ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కృత్రిమ మేధస్సు ఎంత ఉపయోగకరమో, అంతే ప్రమాదకరమని పలువురు భావిస్తున్నారు. ఈ తరుణంలో దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాబోయే పదేళ్లలో ఏఐ మనుషుల కంటే ఎంతో తెలివిగా మారే అవకాశం ఉంది. 2036 నాటికి బాట్‌లు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయని మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. ఏఐ మానవాళిని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం 10 నుంచి 20 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఈ విషయాన్ని వివరించడానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. మనుషులు చింపాంజీల కంటే ఎంతో తెలివైనవారు కాబట్టి, ప్రపంచాన్ని చింపాంజీలు నియంత్రించడం సాధ్యం కాదు. అదే విధంగా.. ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే, భవిష్యత్తులో మనుషులకే నియంత్రణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐ వల్ల ప్రయోజనాలు
ఇదే సమయంలో మస్క్.. ''ఏఐ వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో AI సహాయంతో ఉత్పత్తి పెరుగుతుంది, పనులు వేగంగా పూర్తవుతాయి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అందరికీ అవసరమైన వస్తువులు, సేవలు సమృద్ధిగా అందుబాటులోకి రావచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. AI అభివృద్ధిని పూర్తిగా ఆపడం కష్టమని, దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడం మంచిదని కూడా అభిప్రాయపడ్డారు''.
ఏఐ సింగ్యులారిటీ
ఏఐ గురించి ఓపెన్‌ఏఐ సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు. ''ప్రస్తుతం ప్రపంచం సింగ్యులారిటీ అనే కొత్త దశలోకి అడుగుపెడుతోందని అన్నారు. అంటే.. ఏఐ వ్యవస్థలు మానవ మేధస్సును అధిగమించే స్థితికి చేరుకుంటున్నాయని వెల్లడించారు''.
ఇదీ చదవండి: నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే!


