32 కిలోమీటర్లు.. లక్షలాది అడుగులు | Giri Pradakshina around Simhagiri was held with great pomp on Tuesday | Sakshi
Sakshi News home page

32 కిలోమీటర్లు.. లక్షలాది అడుగులు

Jul 29 2026 5:34 AM | Updated on Jul 29 2026 5:34 AM

Giri Pradakshina around Simhagiri was held with great pomp on Tuesday

నమో నారసింహాయ అంటూ మార్మోగిన సింహగిరి 

పులకించి.. పరవశించిన భక్త జనవాహిని

చిరుచినుకుల మధ్య వైభవంగా సింహాచలేశుని గిరి ప్రదక్షిణ

సాక్షి, విశాఖపట్నం/సింహాచలం: ఆషాడ చతుర్దశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరిన సింహగిరి చుట్టూ గిరిప్రదక్షిణ మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. ఓ వైపు చిరుచినుకులు..మరోవైపు మంగళవాయిద్యాలు, జానపద కళారూపాల నడుమ నమో నారసింహాయ అంటూ లక్షలాది మంది భక్తులు సర్వాంతర్యామిని స్మరిస్తూ 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. గిరి ప్రదక్షిణలో ఈ ఏడాది పెద్ద ఎత్తున యువత పాల్గొంది. దాదాపు ఆరు లక్షల మందికిపైగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నట్లు సింహాచల ఆలయ వర్గాల అంచనా. 

ఉదయం 5 గంటల నుంచే భక్తులు కొండదిగువ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి తొలిపావంచా వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారి ఉత్సవమూర్తులు కొలువుదీరిన ప్రచార రథాన్ని దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి ప్రారంభించారు. మధ్యాహ్నం తొలిపావంచా నుంచి రథయాత్ర ఘనంగా ప్రారంభమవ్వగా భక్తజన సంద్రం అనుసరించింది. దారి పొడవునా స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు మంచినీరు, మజ్జిగ, అల్పాహారాన్ని అందించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

ప్రణాళికలు ఘనం.. అమలు శూన్యం
అధికార యంత్రాంగం ముందస్తు ప్రణాళికలు ప్రకటించినప్పటికీ..క్షేత్రస్థాయిలో అది అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రవాణా, ట్రాఫిక్‌ నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. భక్తుల రద్దీకి తగినన్ని ఉచిత బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయాణికులు బస్సుల టాప్‌లపైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణిస్తూ..తొలి పావంచా మార్గానికి చేరుకున్నారు. విశాఖలోని వేపగుంట, హనుమంతువాక, ఎన్‌ఏడీ జంక్షన్, ఎంవీపీ కాలనీ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో అంబులెన్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. 

మరోవైపు కొన్నిచోట్ల రోడ్డు మరమ్మతులు పూర్తికాకపోవడం, మార్గమధ్యంలో సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో పెందుర్తి, కొత్తవలస, అనకాపల్లి, సబ్బవరం వైపు నుంచి వచి్చన భక్తులు అదనంగా మరో 6 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. భారీగా తరలివచ్చిన భక్తజన సందోహానికి లభించిన ఆధ్యాత్మిక అనుభూతిని అధికార యంత్రాంగం సమన్వయ లోపం నీరుగార్చిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, బుధవారం సాయంత్రం వరకు గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. ప్రదక్షిణ పూర్తయిన తరువాత స్వామివారిని దర్శించుకొని వెళ్లేందుకు ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement