కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ అమెరికాకు చెందిన అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం జేపీమోర్గాన్ చేజ్ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందకు సిద్ధంమైంది. దేశంలోని తన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) విభాగాల కోసం సుమారు 1,000 మంది సాంకేతిక నిపుణులను కొత్తగా నియమించుకోవడానికి ప్రణాళికను ప్రకటించింది.
కీలక విభాగాల్లో నియామకాలు
ఈ నయా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రధానంగా క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ డేటా పైప్‌లైన్స్ వంటి అత్యంత సంక్లిష్టమైన ప్రాధాన్యత కలిగిన సాంకేతిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుంది. అభ్యర్థుల తాజా నైపుణ్యాలను సవాలు చేసేందుకు ‘హ్యాకర్‌ర్యాంక్’ వేదిక ద్వారా కోడింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆల్గారిథమ్స్, సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లలో కఠినమైన పరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
ఏఐ ప్రభావం ఉన్నా స్థిరంగా డిమాండ్
బ్యాంకింగ్ వ్యాపారంలోని పలు సంప్రదాయ, పునరావృత విభాగాల్లో ఏఐ టెక్నాలజీ వాడకం కారణంగా సిబ్బంది అవసరం దాదాపు 40 శాతం వరకు తగ్గిందని జేపీమోర్గాన్ ఇటీవల ధ్రువీకరించింది. అయినా స్పెషలైజ్డ్ ఇంజినీరింగ్, ఏఐ ఆధారిత డేటా నిపుణుల అవసరం నిరంతరం పెరుగుతోందని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోంది. భారత్ కేవలం పాతకాలపు బ్యాక్-ఆఫీస్ విధులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ఉత్పత్తులను రూపొందించే ప్రధాన ఐటీ ఇన్నోవేషన్ హబ్‌గా మారుతుందనడానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది.
భారత్‌లో విస్తరణ ఇలా..
ప్రస్తుతం జేపీమోర్గాన్ భారతదేశంలోని హైదరాబాద్, ముంబై, బెంగళూరు, నోయిడా, గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇది సంస్థ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఐదో వంతు. అంతేకాకుండా, ముంబైలోని పవాయ్‌లో 2029 నాటికి ఆసియాలోనే అతిపెద్దదిగా నిలవనున్న 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను నిర్మిస్తున్నారు. ఇందులో 30,000 మంది కొలువుదీరనున్నారు.
ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్


