న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో మంగళవారం ఉదయం ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ ‘మంగళ్ మిలన్’ సమావేశం జరిగింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రసంగించారు. భారత్ ఇటీవల కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ) విజయం, వ్యూహాత్మక ప్రభావం గురించి పీయూష్ గోయల్ వివరించగా.. మత్స్య రంగ వృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితర అగ్రనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ భేటీకి, తొలిసారిగా కొత్తగా ఏర్పడిన ‘నేషనలిస్ట్ సిటిజెన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఎన్‌సీపీఐ)కు కూడా ఆహ్వానం లభించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను వీడి ఎన్‌సీపీఐలో చేరిన సుదీప్ బందోపాధ్యాయ, కాకోలి ఘోష్, శతాబ్ది రాయ్ తదితర ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Delhi: NDA Parliamentary Party's 'Mangal Milan' meeting begins at the Parliament.
Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, and other leaders attend the meeting.
(ANI photos by Rahul Singh) pic.twitter.com/ckHDAIG7vJ— ANI (@ANI) July 28, 2026
ప్రస్తుత వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఎన్‌డీఏ ‘మంగళ్ మిలన్’ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పరీక్షల సంస్కరణలు, విద్యార్థులపై పోలీసుల చర్యలంటూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలు ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్యాయమైన మార్గాల నిరోధక) సవరణ బిల్లు-2026 ప్రవేశపెట్టిన తరుణంలో ఈ సమావేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలను కఠినంగా అణచివేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లుపై చర్చించేందుకు ఎన్‌డీఏ పలువురు యువ ఎంపీలను రంగంలోకి దించింది.
జులై 20 నాటి ‘సంసద్ చలో’ నిరసనల సమయంలో జరిగిన పోలీసు చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పార్లమెంట్‌లో ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీనికితోడు కొత్త చట్టం ప్రభావంపై కూడా విపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల వెంటే ఉంటుందని, పేపర్ లీక్‌లు జాతీయ ఆందోళనకర అంశమని, దీనిపై రాజకీయాలు చేయకూడదని స్పష్టం చేశారు. పరీక్షల అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.
తొలగిన ప్రతిష్టంభన..పబ్లిక్ పరీక్షల బిల్లుపై చర్చ
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన తొలగింది. మంగళవారం లోక్‌సభలో పబ్లిక్ పరీక్షల (అక్రమాల నివారణ) సవరణ బిల్లు, 2026పై చర్చ జరగనుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలతో జరిపిన సంప్రదింపులు ఫలించడంతో సభ సజావుగా సాగేందుకు మార్గం సుగమమైంది. నీట్ పేపర్ లీక్ ఉదంతం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవస్థీకృత పరీక్షల మోసాలను అణచివేయడానికి కేంద్రం ఉద్దేశించిన నూతన బిల్లును ప్రధాని కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.


