ఆస్తమా బాధితుడి ప్రయోగం.. ఆవిష్కరణగా ఎలా మారిందంటే.. | From Horse Carts To AI Robots, The Untold History Of Vacuum Cleaners Evolution You Didn't Know, Read Story Inside | Sakshi
Sakshi News home page

ఆస్తమా బాధితుడి ప్రయోగం.. ఆవిష్కరణగా ఎలా మారిందంటే..

Jul 27 2026 11:54 AM | Updated on Jul 27 2026 12:29 PM

From Horse Carts to AI The Untold History of Vacuum Cleaners You Didnt Know

నేడు ఆధునిక గృహాల్లో స్మార్ట్ లైఫ్‌స్టైల్‌కు చిహ్నంగా మారిన ‘వాక్యూమ్ క్లీనర్’ లేని ఇల్లుని ఊహించడం కష్టమే. బటన్ నొక్కినా లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా కమాండ్ ఇచ్చినా ఇల్లు తళతళా మెరిసిపోవడం వెనుక దాదాపు వందేళ్లకు పైగా సుదీర్ఘ సాంకేతిక పరిణామక్రమం ఉందంటే నమ్ముతారా? అసలు కరెంట్‌తో సంబంధం లేకుండా కేవలం చేతితో తిప్పే ‘బెలూస్’ పరికరం నుంచి మొదలైన ఈ స్మార్ట్ క్లీనర్ ప్రయాణంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన నిజాలు దాగున్నాయి.

చేతితో నడిపే ‘బెలూస్’..

19వ శతాబ్దం చివర్లో పారిశ్రామిక విప్లవం పుంజుకోవడంతో నగరాల్లో జనాభా, మధ్యతరగతి గృహాల్లో కార్పెట్లు, మెరుగైన ఇంటీరియర్‌ వాడకం పెరిగాయి. అంతవరకు సాంప్రదాయ పద్ధతుల్లో దుమ్ము దులపడం ఒక ప్రహసనంగా మారడంతో 1860ల చివర్లో తొలిసారిగా ఒక యాంత్రిక కార్పెట్ క్లీనర్‌ను రూపొందించారు. దుమ్మును పీల్చుకోవడానికి గాలిని ఊదే, పీల్చే సంచి లాంటి సాధనాన్ని (బెలూస్) ఇందులో వాడేవారు.

అనంతరం 1869లో అమెరికాకు చెందిన ఐవ్స్ మెక్‌గాఫీ ఎలక్ట్రిసిటీ అవసరం లేని ‘వర్ల్‌విండ్’ అనే మోడల్‌ను తయారుచేసి పేటెంట్ పొందారు. అయితే ఇందులో ఒక ప్రధాన లోపం ఉండేది. ఒక చేత్తో మిషన్‌ను నేలపై నెడుతూ మరోచేత్తో పైనున్న లివర్‌ను తిప్పాల్సి వచ్చేది. ఈ శ్రమతో కూడిన ప్రక్రియ కావడంతో వినియోగదారులు దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు.

గుర్రపు బండి యంత్రాలు.. కిటికీల గుండా పైపులు!

1870లలో మెల్విల్ బిస్సెల్ తిరిగే చక్రాలు, బ్రష్‌లతో కూడిన కార్పెట్ స్వీపర్‌ను మార్కెట్లోకి తెచ్చారు. ఆ తర్వాత 1899లో జాన్ ఎస్.థర్మన్ గ్యాసోలిన్‌తో నడిచే మోటరైజ్డ్ క్లీనర్‌ను అభివృద్ధి చేసినా లోతుగా శుభ్రం చేసే సామర్థ్యం దానికి లేకపోవడం, పైగా అత్యంత ఖరీదైనది కావడంతో సామాన్యులు పాత పద్ధతులకే ప్రాధాన్యమిచ్చారు.

1901లో బ్రిటన్‌కు చెందిన ఇంజినీర్ హ్యూబర్ట్ సెసిల్ బూత్ మొదటి ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్‌ను రూపొందించి చరిత్ర సృష్టించారు. అయితే, ఈ యంత్రం పరిమాణం ఎంత పెద్దగా ఉండేదంటే.. దాన్ని గుర్రపు బండిపై ఒక చోటు నుంచి మరో చోటుకు మోసుకెళ్లాల్సి వచ్చేది! యంత్రాన్ని ఇంటి బయట రోడ్డుపైనే ఉంచి, దాదాపు వందల అడుగుల పొడవైన హోస్ పైపులను కిటికీల గుండా ఇంట్లోకి పంపి కార్పెట్లను శుభ్రం చేసేవారు. ధనవంతులు మాత్రమే ఈ సేవలను వినియోగించుకునేవారు.

దిండు కవర్ ప్రయోగం..

ఇంట్లో సులభంగా ఒకరి చేతితోనే ఆపరేట్ చేసుకోగలిగే మొదటి ‘పోర్టబుల్ ఎలక్ట్రిక్ వాక్యూమ్ క్లీనర్’ రూపుదిద్దుకోవడం వెనుక ఒక ఆవిష్కరణ ఉంది. 1907లో ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో పనిచేసే జేమ్స్ ముర్రే స్పాంగ్లర్ అనే ఆస్తమా బాధితుడు ఈ అద్భుతానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఒక పాత ఫ్యాన్ మోటార్, చీపురు కర్ర, ఒక చెక్క పెట్టె.. వీటికి తోడు దుమ్మును సేకరించడానికి ఒక ‘దిండు కవర్’ను ఉపయోగించి ఒక పోర్టబుల్ మోడల్‌ను సృష్టించారు. ఆయన తయారు చేసిన ఈ డిజైన్ సామర్థ్యాన్ని గుర్తించిన వ్యాపారవేత్త విలియం హూవర్, 1908లో స్పాంగ్లర్ నుంచి ఆ పేటెంట్ హక్కులను కొనుగోలు చేశారు. అనంతరం 1922లో అధికారికంగా ‘ది హూవర్ కంపెనీ’గా మారి, గృహోపకరణాల రంగంలో విప్లవం సృష్టించారు. 1920వ దశకం నాటికి అమెరికా, యూరప్‌లోని మహిళలకు గృహ శ్రమను తగ్గించడంలో ఈ హూవర్ వాక్యూమ్ క్లీనర్లు తిరుగులేని సాధనంగా మారాయి.

ఏఐ రోబోటిక్ క్లీనర్లు

చేతితో తిప్పే చక్రాలు, దిండు కవర్ల ప్రయోగాల నుంచి ప్రారంభమైన వాక్యూమ్ క్లీనర్ ప్రయాణం ఐదు దశాబ్దాల క్రితం డ్రై/వెట్ క్లీనింగ్ టెక్నాలజీ వైపు అడుగులు వేసింది. నేడు మనుషుల ప్రమేయం కూడా లేకుండా కృత్రిమ మేధ, సెన్సార్లు, లేజర్ మ్యాపింగ్‌తో పనిచేసే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లు ఇళ్లను స్మార్ట్‌గా శుభ్రం చేస్తున్నాయి. ఒకప్పుడు గుర్రపు బండిపై వచ్చిన యంత్రం నేడు మన అరచేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్ యాప్‌తో నియంత్రించబడే స్థాయికి చేరడం మానవ సాంకేతిక ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం!

- పసుపులేటి వెంకటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement