58 రోజుల చిన్నారిని రెండంతస్తుల పైనుంచి కిందకు పడేసిన వైనం
అనంతపురం సిటీ: అనంతపురం జిల్లా సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో దారుణం చోటు చేసుకుంది. పీడియాట్రిక్ వార్డులో చికిత్స పొందుతున్న 58 రోజుల పసికందును సొంత నానమ్మ రెండస్తుల ఎత్తు నుంచి కిందకు పడేసింది. వివరాల్లోకెళ్తే.. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మామిడాకులపల్లికి చెందిన అశోక్ కుమార్ భార్య పూజిత మే 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు ఫిట్స్ వస్తుండడంతో మెరుగైన వైద్యం కోసం ఈనెల 22న జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. చిన్నారికి వైద్యులు రెండో అంతస్తులో ఉన్న పిడియాట్రిక్ వార్డులో చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో మంగళవారం వేకువజామున ఒంటిగంట సమయంలో శిశువుకు పాలు పట్టి తల్లి నిద్రిస్తుండగా వారికి సహాయకురాలిగా ఉన్న చిన్నారి నానమ్మ పసికందును తీసుకెళ్లి రెండో అంతస్తు పైనుంచి కిందకు పడేసింది. అనంతరం ఏమీ తెలియనట్టు కోడలి వద్దకు వెళ్లింది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి కనిపించడం లేదంటూ హడావుడి చేసింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది చిన్నారి పడిపోయి ఉండటాన్ని గుర్తించగా, వెంటనే ఐసీయూకు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు జీజీహెచ్‌కు చేరుకుని విచారణ చేపట్టారు. ఆడ పిల్ల అని వద్దనుకున్నారా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.


