బూతులు తిట్టి.. మర్మాంగంపై కొట్టి.. | Mna life has been lost to police brutality | Sakshi
Sakshi News home page

బూతులు తిట్టి.. మర్మాంగంపై కొట్టి..

Jul 29 2026 5:11 AM | Updated on Jul 29 2026 5:11 AM

Mna life has been lost to police brutality

సుబ్రమణ్యం మృతదేహంతో రోడ్డుపై ధర్నాకు దిగిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు

యమ భటులే నయం!

ఖాకీల దాష్టీకానికి నిండు ప్రాణం బలి

యమ భటులను మరిపించిన తిరుపతి జిల్లా రామచంద్రాపురం పోలీసులు

జనసేన నేత ఫిర్యాదుతో ఓ వ్యక్తిని ఇంటి ముందే చితకబాదిన వైనం

ఆపై పోలీస్‌స్టేషన్‌కు తరలించి లాఠీలతో కుళ్లబొడిచిన ఖాకీలు

భార్యా పిల్లలనూ స్టేషన్‌కు తీసుకెళ్లి.. వారి కళ్లెదుటే చావగొట్టిన దుర్మార్గం

పాలక పార్టీ నేత సేవలో తరిస్తూ ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ వీరంగం

దారుణ అవమానం భరించలేక బాధితుడు ఆత్మహత్య 

మృతదేహంతో రోడ్డుపై బైఠాయించిన కుటుంబీకులు, గ్రామస్తులు

పరిహారం ఇప్పిస్తామంటూ బాధితులతో పోలీసుల బేరసారాలు 

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: రాష్ట్రంలో పాలక పార్టీల నేతల సేవలో తరిస్తూ పలువురు పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగమే పరమావధిగా రెచ్చిపోతున్నారు. వారి నుంచి ఫిర్యాదు వచ్చిందే తడవుగా విచక్షణ మరచి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారే శిక్షలు విధిస్తున్నారు. వరుస లాకప్‌ మరణాలతో రాష్ట్రం హోరెత్తి పోతున్నా కొందరు ఖాకీల్లో ఇసుమంతైనా మార్పు రావడం లేదు సరికదా.. మరింత రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండల పోలీసుల దాష్టీకానికి ఓ నిండు ప్రాణం బలైంది. 

ప్రత్యక్ష సాక్ష్యుల కథనం మేరకు.. రామచంద్రాపురం మండలం రాయలచెరువులో నివాసముంటున్న సుబ్రమణ్యం (51)కు, పక్కనే నివాసముంటున్న జనసేన మండల అధ్యక్షుడు సంజీవని హరికి శనివారం ఇంటి ముందు నీళ్లు నిలవడంపై చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో హరి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ దేవర మనోహర్‌ సాయంతో పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆపై చంద్రగిరి డీఎస్పీ ద్వారా ఎస్‌ఐకు ఫోన్‌ చేసి సుబ్రమణ్యంపై తప్పుడు కేసులు బనాయించారు. 

ఈ క్రమంలో శనివారం గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల ఎదుటే సుబ్రమణ్యంను బూటు కాలితో తన్నుకుంటూ.. బూతులు తిడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. హెడ్‌కానిస్టేబుల్‌ రాజశేఖర్‌.. పిడిగుద్దులు గుద్దుతూ.. బూటు కాలితో తంతూ, పరుష పదజాలంతో దూషించారు. అనంతరం సుబ్రమణ్యంను దేశ ద్రోహి తరహాలో బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. విచక్షణా రహితంగా కొట్టి వదిలిపెట్టారు. అంతటితో ఆగకుండా ఆదివారం మరోసారి సుబ్రమణ్యంను స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎలాంటి మహిళా పోలీసులు లేకుండానే ఆయన భార్య నిర్మల, మైనర్‌ కొడుకు, కూతురు ప్రశాంత్, జయమ్మలను సైతం బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆపై ఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌ వీరిని అసభ్య పదజాలంతో దూషించారు. 

తండ్రిని కళ్లెదుటే కొడుతుంటే తట్టుకోలేక కుమారుడు అడ్డుకోబోగా.. అతడ్ని సైతం కొట్టారు. ఆపై వారి కళ్లెదుటే సుబ్రహ్మణ్యం మర్మాంగంపై లాఠీలతో కొట్టారు. ఆదివారం రాత్రి కదల్లేని స్థితిలో అతికష్టంగా ఇల్లు చేరుకున్న బాధితుడు.. అవమాన భారం తట్టుకోలేక సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికీ సర్కారు అండ చూసుకుని పోలీసులు చేసిన హత్యే అని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రమణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ గ్రామస్తులు మంగళవారం మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.

సెటిల్‌మెంట్‌కు పోలీసుల యత్నం 
ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో పోలీసు పెద్దలు ఆందోళనకు గురయ్యారు. బాధిత కుటుంబంతో మాట్లాడి పరిహారం ఇచ్చేలా సెటిల్‌మెంట్‌ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జనసేన నేత సంజీవని హరి కొంత డబ్బు ఇచ్చేలా ప్రామిసరి నోట్లు రాయించి బాధితులకు అందజేసేందుకు యత్నించారు. తాము కూడా కొంత డబ్బు ఇస్తామని బాధితులతో పోలీసులు బేరాలాడారు. ఎలాగైనా కేసును నీరుగార్చేందుకు పోలీసులు, కూటమి నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement