మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ | Metas Oops Moment: Mystery Behind PM Modi Deleted Video | Sakshi
Sakshi News home page

మోదీ సెల్ఫీ వీడియో తొలగింపుపై మెటా వివరణ

Jul 28 2026 11:13 AM | Updated on Jul 28 2026 11:26 AM

Metas Oops Moment: Mystery Behind PM Modi Deleted Video

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్‌ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్‌, లైక్స్‌, కామెంట్లు వచ్చాయి వాటికి. అయితే ఫేస్‌బుక్‌ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకు తొలగించారంటూ ఫేస్‌బుక్‌పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ ‘తాత్కాలిక’ వ్యవహారంపై మెటా వివరణ ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెబుతూ.. దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించింది.

నీట్‌ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జులై 23న ఫేస్‌బుక్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్‌ జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది.

అయితే జులై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో ‘‘చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ మీడియా అందుబాటులో లేదు’’ అనే సందేశం కనిపించింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్‌ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.

మెటా ఏమంది?
వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చిన మెటా.. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైన ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని మెటా పేర్కొంది.

భగ్గుమన్న బీజేపీ, అభిమానులు
ప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్న వీడియోను ఫేస్‌బుక్‌ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సిన ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్‌ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ సోషల్‌ మీడియా విభాగానికి చెందిన నేతలు మెటాను ట్యాగ్‌ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్‌ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా? అనే చర్చకు ఈ ఘటన కారణమైంది.

జెన్‌ జీ ఉద్యమం సమయంలో వీడియో
నీట్‌ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్‌ లీక్‌లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్‌ రావడంతో పాటు యువతలో చర్చకు దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం మరింత ఆసక్తిని రేపింది.

వివాదం టు  వివరణ వరకు
సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. ఇన్నేళ్లలో పోస్ట్‌ చేసిన తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం గమనార్హం. అదీ నీట్‌ నిరసనలతో జెన్‌ జీ చేసిన ఆందోళనలపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్ల మంది వీక్షించారు. అయితే ఉన్నట్లుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. చట్టపరమైన అభ్యర్థన కారణమా? అనే ప్రశ్నా తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చిన వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్లీ ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement