ఆర్థిక ఇబ్బందులతో కోర్సుకు విరామమిస్తే నాలుగేళ్ల నిబంధన వర్తించదు
హైకోర్టు తీర్పు
ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసేందుకు అనుమతి
సాక్షి, అమరావతి: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్ కోర్సు నుంచి రెండేళ్లు విరామం తీసుకుని, తిరిగి కోర్సులో మంచి మార్కులతో మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించినా.. రెండో సంవత్సరం పరీక్షలు రాసేందుకు డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుమతి ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న విద్యార్థిని వినీతకు హైకోర్టు అండగా నిలిచింది. ఆ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సు పూర్తిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ‘తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు వంటి అనివార్య కారణాల వల్ల విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో తాత్కాలిక విరామం తీసుకుంటే, ఆ విరామకాలాన్ని మొదటి సంవత్సరం పూర్తి చేయడానికి ఉద్దేశించిన నాలుగేళ్ల గరిష్ట కాలపరివిుతిలో లెక్కించకూడదు.
కోర్సులో తీసుకునే తాత్కాలిక విరామం విద్యార్థి ప్రతిభకు ప్రాతిపదిక కాదు. ప్రస్తుత కేసులో ఆ విద్యార్థిని రూ.62 లక్షల ఫీజు చెల్లించి తిరిగి కోర్సులో చేరినట్లు తెలిపారు. సెప్టెంబర్ 2025లో జరిగిన పరీక్షకు హాజరై మొదటి సంవత్సరాన్ని మంచి మార్కులతో పూర్తిచేశారు. రెండో ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించి, ప్రస్తుతం రెండో సంవత్సరం కోర్సు పూర్తిచేసే దశలో ఉన్నారు. నిబంధనల పేరుతో ఈ దశలో ఆమెను చదువుకు దూరం చేయడమంటే, సమాజానికి ఒక వైద్యురాలిని దూరం చేయడమే. నీట్ ప్రవేశపరీక్ష కోసం ఎంతో కఠినమైన ప్రిపరేషన్‌ను దాటుకుని అడ్మిషన్ సాధించిన తర్వాత, సాధారణ పరిస్థితుల్లో ఏ విద్యార్థి కూడా ఎంబీబీఎస్ కోర్సు నుంచి స్వచ్ఛందంగా విరామం తీసుకోరు’ అని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ ఇటీవల తీర్పు చెప్పారు.
ఆర్థిక కారణాలతో రెండేళ్ల విరామం
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన జోసెఫ్ పాల్ కుమార్తె వినీత 2020–21 విద్యాసంవత్సరానికి రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో బీ కేటగిరి కింద ఎంబీబీఎస్ ప్రవేశం పొందారు. తీవ్రమైన ఆర్థిక కారణాలతో ఆమె రెండేళ్లు విరామం తీసుకున్నారు. 2024లో రూ.62 లక్షల ఫీజు చెల్లించి తిరిగి కోర్సులో చేరారు. నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ మొదటి సంవత్సరాన్ని గరిష్టంగా నాలుగేళ్లు లేదా నాలుగు ప్రయత్నాల్లో పూర్తిచేయాలి. ఈ నాలుగేళ్ల కాల పరిమితి 2024 డిసెంబర్‌తో ముగిసిందంటూ ఎన్‌టీఆర్ వర్సిటీ అధికారులు వినీతను పరీక్షలకు అనుమతించలేదు. దీంతో వినీత తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.


