ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ తరుణంలో.. దీనివల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించడానికి అమెరికా ప్రభుత్వం.. ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ (AI Kill Switch Act) అనే కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది.
ప్రస్తుతం ఏఐ విద్య, వైద్యం, పరిశ్రమలు, బ్యాంకింగ్ వంటి దాదాపు చాలా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ అనేది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో.. నియంత్రణ తప్పితే అదే స్థాయిలో ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అమెరికా కాంగ్రెస్ సభ్యులు టెడ్ లియూ, నాథనియల్ మోరన్ ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ బిల్లును ప్రవేశపెట్టారు.
ఏఐ కిల్ స్విచ్ యాక్ట్ ప్రకారం.. ఒక ఏఐ మోడల్ మానవ ప్రాణాలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా జాతీయ భద్రతకు ముప్పుగా మారితే, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ.. ఆ ఏఐ వ్యవస్థను వెంటనే నిలిపివేయాలని ఆదేశించే అధికారం కలిగి ఉంటుంది. అంటే.. ఏఐ పూర్తిగా నియంత్రణ తప్పి ప్రమాదకరమైన చర్యలు చేస్తే, దానిని వెంటనే ఆపడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్నమాట.
ఈ బిల్లు ప్రతిపాదించడానికి ప్రధాన కారణం.. ఓపెన్ఏఐ నిర్వహించిన భద్రతా పరీక్షలో వారి ఒక ఏఐ ఏజెంట్ అనుకోని విధంగా ప్రవర్తించి హ్యాకింగ్‌కు దారితీయడమే అని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఏఐ వ్యవస్థలు కొన్నిసార్లు డెవలపర్లు ఊహించని విధంగా ప్రవర్తించే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
అయితే.. ఈ చట్టంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇది భద్రతకు ఎంతో అవసరమైన చర్య అని భావిస్తే, మరికొందరు ప్రభుత్వం ఏఐ సంస్థలపై ఎక్కువ నియంత్రణ సాధించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న భద్రత తప్పకుండా అవసరమని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అప్పుల ఊబిలో ఐటీ ఉద్యోగి!


