పానిపట్: హర్యానాలోని పానిపట్‌లో అత్యంత దయనీయమైన ఘటన వెలుగు చూసింది. కిషన్‌పురా ప్రాంతంలోని శివ నగర్‌లో సుమారు ఒకరోజు వయసున్న నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్‌లో కట్టి రోడ్డు పక్కన పడేశారు. స్థానికుల అప్రమత్తతతో ఆ పసికందు ప్రాణాలు దక్కాయి. సోమవారం ఉదయం శివ నగర్ గలీలో ఉంటున్న ఒక మహిళ తన ఇంటి బయట శుభ్రత పనులు చేస్తుండగా, పక్క ఇంటి ముందు పడివున్న ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఏదో కదులుతున్నట్లు గుర్తించారు.
వెంటనే ఆమె చుట్టుపక్కల వారికి ఈ విషయాన్ని చెప్పారు. స్థానికులు వచ్చి ఆ కవర్ విప్పి చూడగా, అందులో నవజాత శిశువు ఉంది. సమాచారం అందుకున్న వెంటనే డయల్ 112 పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, శిశువును తొలుత సనౌలి రోడ్డులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) అధికారుల సమక్షంలో మెరుగైన చికిత్స నిమిత్తం పసికందును సివిల్ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ (స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్) వార్డుకు మార్చారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో శిశువుకు చికిత్స అందిస్తున్నారు. పసికందును రోడ్డు పక్కన పడేసిన వారి ఆచూకీ కోసం కిషన్‌పురా చౌకీ పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. శిశువును వదిలేసిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: భారత అధికారికి పాక్ రేంజర్ సెల్యూట్.. వీడియో వైరల్


