న్యూఢిల్లీ: నీట్ వివాదంపై సాగిన విద్యార్థుల ఉద్యమం మరో కీలక మలుపు తిరిగింది. నిరసనకారులపై నమోదైన కేసులు, అరెస్టుల అంశంపై కేంద్రంతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధులతో ప్రభుత్వం అర్ధరాత్రి కీలక చర్చలు జరిపింది. ఈ సమావేశం అనంతరం నిరసనకారులకు రక్షణ కల్పించేలా మరిన్ని రాష్ట్రాల నుంచి అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశం ఉందని సీజేపీ వెల్లడించింది.
“ఏ ఒక్క నిరసనకారుడిని ఒంటరిగా వదిలిపెట్టం. అందరం కలిసి ఉన్నాం” అని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై తమకు ఉన్న అనుమానాలను చర్చల్లో ప్రస్తావించామని, వాటిపై స్పష్టమైన హామీలు లభించాయని పేర్కొన్నారు.
#Important: 1 AM update.
Hours after our press conference, Government’s representatives met us. The meeting lasted for 2-3 hours. They shared copies of the Bihar and Assam notifications guaranteeing FIR withdrawals, no action in future, and release of all detainees and… pic.twitter.com/G7WcHHcfAs— Saurav Das (@SauravDassss) July 27, 2026
2–3 గంటల పాటు సాగిన అర్ధరాత్రి భేటీ
సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సౌరవ్ దాస్ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. తమ ప్రెస్‌మీట్ తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు తమను కలిశారని, దాదాపు 2–3 గంటల పాటు చర్చలు సాగాయని తెలిపారు. బిహార్, అస్సాం ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఉపసంహరణ, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవన్న హామీలకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతులను ప్రభుత్వం తమకు అందించిందని చెప్పారు. ఇదే తరహాలో కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ–ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి కూడా ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
“హామీలు అమలవుతాయా?”
చర్చల అనంతరం విడుదల చేసిన వీడియో సందేశంలో సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ హామీల అమలుపై తమకు ఆందోళన ఉందని స్పష్టం చేశారు. “చర్చల్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతాయేమోనన్న భయాన్ని ప్రభుత్వ ప్రతినిధుల ముందు పెట్టాం. అందుకు ప్రతిగా బిహార్ హోం శాఖ జారీ చేసిన ప్రకటనను వారు చూపించారు. అందులో నిరసనకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరిస్తామని, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు ఉండవని పేర్కొన్నారు” అని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా రక్షణ కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేయడంపై చర్చ జరిగినట్లు వెల్లడించారు.
మళ్లీ ఉద్యమం హెచ్చరికతో కదిలిన ప్రభుత్వం
కేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ మరోసారి ఆందోళన బాట పట్టే హెచ్చరికలు చేసింది. ఒప్పందం ఉల్లంఘించారని ఆరోపిస్తూ.. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు కొనసాగుతున్నాయని పేర్కొంది. బిహార్, బెంగాల్‌లో వందలాది మంది విద్యార్థులను అరెస్టు చేశారని, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో వాలంటీర్లను వేధిస్తున్నారని సీజేపీ ఆరోపించింది. వెంటనే కేసులు ఉపసంహరించుకోవాలని, అరెస్టైన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే తిరిగి జంతర్ మంతర్ వేదికగా ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించింది.
బిహార్, అస్సాం తర్వాత రాజస్థాన్ హామీ
ఇప్పటికే బిహార్, అస్సాం ప్రభుత్వాలు నీట్ నిరసనలకు సంబంధించి నమోదైన కేసులపై ఉపశమనం కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. అరెస్టైన వారిని విడుదల చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి ప్రతికూల చర్యలు ఉండవని హామీ ఇచ్చాయి. తాజాగా రాజస్థాన్‌లోనూ నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ లభించిందని సీజేపీ తెలిపింది. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాలేదని, ఇకపై కూడా నమోదు చేయబోమని అధికారులు స్పష్టం చేసినట్లు పేర్కొంది.
నీట్ పోరాటం ముగిసినట్లే!
నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఉద్యమం.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తాత్కాలికంగా ముగిసింది. అయితే నిరసనకారులపై కేసులు, అరెస్టుల అంశం కొత్త వివాదానికి దారితీసింది. తాజా చర్చలతో తాత్కాలికంగా ఆందోళన సద్దుమణిగినప్పటికీ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కేసుల ఉపసంహరణ, విద్యార్థుల రక్షణపై అధికారిక ప్రకటనలు రావడమే కీలకంగా మారింది.


