నీట్ ఉద్యమం నేపథ్యంలో తెరపైకి వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుల సంబరాల వీడియోలపై ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ స్పందించారు. సీజేపీ నిరసనలకు మద్దతుగా ఆయన 26 రోజులపాటు దీక్ష కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశాక CJP సభ్యులు పార్టీ చేసుకున్న వీడియోలు వైరల్‌గా మారిన వేళ.. వాంగ్‌చుక్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
సీజేపీ పార్టీ సంబురాలపై వాంగ్‌చుక్ స్పందించారు. విజయాన్ని సాధించడం ఎంత ముఖ్యమో.. దాన్ని గౌరవం, నియంత్రణ, బాధ్యతతో స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు. “విజయానికి వినయం తోడవ్వాలి” (Victory must be accompanied by humility) అని సోనమ్ వాంగ్‌చుక్ పేర్కొన్నారు.
CJP నిర్వహించిన నెల రోజులకుపైగా సాగిన నీట్ నిరసనల అనంతరం ఈ సంబరాలు జరగడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. కొందరు ఈ వేడుకలపై విమర్శలు చేయగా.. మరికొందరు ఇది యువత నిరసన వ్యక్తీకరణలో భాగమని సమర్థించారు.
సోనమ్ వాంగ్‌చుక్ పాత్ర
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమానికి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా నిలిచారు. నిరాహార దీక్ష చేపట్టిన ఆయన.. పోలీసులు ఆసుపత్రికి తరలించే వరకు నిరసనకారులతోనే ఉన్నారు. అనంతరం ప్రభుత్వం నుంచి హామీలు రావడంతో 26 రోజుల దీక్షను విరమించారు. నీట్ పేపర్ లీక్ ఆరోపణలు, విద్యార్థులపై నమోదైన కేసులు, బాధిత కుటుంబాలకు పరిహారం వంటి అంశాలపై జరిగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే ఆయన దీక్ష విరమణను స్వాగతిస్తూనే.. సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన దీక్షతో తమకు సంబంధం లేదని.. తమ డిమాడ్లు నెరవేరే దాకా ఆందోళనలు కొనసాగిస్తామని ప్రకటించారు. అదే సమయంలో..
Resignation की ख़ुशी 🥹 pic.twitter.com/QT4Y5j4cy6
— Cockroach Janta Party (@CJP_for_India) July 26, 2026
CJP సంబరాలపై విమర్శలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన తర్వాతి దీప్కే ప్రసంగంలో సోనమ్ వాంగ్‌చుక్ పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అంతేకాదు.. ఎక్స్ ఖాతా నుంచి సోనమ్ వాంగ్‌చుక్ సపోర్ట్‌గా వేసిన డీపీని దీప్కే తొలగించగా.. అధికార ప్రతినిధులు సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలు అలాగే కొనసాగించడమూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆపై
ఢిల్లీలోని అభిజిత్ దీప్కే నివాసానికి సమీపంలోని ఓ హోటల్‌లో CJP సభ్యులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరాలు చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఉద్యమం వెనుక విద్యార్థుల ఆందోళనలు, ఆత్మహత్యల విషాదం ఉన్న నేపథ్యంలో ఇలాంటి వేడుకలు సరైన సందేశం ఇవ్వవని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం కొత్త తరం పోరాట విధానంలో ఉత్సాహం, సృజనాత్మకత కూడా భాగమేనని పేర్కొన్నారు.
“ఇదే జెన్ జీ స్టైల్”..
విమర్శలపై CJP ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందిస్తూ.. తమ వేడుకలు యువత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. అంతేకాదు పోరాటంలో పాల్గొన్న ఎవరీని తాము విస్మరించలేదని.. వలంటీర్ల గౌరవార్థమే ఈ పార్టీ ఇచ్చామని చెప్పారు. “ఎంతకాలమైనా రోడ్డుపై కూర్చొని పోరాడగలం.. అదే సమయంలో పాటలు పాడుతూ నిరసన చేయగలం. కాఫీ తాగుతూ ఉద్యమాన్ని నిర్వహించగలం. ఇదే కొత్త తరం శైలి” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రాజకీయ విమర్శకులను అంకుల్స్, ఆంటీస్ అంటూ ఎద్దేవా చేశారు.
ఫైవ్ స్టార్ హోటల్ ఆరోపణలు
సంబరాల వీడియోలపై సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ స్పందిస్తూ.. CJP నాయకత్వం ఫైవ్ స్టార్ హోటల్‌లో విజయోత్సవం చేసుకుందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఖర్చులు ఎవరు భరించారంటూ ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆరోపణలను సౌరవ్ దాస్ ఖండించారు. అది ఖరీదైన వేడుక కాదని, సాధారణ హాల్‌లో జరిగిన కార్యక్రమమని తెలిపారు.
వాంగ్‌చుక్ వ్యాఖ్యలతో కొత్త చర్చ
CJP సంబరాలపై కొనసాగుతున్న వివాదం మధ్య సోనమ్ వాంగ్‌చుక్ చేసిన “విజయానికి వినయం తోడవ్వాలి” అనే వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి. ఇది విమర్శలా? లేదంటే ఉద్యమానికి ఇచ్చిన సూచనా? అనే అంశంపై సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


