సాధారణంగా పెద్దగా పట్టించుకోని తుప్పు (Corrosion) సమస్య ఏటా దేశానికి రూ .14 లక్షల కోట్ల నష్టాన్ని కలిగిస్తోందంటే నమ్ముతారా? తుప్పు సమస్య భారత ఆర్థిక వ్యవస్థపై భారీ భారం మోపుతోందని జపాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ నోమురా తాజా నివేదిక వెల్లడించింది. వంతెనలు, రహదారులు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక ఆస్తులు తుప్పు కారణంగా ముందుగానే దెబ్బతింటుండటంతో దేశానికి ఏటా సుమారు రూ.14.15 లక్షల కోట్ల నష్టం వాటిల్లుతోందని అంచనా వేసింది. ఇది భారత స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 4.3 శాతానికి సమానమని నివేదిక పేర్కొంది.
తుప్పు వల్ల పెరుగుతున్న ఆర్థిక భారం
తుప్పు (Rust) అనేది కేవలం ఇంజినీరింగ్ సమస్య మాత్రమే కాదని, అది దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యయం, ప్రజా భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపే అంశమని నివేదిక స్పష్టం చేసింది. ఉక్కు నిర్మాణాలు కాలక్రమేణా బలహీనపడటంతో వాటి మరమ్మతులు, మార్పిడి కోసం ప్రభుత్వాలు, పరిశ్రమలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫలితంగా కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణానికి వినియోగించాల్సిన నిధులు పాత ఆస్తుల సంరక్షణకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి పెరగడంతో పాటు జాతీయ ఆస్తుల ఉత్పాదకత కూడా తగ్గుతోందని నివేదిక హెచ్చరించింది.
అత్యధిక ప్రభావం విద్యుత్, మౌలిక సదుపాయాలపైనే..
తుప్పు ప్రభావం అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి, ప్రసార రంగంపై పడుతోందని నోమురా తెలిపింది. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్స్, ఆటోమోటివ్, మౌలిక సదుపాయాలు, రైల్వేలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. మౌలిక సదుపాయాల రంగానికే ఏటా రూ.1.41 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుండగా, విద్యుత్ రంగంలో రూ.53,860 కోట్లు, టెలికమ్యూనికేషన్స్‌లో రూ.38,320 కోట్లు, రైల్వేల్లో రూ.23,788 కోట్లు, ఆటోమోటివ్ రంగంలో రూ.87,098 కోట్ల మేర ఆర్థిక నష్టం సంభవిస్తున్నట్లు నివేదిక అంచనా వేసింది.
వాతావరణమే ప్రధాన సవాలు
భారత్‌లోని భారీ రుతుపవనాలు, అధిక తేమ, తీరప్రాంతాల్లో ఉప్పు గాలులు తుప్పు తీవ్రతను మరింత పెంచుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా వంతెనలు, రహదారులు, ఓడరేవులు వంటి నిర్మాణాలు ఈ ప్రభావానికి ఎక్కువగా గురవుతున్నాయి. అమెరికా, జపాన్ వంటి దేశాలు వాతావరణ పరిస్థితులను బట్టి వేర్వేరు తుప్పు నిరోధక ప్రమాణాలు అమలు చేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం చాలా ప్రాంతాల్లో ఒకే తరహా నిర్మాణ ప్రమాణాలను అనుసరించడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని నోమురా అభిప్రాయపడింది.
కఠిన ప్రమాణాల అమలే పరిష్కారం
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) తుప్పు నిరోధక చర్యలను సూచించినప్పటికీ, ఏ వాతావరణ పరిస్థితుల్లో ఏ సాంకేతికతను ఉపయోగించాలనే విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు లేవని నివేదిక పేర్కొంది. దీంతో కాంట్రాక్టర్లు కనీస స్థాయి రక్షణతోనే సరిపెడుతున్నారని తెలిపింది. తప్పనిసరి తుప్పు నిరోధక ప్రమాణాలు, కఠినమైన అమలు, మెరుగైన పర్యవేక్షణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత నిర్మాణ విధానాలను నవీకరించడం ద్వారా మౌలిక సదుపాయాల ఆయుష్షు పెరగడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా గణనీయమైన లాభం చేకూరుతుందని నోమురా సూచించింది. సమర్థవంతమైన తుప్పు నిరోధక చర్యలు అమలు చేస్తే దేశ జీడీపీకి 1.5 శాతం వరకు అదనపు వృద్ధి సాధ్యమవుతుందని నోమురా అభిప్రాయపడింది.
ఇదీ చదవండి: కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా?


