గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్‌ మొదలైందా? | Gadkari's E20 Battle: Legal Action Amid Social Media Storm | Sakshi
Sakshi News home page

గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్‌ మొదలైందా?

Jul 27 2026 1:50 PM | Updated on Jul 27 2026 1:53 PM

Gadkari's E20 Battle: Legal Action Amid Social Media Storm

ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్‌ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్‌ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. 

E20 పెట్రోల్‌ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్‌ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్‌ఫేక్‌ కంటెంట్‌పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్‌ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్‌ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.

సమగ్ర కథనం: ఇథనాల్‌ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీ

బాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీ
గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్‌ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్‌ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ తర్వాత.. గడ్కరీనే టార్గెట్‌?
ఇటీవల నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడంతో.. సోషల్‌ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్‌ నితిన్‌ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా  ఇథనాల్‌ పెట్రోల్‌ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.

అసలు ఈ20పై వివాదం ఏంటి?
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్‌ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

కోర్టు బాట పట్టిన గడ్కరీ
తనపై జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement