న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనలపై పాకిస్థాన్‌కు చెందిన కంటెంట్ క్రియేటర్ బిలాల్ హసన్ చేసిన భావోద్వేగ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో బిలాల్ హసన్ మాట్లాడుతూ.. ‘మా మధ్య ద్వేషం పెరిగిందని నాకు తెలుసు, కానీ నిరసనల్లోని ప్రతి గుర్తును, పోస్టర్‌ను, అంతర్గత జోక్‌ను మేం (పాకిస్థానీయులు) అర్థం చేసుకోగలం. మేం మా పోలికలను దాంట్లో చూసుకుంటాం. ఏదేమైనా మేం విడిపోయిన తల్లిదండ్రుల సంతానం’ అని పేర్కొన్నారు.
భారతదేశంలో విద్యార్థుల నిరసనకు మద్దతు తెలుపుతూ.. ‘వీరు పిల్లలు. ఎంతో ధైర్యవంతులు. తమ దేశం మెరుగైన భవిష్యత్తును సాధించడం కోసమే వారు నిరసన తెలుపుతున్నారు. అందులో ఏదో ఒక అందం ఉంది’ అని అన్నారు. ఈ నిరసనలకు పాక్ నిధులు సమకూర్చిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను హసన్ ఖండించారు. ‘పాకిస్థాన్ నిరసనలకు నిధులు ఇచ్చిందని అంటున్నారు. మా దేశాన్ని నడుపుకోవడానికే మా వద్ద సరిపడా డబ్బు లేదు. ఇక మేం వాటికి ఎలా నిధులు సమకూర్చగలం?" అని హసన్ ప్రశ్నించారు. ‘ఫ్రమ్ పాకిస్థాన్ టు ఇండియా’ అనే శీర్షికతో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
భారత్, పాకిస్థాన్‌లలో నిరసనకారుల పట్ల అనుసరిస్తున్న తీరును కూడా ఆయన పోల్చారు. పాకిస్థాన్‌లో విద్యార్థులు తీవ్రమైన ప్రభుత్వ చర్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చివరగా భారతీ విద్యార్థులకు సందేశమిస్తూ ‘మిమ్మల్ని ఎంతో ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి ఆలోచించి రిస్క్ తీసుకోండి. ఐక్యంగా ఉండండి. అమ్ముడుపోకండి’ అని హసన్ సూచించారు. ఈ వీడియోకు ఆన్‌లైన్‌లో విపరీతమైన స్పందన వస్తోంది. భారత్, పాకిస్థాన్ వినియోగదారులు హసన్ పరిశీలనా శక్తిని ప్రశంసిస్తున్నారు.


