ప్రపంచవ్యాప్తంగా మహిళల పురోగతి, న్యాయం, భద్రత ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ నివేదిక ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అమెరికాలోని ‘జార్జ్‌టౌన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఉమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ’ విడుదల చేసిన వుమెన్, పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్(2025-26) ప్రకారం.. మహిళలు స్వతంత్రంగా, సురక్షితంగా, సాధికారతతో జీవించడానికి ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన దేశంగా డెన్మార్క్ (0.939 స్కోరు) అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 181 దేశాల్లో మహిళల భాగస్వామ్యం, చట్టపరమైన రక్షణ, భద్రతలకు సంబంధించిన 13 కీలక సూచికలను ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితాను ఖరారు చేశారు.
టాప్-5లో నార్డిక్ దేశాలు
1. డెన్మార్క్ (0.939)
2. ఐస్‌లాండ్ (0.932)
3. నార్వే (0.924), స్వీడన్ (0.924)
4. ఫిన్‌లాండ్ (0.921)
లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ తదితర దేశాలు టాప్-10లో చోటు దక్కించుకోగా.. ఆస్ట్రేలియా (11), కోస్టారికా, ఉరుగ్వే వంటి లాటిన్ అమెరికా దేశాలు సైతం గణనీయమైన ప్రగతితో ఉత్తమ శ్రేణిలో నిలిచాయి.
నార్డిక్ మోడల్ ప్రత్యేకత ఏమిటి?
ఉచిత విద్య, ఉద్యోగాల్లో అధిక శ్రామిక శక్తి భాగస్వామ్యం, బలమైన ఆర్థిక పురోగతి, రాజకీయ ప్రాతినిధ్యం, సమర్థవంతమైన చట్టపరమైన రక్షణలు నార్డిక్ దేశాల విజయ రహస్యం. బలమైన సామాజిక భద్రతా వ్యవస్థలు ఉన్న చోట మహిళలపై హింసాత్మక సంఘటనలు చాలా తక్కువగా నమోదవుతున్నాయని నివేదిక స్పష్టం చేసింది.
యుద్ద భయాలు.. దయనీయ స్థితిలో చివరి స్థానాలు
మరోవైపు అంతర్యుద్ధాలు, నిరంకుశ పాలన, రాజకీయ అస్థిరత ఎదుర్కొంటున్న దేశాల్లో మహిళల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అఫ్గానిస్థాన్ (181వ ర్యాంకు) ఆఖరి స్థానంలో నిలిచింది. యెమెన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, సిరియా, సుడాన్, హైతీ, కాంగో, మయన్మార్ దేశాలు అడుగున మిగిలాయి. ఈ ర్యాంకులో దిగువన ఉన్న 12 దేశాల్లో నివసిస్తున్న 70 శాతానికి పైగా మహిళలు భీకర సాయుధ పోరాటాలు జరుగుతున్న ప్రాంతాలకు కేవలం 50 కిలోమీటర్ల పరిధిలోనే నివసిస్తున్నారు. ఇది వారి ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తోంది. ఈ సూచీలో భారతదేశం 131వ ర్యాంకుతో 0.607 స్కోరు, పాకిస్థాన్ 169వ ర్యాంకుతో 0.462 స్కోరుతో నిలిచాయి.
ఇదీ చదవండి: ఒక రివార్డ్ పాయింట్.. రూ.1 అనుకుంటున్నారా?


