ఆస్ట్రియాలోని ఓ భవనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాజీ నియంతగా పేరున్న అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన చోటు అది. అయితే ఇప్పుడది సరికొత్త రూపాన్ని సంతరించుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిట్లర్ పేరిట ఆ భవనం మళ్లీ తీవ్రవాదులకు ఆకర్షణగా మారకుండా.. ఆస్ట్రియా ప్రభుత్వం వేసిన ప్లాన్ చర్చనీయాంశంగా మారింది. ఆ విషయంలోకి వెళ్తే..
ఆస్ట్రియాలోని బ్రౌనౌ ఆమ్ ఇన్ పట్టణంలోని 15 సాల్జ్‌బర్గర్ ఫోర్‌స్టాడ్ట్ ప్రాంతంలో ఉన్న ఈ భవనం 17వ శతాబ్దంలో నిర్మించిన ఓ హోటల్. 1889 ఏప్రిల్‌లో అడాల్ఫ్ హిట్లర్ ఇక్కడే జన్మించాడు. అయితే అక్కడ ఎక్కువ కాలం నివసించలేదు. పుట్టిన కొన్ని వారాలకే అతడి కుటుంబం ఆ ఇంటిని విడిచిపెట్టింది. మూడేళ్ల వయసులోనే హిట్లర్ కుటుంబం ఆ పట్టణాన్ని పూర్తిగా వదిలి వెళ్లిపోయింది. 1938లో ఆస్ట్రియాను నాజీ జర్మనీలో విలీనం చేసే సమయంలో మాత్రమే హిట్లర్ ఈ ప్రాంతానికి తిరిగి వచ్చాడు.
అతివాదులకు ‘తీర్థస్థలం’ కాకుండా..
హిట్లర్ జన్మించిన ప్రదేశం కావడంతో.. ఈ భవనం భవిష్యత్తులో నాజీ అనుకూల వర్గాలకు(అతివాదులకు) ఆకర్షణ కేంద్రంగా మారుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ప్రభుత్వం దశాబ్దాల పాటు ఆ భవనాన్ని అద్దెకు తీసుకుంది. 2011 వరకు ఈ భవనంలో వికలాంగుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ ఉండేది. అయితే యజమాని మరమ్మతులకు అనుమతించకపోవడం, భవనాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు నిరాకరించడంతో అది కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉండిపోయింది.

ప్రభుత్వం స్వాధీనం.. కోర్టు పోరాటం
2016లో ఆస్ట్రియా పార్లమెంట్ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వం ఆ భవనాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంది. ఇందుకు ప్రతిఫలంగా యజమానికి 8.12 లక్షల యూరోలు (సుమారు 9.5 లక్షల డాలర్లు) పరిహారంగా చెల్లించారు. అయితే పరిహారం తక్కువగా ఉందంటూ యజమాని కోర్టును ఆశ్రయించినా.. ఆ ప్రయత్నం ఫలించలేదు.
కూల్చివేత ఆలోచనకు బ్రేక్..
మొదట ఈ భవనాన్ని కూల్చివేసి కొత్త నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించారు. అయితే చరిత్ర నిపుణులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నాజీ గతాన్ని చెరిపివేయడం కంటే.. దాన్ని గుర్తుంచుకుని సరైన సందేశం ఇవ్వడం ముఖ్యమని సూచించారు. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 2019లో ఈ భవనాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చాలని ప్రకటించింది.

మారిపోయిన రూపం.. కొత్త సందేశం
యూరప్ స్థాయి ఆర్కిటెక్చర్ పోటీ నిర్వహించి భవనాన్ని పూర్తిగా పునరుద్ధరించారు. పాత రూపం కనిపించకుండా ముఖభాగాన్ని కూడా మార్చేశారు. ఆధునిక కార్యాలయంలా కనిపించేలా తీర్చిదిద్దారు. ఈ మార్పు కోసం కోట్ల యూరోలు ఖర్చు చేశారు. ప్రస్తుతం పోలీసు సిబ్బంది అక్కడ విధులు ప్రారంభించారు.
తీవ్రవాదానికి అడ్డుకట్టగా..
హిట్లర్ పుట్టిన ప్రదేశం ఇకపై నాజీ అభిమానులకు స్ఫూర్తి కేంద్రంగా కాకుండా.. చట్టాన్ని కాపాడే పోలీస్ స్టేషన్‌గా ఉండాలన్నది ఆస్ట్రియా ప్రభుత్వ ఉద్దేశం. చరిత్రలోని చీకటి అధ్యాయాన్ని దాచిపెట్టకుండా.. దానికి భిన్నమైన అర్థాన్ని ఇవ్వాలన్న ప్రయత్నంగా ఈ మార్పును పలువురు చూస్తున్నారు. హిట్లర్ జన్మించిన ఇల్లు ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాపలా కాస్తుండటం చరిత్రలో ఓ ఆసక్తికర పరిణామంగా మారింది.


