డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలి | Lokesh should resign taking responsibility for DSC irregularities | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేశ్‌ రాజీనామా చేయాలి

Jul 29 2026 5:15 AM | Updated on Jul 29 2026 5:15 AM

Lokesh should resign taking responsibility for DSC irregularities

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ డిమాండ్‌

చంద్రబాబు సర్కార్‌ తమకు చేసిన అన్యాయంపై జెన్‌–జెడ్‌ ఆగ్రహావేశాలు రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది

ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు విజయవంతం

అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు

ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు సర్కార్‌దే

ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు 

సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. డీఎస్సీ అక్రమాలను నిరసిస్తూ ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలు విజయవంతమవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 

యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల వీడియోలను జతచేస్తూ ‘నారా లోకేశ్‌ మస్ట్‌ రిజైన్‌’ హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

‘డీఎస్సీ పేపర్‌ లీకేజీ, స్పోర్ట్స్‌ కోటా పేరిట చంద్రబాబు ప్రభుత్వం తమకు చేసిన అన్యాయంపై ఇవాళ జెన్‌–జెడ్‌ ఆగ్రహావేశాలను రాష్ట్రం మొత్తం మళ్లీ చూసింది. ప్రజలతో కలిసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు అన్నీ విజయవంతమయ్యాయి. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలని, పేపర్‌ లీకేజీ నుంచి స్పోర్ట్స్‌ కోటా పోస్టుల భర్తీ వరకు జరిగిన ప్రతి అక్రమంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని గట్టిగా గొంతెత్తారు.

ప్రతిభతో ఉద్యోగాలు సాధించాల్సిన యువతను రోడ్లెక్కించిన పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే. టీచర్‌ ఉద్యోగం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వంం.. డీఎస్సీలో లీకులు, అక్రమాలతో వారి భవిష్యత్తును కాలరాసింది. సాక్ష్యాలు, ఆధారాలు కళ్ల ఎదుటే కనిపిస్తున్నా సీఎం చంద్రబాబు కానీ, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ కానీ ఇప్పటి వరకు వాటిపై నోరు మెదపలేదు. డైవర్షన్లతో కప్పిపెట్టాలని చూస్తున్నారు. యువత, విద్యార్థుల డిమాండ్లను సాధించే క్రమంలో వారి భాగస్వామ్యంతో మరిన్ని రూపాల్లో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం. ఇవాళ జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు అభినందనలు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వీరికి ఎప్పుడూ అండగా నిలుస్తుంది’ అని స్పష్టం చేశారు.

రేపు శ్రీకాకుళానికి వైఎస్‌ జగన్‌ 
మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజుకు పరామర్శ
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టయ్యి శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజును వైఎస్‌ జగన్‌ ములాఖత్‌ ద్వారా కలిసి పరామర్శించనున్నారు. సీదిరి అప్పలరాజు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement