వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచానికి షాకిచ్చారు. ఉత్పత్తుల తయారీల వెట్టిచాకిరీ (ఫైర్డ్ లేబర్) అడ్డుకట్ట నిబంధనలను సరిగ్గా అమలు చేయడం లేదనే ఆరోపణలతో పన్నుల మోత మోగించారు. దాదాపు 60 భాగస్వామ్య దేశాలకు చెందిన వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
డొనాల్ట్ ట్రంప్ మరోసారి పన్నుల యుద్ధం ప్రకటించారు. గతంలో విధించిన సుంకాల గడువు ముగుస్తుండడంతో వాటి స్థానంలో కొత్త సుంకాలను అమల్లోకి తెచ్చారు. ఈ నూతన పన్నులు 10 శాతం నుండి 12.5 శాతం వరకు ఉండనున్నాయి. ఈ పన్నులతో భారత్, చైనా, జపాన్, బ్రిటన్ యురోపియన్ యూనియన్ (EU) వంటి ప్రముఖ ఆర్థిక వ్యవస్థలపై ఈ ప్రభావం పడనుంది.
ఈ విషయమై అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ "అమెరికాలో దాదాపు ఒక శతాబ్దం నుంచి వెట్టిచాకిరీ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిపై నిషేధం ఉంది. దానిని మేము కఠినంగా అమలు చేస్తున్నాం. మన వాణిజ్య భాగస్వామ్య దేశాలు కూడా అదే పని చేయాల్సిన సమయం వచ్చింది." అని అన్నారు.
గత ఫిబ్రవరిలో ట్రంప్ విధించిన అనేక సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత ప్రత్యామ్నాయ అధికారాలను ఉపయోగించి 150 రోజుల పాటు విధించిన 10 శాతం తాత్కాలిక సుంకం గడువు తీరడంతో, 'ట్రేడ్ యాక్ట్ 1974 - సెక్షన్ 301' కింద నెలల తరబడి విచారణ జరిపి చట్టబద్ధంగా నిలిచేలా ఈ కొత్త సుంకాలను రూపొందించారు.
ఏ దేశంపై ఎంత?
10 శాతం సుంకం వెట్టిచాకిరీపై కఠిన చట్టాలను అమలు చేస్తున్న కెనడా, బ్రిటన్, యురోపియన్ యూనియన్ వంటి దేశాలకు తక్కువ రేటైన 10% సుంకం వర్తిస్తుంది.
12.5 శాతం సుంకం: వెట్టిచాకిరీ నిరోధంలో తగిన చర్యలు తీసుకోలేదని అమెరికా భావించిన చైనా, జపాన్ వంటి భాగస్వామ్య దేశాలపై 12.5% సుంకం పడనుంది.
కాగా ఉక్కు, అల్యూమినియం వంటి ఇదివరకే ప్రత్యేక రక్షణ సుంకాలు ఉన్న రంగాలకు, అలాగే 'యుఎస్-మెక్సికో-కెనడా ఉచిత వాణిజ్య ఒప్పందం కింద అమెరికాలోకి వచ్చే వస్తువులకు ఈ కొత్త సుంకాల నుంచి మినహాయింపు లభించింది.


