కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే? | AI Assisted Testimony Leads To Dismissal Of Rape Case In UK Court, Orders Fresh Hearing | Sakshi
Sakshi News home page

కోర్టులో సాక్ష్యానికి ఏఐ సాయం .. చివరికి ఏమైందంటే?

Jul 28 2026 9:41 AM | Updated on Jul 28 2026 10:04 AM

AI Assisted Testimony Leads to Dismissal of Rape Case in UK Court

లండన్‌: న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్‌ను ఆశ్రయించిన ఒక మహిళకు ఎదురుదెబ్బ తగిలింది. తనపై మాజీ ప్రియుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ బ్రిటన్‌ కోర్టును ఆశ్రయించిన బాధితురాలు.. ఆ రాత్రి జరిగిన సంఘటనలు, శారీరక సాక్ష్యాలు వంటి కీలక అంశాలను స్వయంగా వివరించకుండా ఏఐ సాయంతో తన సాక్ష్యాన్ని సిద్ధం చేసుకుంది. ఈ విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి ఆ కేసును కొట్టివేశారు.

బాధితురాలిగా పేర్కొంటున్న ‘సి’ అనే మహిళ, తాగుబోతు స్థితిలో ఉన్నప్పుడు తన మాజీ ప్రియుడు ‘ఆర్’ తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, ఆ సమయంలో తాను సమ్మతి తెలిపే స్థితిలో లేనందున అది అత్యాచారమేనని ఆరోపించింది. అయితే, విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది.. ఆమె కోర్టులో చెప్పాల్సిన సమాధానాలు, వాంగ్మూలాన్ని ఏఐ టూల్ ద్వారా తయారు చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆమె సాక్ష్యం ఎంతవరకు నిజమైనదో స్పష్టంగా తేల్చడం అసాధ్యమని, ఇది నిష్పక్షపాత విచారణకు విఘాతం కలిగిస్తుందని వాదించారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బ్రిటన్ అప్పీల్ కోర్టు.. కోర్టు విచారణకు ఏఐని ఉపయోగించడం ‘సాక్షులకు శిక్షణ ఇవ్వడం’ (విట్‌నెస్ కోచింగ్) కిందకు వస్తుందని, ఇది దేశంలో పూర్తిగా నిషిద్ధమని స్పష్టం చేసింది. సాక్షులు ఎవరైనా ఏఐని ఉపయోగించి ఆధారాలు సిద్ధం చేసుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని కోర్టు అభిప్రాయపడింది. నిజాయితీపరులైన సాక్షులు తాము గుర్తుంచుకున్న విషయాలను  ఏఐ ప్రభావంతో మార్చుకునే ప్రమాదం ఉందని, అలాగే అసత్య సాక్షులు తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కేసుకు సంబంధించి పునర్విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో న్యాయ వ్యవస్థలో వాటి వాడకంపై నైతిక, చట్టపరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇది కూడా చదవండి: పాక్‌లో వైద్య సంక్షోభం.. ప్రాణాలొదులుతున్న బాధితులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement