డీఎస్సీలో అక్రమాలను నిరసిస్తూ విజయవాడలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు, యువత, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
లోకేశ్ తప్పుకోవాల్సిందే.. అందరి నోటా అదే మాట
డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించాల్సిందేనని అల్టిమేటం
డీఎస్సీలో అక్రమాలు.. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తిన నిరసనలు
సాక్ష్యాలున్నా సర్కారు స్పందించక పోవడంపై నిప్పులు చెరిగిన అభ్యర్థులు
పలుచోట్ల పోలీసుల అడ్డంకులు.. అయినా కొనసాగిన ఆందోళనలు
లోకేశ్ రాజీనామా చేయాలి.. సీబీఐ విచారణ జరిపించాలి..
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలి
నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అమలు చేయాలి.. బకాయిలూ ఇవ్వాలి
సర్కారు స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని హెచ్చరిక
సాక్షి, అమరావతి/ సాక్షి నెట్‌వర్క్: మెగా డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా యువత, విద్యార్థులు డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చి కదంతొక్కారు. డీఎస్సీలో అక్రమాలపై కళ్ల ముందే ఎన్నో సాక్ష్యాలు కనిపిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. డీఎస్సీ అభ్యర్థులను దగాకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని ధ్వజమెత్తారు. 
టెట్, డీఎస్సీ రాత పరీక్ష లేకుండా ఏకంగా జీవోలు జారీ చేసి, తమ వారికి దొడ్డి దారిన ఉద్యోగాలు కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని నిప్పులు చెరిగారు. అర్హులను పక్కనపెట్టి, డిగ్రీలు లేని వారికి సైతం ఉద్యోగాలివ్వడం బరితెగింపునకు పరాకాష్ట అని.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి బకాయిలతో సహా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన రీతిలోనే డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలనే నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలుచోట్ల పోలీసులు ర్యాలీలను అడ్డుకునేందుకు విఫల యత్నం చేశారు.
అందరి నోట అదే డిమాండ్ 
డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని అన్ని జిల్లా కేంద్రాలు మంగళవారం యువత ప్లకార్డులతో నిర్వహించిన ర్యాలీలతో హోరెత్తాయి. పలు చోట్ల వైఎస్సార్‌సీపీ నేతలను, విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని చోట్ల ముందస్తు అరెస్ట్‌లు చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేశారనీ, మీరెప్పుడు చేస్తారని లోకేశ్‌ను నేతలు సూటిగా ప్రశ్నించారు. గుంటూరులో నిరుద్యోగుల బాధలను స్కిట్ రూపంలో ప్రదర్శించారు. రాజమండ్రిలో పోలీసులు అడ్డుకోవడంతో నేతలు, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. అనంతరం పోలీసుల వలయాన్ని దాటుకుని ర్యాలీ కొనసాగించారు. శ్రీకాకుళంలో ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్.. మహిళలు, నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటున్నారని.. మంత్రి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తూనే ఉంటుందని హెచ్చరించారు. 


