతితక్కువ నిజాయితీగల దేశాల గురించి కూడా తెలుసుకోవాలి కదా... ఈ ప్రయోగంలో చిట్టచివర నిలిచిన దేశం పెరు. దానికి ఎగువన చైనా, మొరాకోలు ఉన్నాయి. పెరులూ ఐదింటిలో ఒక పర్సు మాత్రమే రిటర్న్ అయితే మొరాకో, చైనాలో పరిస్థితి మరి కాస్త నాలుగింటిలో ఒకటిగా గుర్తించారు.
ఈ ప్రవర్తనకు కారణాలు?
ఈ రకమైన ఫలితాలు శాస్త్రవేత్తలు ఊహించకపోయినా రెండు ప్రధాన కారణాలనైతే గుర్తించారు. మొదటిది ఇతరులకు సహాయం చేయాలనే కోరిక. రెండోది... నగదు ఎక్కువగా ఉన్న పర్సులను వెనక్కు ఇవ్వకపోతే తమను దొంగలు అనుకుంటారనే భయం. స్వార్థం, నిజాయితీల మధ్య సంఘర్షణను ఎదుర్కొంటున్నప్పుడు, మనిషి తమను తాము దొంగలుగా చూసుకోవడానికి ఇష్టపడరు,‘ అని పరిశోధన బృందం వివరించింది. మొత్తమ్మీద చూస్తే మనిషి మరీ అంత నిజాయితీ లేని వాడేమీ కాదని ఈ ప్రయోగం చెబుతోందన్నమాట!
– సాక్షి, నేషనల్ డెస్క్


