జన్యు సవరణ చేసిన మొక్కల కణజాలాన్ని ఫ్లోరోసెన్స్ ఇమేజింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తున్న దృశ్యం. నిర్దేశిత జన్యు సవరణలు సరిగ్గా జరిగాయో లేదో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రత్యేక కాంతి తరంగాలను ఉపయోగించి ఈ కణజాలాలను పరీక్షిస్తారు
ఉచితంగా దీర్ఘకాలిక లైసెన్స్ ఇచ్చిన అమెరికా సంస్థలు
సరికొత్త జన్యు సవరణ వంగడాల రూపకల్పనకు మార్గం సుగమం
స్వల్ప వ్యవధిలోనే క్షేత్రస్థాయికి కొత్త వంగడాలు
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని చిన్న, సన్నకారు రైతుల ఆహార భద్రత, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త జన్యు సవరణ వంగడాల రూపకల్పన దిశగా హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జన్యు సవరణ (జీన్ ఎడిటింగ్) పరిజ్ఞానమైన ‘క్రిస్పర్ కాస్9’ను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించుకునేందుకు అమెరికా కంపెనీల నుంచి ఇక్రిశాట్ తాజాగా హక్కులు పొందింది. క్రిస్పర్ కాస్9 సాంకేతికతపై ప్రధాన పేటెంట్లు అమెరికా సంస్థలకు ఉన్నాయి.
మన దేశంలో శాస్త్రవేత్తలు పరిశోధనల స్థాయిలో ప్రయోగశాలల్లో దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ, దాని ఆధారంగా రూపొందించిన జన్యుమార్పిడి విత్తనాలను వాణిజ్యపరంగా రైతుల వద్దకు తీసుకెళ్లటానికి అత్యధిక లైసెన్సింగ్ రుసుం చెల్లించాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో క్రిస్పర్ కాస్9 జన్యుసవరణ సాంకేతికత సొంతదారులైన అమెరికా సంస్థలు కోర్టేవా అగ్రిసై¯Œన్స్, బ్రాడ్ ఇ¯న్‌స్టిట్యూట్‌లు మానవతా దృక్పథంతో ఇక్రిశాట్‌కు ఉచితంగా దీర్ఘకాలిక లైసెన్స్ ఇవ్వటం విశేషం. తద్వారా ఎలాంటి పేటెంట్ వివాదాలు లేకుండా, అతి తక్కువ ఖర్చుతో ఇక్రిశాట్ పరిశోధనలు పూర్తి చేసేందుకు, లైసెన్సింగ్ రుసుము నుంచి మినహాయింపు పొందేందుకు అవకాశం ఏర్పడింది.
ఇదో మైలురాయి: ఇక్రిశాట్ డీజీ: ఈ ఒప్పందం ద్వారా అభివృద్ధి చేసే పంటల విత్తనాలపై పేటెంట్ భారం ఉండదు కా బట్టి, ఆసియా, ఆఫ్రికాలోని పేద రైతులకు వాతావరణ మార్పు ల వల్ల సంభవించే అనావృష్టి, తీవ్రమైన కరువు, కొత్త రకం తెగుళ్లను తట్టుకునే కంది, శనగ, వేరుశనగ, జొన్న, సజ్జ, ఇతర చిరుధాన్యాలకు సంబంధించి సరికొత్త జన్యుసవరణ విత్తనాలు అతి తక్కువ ధరలోనే అందుబాటులోకి వస్తాయి.
‘ఈ ఒప్పందం ఇక్రిశాట్‌కు, మెట్ట వ్యవసాయంపై ఆధారపడిన లక్షలాది మంది చిన్న రైతులకు, వారి కుటుంబాలకు ఒక పరివర్తనాత్మక మానవతా మైలురాయి’ అని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. కాగా సాధారణ సాంప్రదాయ పద్ధతిలో వాతావరణ మార్పుల ను తట్టుకునే కొత్త పంట రకాన్ని తయారు చేయటానికి 10–15 ఏళ్లు పడుతుందని, ఈ ఒప్పందం ద్వారా క్రిస్పర్ కాస్9ను నేరుగా వాడటం వల్ల 3–5 సంవత్సరాల్లోనే కొత్త వంగడాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చని నిపుణులు చెబుతున్నారు.


