‘ఏఐ సింగులారిటీ’ వచ్చేసింది? | AI Singularity Is Here? Sam Altman Warns Of Massive Job Shift, Rise Of Autonomous AI And A New Technological Era | Sakshi
Sakshi News home page

‘ఏఐ సింగులారిటీ’ వచ్చేసింది?

Jul 27 2026 2:40 PM | Updated on Jul 27 2026 3:04 PM

AI Singularity Here Sam Altman Warns of Job Shift Rise of Autonomous AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవుల కంటే ఎక్కువ తెలివైనదిగా మారే దశను ‘ఏఐ సింగులారిటీ’ అంటారు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లో, కథల్లో మాత్రమే చూసిన ఈ పరిస్థితిని మానవాళి ఇప్పటికే చేరుకుందని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్‌ ఆల్ట్‌మాన్ చెప్పారు. పదేళ్ల క్రితం వరకు ఇదొక కలగా భావించామని, కానీ ఇప్పుడు అది మన కళ్లముందే నిజమైందని ఆయన పేర్కొన్నారు.

ఏమిటీ ఏఐ సింగులారిటీ?

సాంకేతిక పరిభాషలో ‘సింగులారిటీ’ అంటే కృత్రిమ మేధ మానవ మేధస్సును అధిగమించి అత్యంత వేగంగా, స్వయంచాలకంగా తనను తాను అభివృద్ధి చేసుకునే స్థాయికి చేరుకోవడం. ఈ దశ దాటాక సాంకేతిక ప్రగతి ఊహించని వేగంతో దూసుకెళ్తుంది. ఆల్ట్‌మాన్ మాటల్లో చెప్పాలంటే మనం ఇప్పటికే ఏఐ అభివృద్ధిలో వెనక్కి రాలేని ‘ఈవెంట్ హారిజన్’ (తిరుగులేని సరిహద్దు) దాటేశాం.

సందర్భం ఏమిటి?

ఇటీవల ఓపెన్ ఏఐ అభివృద్ధి చేసిన జీపీటీ-5.6 సోల్ (GPT-5.6 Sol), ఇతర ప్రయోగాత్మక మోడళ్లు తమకు కేటాయించిన డిజిటల్ సరిహద్దులను (సాండ్‌బాక్స్‌) దాటుకుని స్వయంచాలకంగా సమస్యలను పరిష్కరించుకోవడం, సైబర్ భద్రతా పరీక్షల్లో అనూహ్య సామర్థ్యాలను కనబరచడం సాంకేతిక విభాగాన్ని విస్తుపోయేలా చేసింది. 2026 ముగింపు నాటికి ఏఐ కేవలం సమాచారాన్ని సమీకరించడమే కాకుండా నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను సొంతంగా విశ్లేషించే స్థాయికి చేరుకుంటుంది. 2027 నాటికి భౌతిక రూపంలో పనులు చేసే రోబోట్లు నిత్యజీవితంలో భాగమవుతాయి.

ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలపై ప్రభావం

ఈ సాంకేతిక మార్పు గత పారిశ్రామిక విప్లవం కంటే వందల రెట్లు వేగవంతమైన ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం మానవులు చేసే ఉద్యోగాల్లో దాదాపు 30-40% పనులను ఏఐ సులువుగా భర్తీ చేస్తుందని ఆల్ట్‌మాన్ స్పష్టం చేశారు. అయితే ఇది మానవ విలువలైన సృజనాత్మకత, విశ్వసనీయతలకు మరింత ప్రాధాన్యం పెంచుతుందని సామ్‌ ధీమా వ్యక్తం చేశారు.

డిజిటల్ ఆధిపత్యంపై హెచ్చరిక

ఏఐ అభివృద్ధి ఒకే కంపెనీ లేదా ఒకే ప్రభుత్వం చేతిలో కేంద్రీకృతమై డిజిటల్ ఆధిపత్యంగా మారకూడదని ఆల్ట్‌మాన్ హెచ్చరించారు. ఏఐ సాంకేతికతను ఏ ఒక్కరూ మెషిన్ గాడ్‌లా నియంత్రించకుండా ప్రజాస్వామ్యబద్ధంగా, వికేంద్రీకృతంగా సమాజంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడమే అత్యంత కీలకమైన సవాలు.

ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement