సాక్షి,అమరావతి: కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై, అక్కడ చేసిన వ్యాఖ్యల విషయమై విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
సంస్మరణ సభలో వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడం, అలాగే ముద్రగడ పద్మనాభం చేసిన కాపు ఉద్యమం వల్లే టీడీపీ ఓడిపోయిందంటూ బొండా ఉమా చేసిన కామెంట్లు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై బొండా ఉమా నుంచి వివరణ సేకరించాల్సిందిగా పార్టీకి చెందిన త్రిసభ్య (త్రీమెన్) కమిటీని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో పార్టీ నోటీసుల మేరకు టీడీపీ త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బొండా ఉమా.. తాను జరిగిన వాస్తవమే మాట్లాడానని, అందులో తప్పేమీ లేదని స్పష్టం చేశారు. సంస్మరణ సభలో మాట్లాడిన మాటలకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని త్రిసభ్య కమిటీ ఎదుట ఆయన గట్టిగా తన వాదనను వినిపించారు. తాను ఎటువంటి తప్పుడు ప్రకటనలు చేయలేదని, జరిగిన వాస్తవ పరిస్థితులనే ప్రస్తావించానని వెల్లడించారు.


