డీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరగాలి: ఎంపీ గురుమూర్తి | YSRCP MP Maddila Gurumoorthy Demands CBI Probe into AP Mega DSC Paper Leak | Sakshi
Sakshi News home page

డీఎస్సీ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు జరగాలి: ఎంపీ గురుమూర్తి

Jul 28 2026 9:02 PM | Updated on Jul 28 2026 9:08 PM

YSRCP MP Maddila Gurumoorthy Demands CBI Probe into AP Mega DSC Paper Leak

సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'పై జరిగిన చర్చలో ఆయన వైఎస్సార్‌సీపీ తరఫున పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, దీనివల్ల ఎంతోమంది అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలకు ఆస్కారం ఉన్నప్పటికీ, ఈ మెగా రిక్రూట్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖలో టీచర్ పోస్టులను అడ్డగోలుగా అమ్ముకున్నారని, దీనికి సంబంధించిన ఆడియో సంభాషణలు కూడా బయటపడ్డాయని సభ దృష్టికి తెచ్చారు.

ఈ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.డీఎస్సీ లీకేజ్ కేసులో ముందుకు వెళ్లొద్దని పోలీసులపై ఒత్తిడి తెచ్చారని, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని గురుమూర్తి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్నా కూడా ఉన్నతాధికారుల లేదా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అత్యంత దారుణమైన పరిస్థితి నెలకొందని విమర్శించారు. కాబట్టి, కేంద్రం తీసుకొస్తున్న ఈ యాంటీ పేపర్ లీక్ చట్టం కిందికి అన్ని రాష్ట్రాలను, అన్ని రకాల పరీక్షలను తీసుకురావాలని ఆయన కోరారు.

గతంలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా, కేవలం మెరిట్ ప్రాతిపదికన లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేశామని గురుమూర్తి గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ప్రతి రిక్రూట్‌మెంట్‌లోనూ అక్రమాలు జరుగుతున్నాయని, చివరకు స్పోర్ట్స్ కోటా నియామకాల్లో సైతం భారీగా అవకతవకలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కోటాకు నిర్వహించాల్సిన అర్హత పరీక్షలను రద్దు చేసి, కనీసం పరీక్ష పాస్ కాని 384 మందికి అక్రమ మార్గంలో ఉద్యోగాలు ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై కేంద్రం తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement