20ల్లో చేసే తప్పులు.. 30ల్లో కరిగిపోతున్న కలలు! | Young people Are Biggest Financial mistakes | Sakshi
Sakshi News home page

20ల్లో చేసే తప్పులు.. 30ల్లో కరిగిపోతున్న కలలు!

Jul 27 2026 6:49 AM | Updated on Jul 27 2026 6:49 AM

Young people Are Biggest Financial mistakes

శాలరీ వస్తే సెలబ్రేషన్‌ 

ఆ తర్వాత అంతా టెన్షన్‌ 

లైఫ్‌స్టైల్‌ క్రీప్‌ ప్రధాన కారణం 

ఇన్వెస్ట్‌మెంట్‌ ఆలస్యం.. కాంపౌండింగ్‌ సంపద మాయం 

క్రెడిట్‌ కార్డును అదనపు ఆదాయంగా భావిస్తే అప్పుల ఊబిలోకి ఖాయం 

సోషల్‌ మీడియా లైఫ్‌ను అనుకరించడం ఆర్థిక భవిష్యత్తుకు ప్రమాదం 

20ల్లో అత్యంత విలువైన పెట్టుబడి  నైపుణ్యాలే..

జీతం వస్తోంది.. ఖర్చవుతోంది. కానీ సంపద మాత్రం పెరగడం లేదు. ఇది నేటి యువత ఎదుర్కొంటున్న వాస్తవం. ఖరీదైన ఫోన్లు, వీకెండ్‌ ట్రిప్స్, క్రెడిట్‌ కార్డు షాపింగ్‌లు, సోషల్‌ మీడియా చూపించే లైఫ్‌స్టైల్‌...ఇవన్నీ తెలీకుండానే సంపద సృష్టించే అవకాశాలను యువతకు దూరం చేస్తున్నాయి. 20ల్లో చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు భవిష్యత్తులో కోట్ల రూపాయల నష్టంగా మారతాయి. అందుకే ఈ వయసులో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సరైన దిశలో నడిపించడం అంతకంటే ముఖ్యం. ఈ ఏడు మనీ మిస్టేక్స్‌ను ఇప్పుడే గుర్తిస్తే యువత భవిష్యత్తు ఆర్థికంగా మరింత బలంగా మారుతుంది.       

నెలాఖరులో జీతం బ్యాంకు ఖాతాలో పడుతోంది. కానీ కొన్ని రోజుల్లోనే మాయమవుతోంది. ఈనెల నుంచి సేవింగ్స్‌ మొదలు పెడతా, ఈసారి జీతం పెరిగాక సిప్‌ (సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) చేస్తా, ఈ ఈఎంఐ అయ్యాక పెట్టుబడులు ప్లాన్‌ చేస్తా ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత తమ జీవితంలో అత్యంత విలువైన ఒక దశాబ్దాన్ని కోల్పోతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 20 ఏళ్ల వయసులో చేసే ఆర్థిక పరమైన తప్పులు పెద్దవేం కావు. కానీ వాటి ప్రభావం మాత్రం 30, 40 ఏళ్ల వరకు వెంటాడతాయి. చిన్న అలవాట్లు,  చిన్న చిన్న నిర్లక్ష్యాలు, చిన్న ఆనందం కోసం వేసే వాయిదాలు భవిష్యత్తులో చేతికందాల్సిన కోట్ల రూపాయలను దూరం చేస్తాయి. 20ల్లో యువత చేసే తప్పులు ఏమిటి? వాటి నుంచి ఎలా బయటపడాలి ? 

పర్సనల్‌ ఫైనాన్స్‌ (వ్యక్తిగత ఆర్ధిక నిర్వహణ) గురించి ఎక్కడైనా చదివినా, సోషల్‌ మీడియాలో నిపుణుల సూచనలు విన్నా ఎక్కువమంది యువతే లక్ష్యంగా సలహాలు ఇస్తుంటారు. చిన్న వయసులోనే పొదుపు చేయండి, ఉద్యోగంలో చేరిన నెలనుంచే  పెట్టుబడులు ప్రారంభించండి, అప్పులకు దూరంగా ఉండండి అంటూ అనేక సూచనలు ఇస్తుంటారు. పెట్టుబడులు ఎలా చేయాలో వివరిస్తుంటారు. కానీ 90 శాతం యువత ఈ సూచనలను పట్టించుకోరు. కారణం వారికి అవగాహన లేకపోవడం కాదు. కెరీర్‌ ప్రారంభ దశలో ఎదురయ్యే అనిశ్చితులు, ఆకర్షణలు, కొన్నాళ్ల తర్వాత మొదలెడదాంలే అనే భావన వారిని వెనక్కి నెడతాయి. అయితే 20 ఏళ్ల వయసు  ప్రయోగాలు చేయడానికి, రిస్క్‌ తీసుకోవడానికి, కలలు కనడానికి సరైన సమయం. అయితే యువత ఆనందానికి మాత్రమే ప్రాధాన్యమిస్తారు. కానీ ఆనందం కాస్త ప్రణాళికతో ఉండాలి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి. ఊహించని సమస్యలపై అవగాహన పెంచుకోవాలి. లేకపోతే 30 ఏళ్ల తర్వాత ‘ఇప్పటిదాకా ఇంత సంపాదించాను, అంతా ఎక్కడికిపోయింది‘ అనే ప్రశ్న ఎదురవుతుంది. అప్పడు పెరిగినబాధ్యతలు, పెరుగుతున్న ఖర్చులు భవిష్యత్తు గురించి బెంగపడేలా చేస్తాయి.

యువత భవిష్యత్తును మింగేస్తున్న 7 మనీ ట్రాప్స్‌ 
1. జీతం పెరిగినపుడు జీవనశైలిని అప్‌గ్రేడ్‌ చేయడం 
చాలామంది యువత ఉద్యోగంలో చేరిన కొత్తలో జీతం పెరిగిన వెంటనే కొత్త కొత్త మొబైల్‌ ఫోన్లు, కొనడం, ఖరీదైన రెస్టారెంట్లకు వెళ్లి వేలల్లో ఖర్చుచేయడం, నెలా నెలా విహార యాత్రలకు వెళ్లడం ద్వారా కొత్త లైఫ్‌ స్టైల్‌ను ఎంచుకుంటారు. ఒక్కోసారి ఇవన్నీ సహజంగానే అనిపిస్తాయి. కానీ ఈ అలవాట్లు భారీ ఖర్చులుగా మారతాయి. దీన్నే లైఫ్‌ స్టైల్‌ క్రీప్‌ అంటారు. జీతం పెరుగుతూ ఉంటుంది. పొదుపు మాత్రం పెరగదు. కానీ జీవన శైలి మారిపోతూ ఉంటుంది. ఫలితంగా పదేళ్లు గడిచేసరికి బ్యాంకు పొదుపు ఖాతాలో పదిరూపాయలు కూడా కనబడదు. దీనికి పరిష్కారం సులభమే. జీతం పెరిగిన ప్రతిసారీ ఆ పెరుగుదలలో కనీసం 50 శాతాన్ని నేరుగా పెట్టుబడి వైపు మళ్లించాలి. అప్పుడే ఆదాయం పెరుగుదల భవిష్యత్తులో సంపదగా మారుతుంది. 

2. పెట్టుబడులను వాయిదా వేయడం
‘ఈసారి జీతం పెరిగినపుడు పెట్టుబడి మొదలెడతా, వచ్చే ఇంక్రిమెంట్‌ అందుకున్నాక పొదుపు చేస్తా, ఇంకొన్ని రోజులు ఎంజాయ్‌ చేసి కాస్త స్థిరపడడ్డాక ఇన్వెస్ట్‌ స్టార్ట్‌ చేస్తా‘ యువత నుంచి సాధారణంగా వినిపించే మాటలు ఇవి. కానీ కాంపౌండింగ్‌ అనే అద్భుతం కాలాన్ని కోరుకుంటుంది. ఉదాహరణకు 22 ఏళ్ల వయసులో నెలకు రూ.5000తో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ప్రారంభించిన వ్యక్తి 55 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు రూ.2.2 కోట్ల సంపద కూడబెట్టగలడు (ఏడాదికి 12 శాతం రాబడి అంచనాతో). అదే సిప్‌ను 30 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే అది రూ.85 లక్షల వరకు మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ డబ్బు కన్నా ముందుగా ప్రారంభించడం వల్ల వచ్చిన కాల ప్రయోజనమే ప్రధాన కారణం. అందుకే పెట్టుబడి ఎంత చేశారు కాదు. ఎప్పుడు మొదలెట్టారు అన్నదే అత్యంత కీలకం. 

3. క్రెడిట్‌ కార్డును అదనపు ఆదాయంగా భావించడం 
క్రెడిట్‌ కార్డు అనేది ఆదాయం కాదు. అది తాత్కాలిక రుణం మాత్రమే. స్వైప్‌ చేసినపుడు గర్వంగా అనిపిస్తుంది. కానీ బిల్లు వచ్చినపుడు అసలు వాస్తవం కళ్లు బైర్లు కమ్మేలా చేస్తుంది. వాడిన మొత్తంలో కనీస బకాయి మాత్రమే చెల్లిస్తూ వెళితే ఏడాదికి 36 నుంచి 48 శాతం అదనపు వడ్డీ భారాన్ని మోసే పరిస్థితి ఏర్పడుతుంది. అనుకోని పరిస్థితుల్లో  ఉద్యోగం కోల్పోవడం, ఆరోగ్య సమస్యలు వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా క్రెడిట్‌ కార్డు వాడకుండా ఉండాలంటే కనీసం 6 నుంచి 9 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. 

4. తెలియని ఇన్వెస్ట్‌మెంట్ల  వెంట పరుగులు తీయడం
ప్రతి కాలంలో ఏదో ఒక పెట్టుబడి రంగం ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణీయంగా, సంచలనంగా మారుతుంది. కొన్నేళ్ల క్రితం క్రిప్టో, తర్వాత డిఫెన్స్‌ స్టాక్స్, ఆ తర్వాత స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్, తర్వాత ఫ్లెక్సీ కాప్‌ ఫండ్లు ఇలా.. వాటిలో పెట్టుబడి పెట్టినవారు భారీ లాభాలు పొందారని, కోటీశ్వరులయ్యారని వార్తలు వస్తూంటాయి. యువతరం ఎక్కువగా ఆ ప్రచారంలో చిక్కుకుని, ఆ ట్రెండ్‌లో  భారీగా నష్టపోతోంది. దీర్ఘకాలిక సంపద సృష్టించే పెట్టుబడులకంటే తక్షణ లాభాల ఆశతో ఆప్షన్స్, ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ వైపు యువరం ఆకర్షితులవుతోంది. సోషల్‌ మీడియాలో ఫిన్‌ఫ్లూయెర్స్‌ ప్రభావం, తక్కువ సమయంలో భారీ రాబడులు వస్తాయనే ప్రచారం ఈధోరణిని మరింత పెంచుతున్నాయి. అయితే ఇన్వెస్ట్‌మెంట్‌ సంపదను సృష్టిస్తే  డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌ మూలధనాన్నే కరిగించేస్తాయి. 

ఇక్కడ సమస్య పెట్టుబడి ఎంపికలో కాదు. స్పష్టమైన లక్ష్యం లేకుండా సమయం చూడకుండా ఇన్వెస్ట్‌ చేయడంలోనే ఉంది. ప్రతిసారి పెట్టుబడి చేసే ముందు రెండు ప్రశ్నలు వేసుకోవాలి. ఒకటి ఈ డబ్బు ఏ అవసరానికి? రెండు.. ఎప్పుడు అవసరం అవుతుంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేకపోతే పెట్టుబడి వ్యూహం కాదు, జూదం అవుతుంది.

5. ఇన్సూరెన్స్‌ను పెట్టుబడిగా కొనడం
చాలా మంది ఫైనాన్స్‌ ఏజెంట్లు యూలిప్‌లు. ఎండోమెంట్‌ పాలసీలు, ఒకే ఉత్పత్తితో రక్షణతో పాటు రాబడి కూడా ఇస్తాయని చెబుతుంటారు. కానీ అవి ఆశించిన ఫలితం ఇవ్వవు. ఈ పాలసీల్లో ఇన్సూరెన్స్‌ కవరేజీ తక్కువ ఉంటుంది. పెట్టుబడి రాబడులు కూడా రకరకాల ఛార్జీల కారణంగా తగ్గిపోతాయి. అందుకే పర్సనల్‌ ఫైనాన్స్‌ నిపుణులు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వేరు, పెట్టుబడులు వేరు అనే సూత్రాన్ని సూచిస్తారు. కుటుంబ రక్షణకు టర్మ్‌ పాలసీ, సంపద కోసం ముచువల్‌ ఫండ్లు, ఇతర పెట్టుబడులు ఎంచుకోవడం తెలివైన నిర్ణయమవుతుంది. 

6. సోషల్‌ మీడియా ప్రభావంతో ఖర్చు చేయడం
సోషల్‌ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు విదేశీ పర్యటనలు, ఖరీదైన రెస్టారెంట్లు, కొత్త కొత్త గాడ్జెట్లు, విలాసవంతమైన జీవితం మాత్రమే చూపిస్తారు. కానీ వాటి వెనక ఉన్న ఈఎంఐలు, క్రెడిట్‌ కార్డుల బిల్లులు గురించి చెప్పరు. వీటిని తరచూ చూసే యువతరం వాటి ప్రభావంతో తమ ఆర్థిక సామర్థ్యాన్ని మించి ఖర్చు చేస్తారు. తాత్కాలిక ఆనందం కంటే ఆదాయానికి మించిన ఖర్చుతో పెరిగిన ఒత్తిడి తరువాతి రోజోల్లో అనుభవించిన ఆనందాన్ని గుర్తు లేకుండా చేస్తుంది. అందుకే ప్రతిసారి ఖర్చు చేసే ముందు ‘ఇది నిజంగా నాకు అవసరమా? లేక ఇతరులను చూసి చేస్తున్నానా? అని ఆలోచించుకోవడం అవసరం. 

7. స్వీయాభివృద్ధికి పెట్టుబడి చేయకపోవడం
యువతకు అత్యంత విలువైన ఆస్తి స్టాక్‌ పోర్ట్‌ ఫోలియో కాదు. సంపాదన సామర్ధ్యం ప్రధానం. ప్రమోషన్‌కు ఉపకరించే ఒక మంచి కోర్సు, ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్, నైపుణ్యాన్ని పెంచుకునే సరైన పుస్తకాలుపై చేసే పెట్టుబడి కెరీర్‌ను పూర్తిగా మార్చగలవు. రూ.20000 జీతాన్ని లక్షలకు పెంచే అవకాశం కలుగుతుంది. అందువల్ల ఈ వయసులో సంపద సృష్టించడంలో ముఖ్యమైన పెట్టుబడి మీపై మీరు చేసేదే.

అసలు సమస్య ఏమిటి? 
ఈ ఏడు తప్పిదాల్లో ఒక సామాన్య అంశం ఇమిడి ఉంది. ఇవన్నీ చెడు నిర్ణయాల వల్ల జరిగినవి కావు. నిర్ణయం సరిగా తీసుకోకపోవడం వల్ల జరిగేవి. డబ్బు ఎప్పుడూ ఎవరికోసం ఆగదు. జీతం వచ్చిన క్షణం నుంచి అది అనేక రకాలుగా అనేక మార్గాల్లో ఎటో వెళ్లిపోతుంది. కాబట్టి మంచి ఆర్థిక అలవాట్లను ఆటోమేటిక్‌గా ఏర్పాటు చేసుకోవడం అత్యంత ముఖ్యం.ఆటో డెబిట్‌ సిప్, ప్రత్యేక సేవింగ్స్‌ ఖాతా, సరైన టర్మ్‌ ఇన్సూరెన్స్‌ వంటి నిర్ణయాలు జీవితాన్ని సులభతరం చేస్తాయి. 20 ఏళ్ల వయసులు సంపద సృష్టించాలి అనుకునే వారికి ఎక్కువ ఆర్థిక నైపుణ్యం ఉండాల్సిన అవసరంలేదు. కానీ త్వరగా సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నవారు ముందంజలో ఉంటారు. ఈ దశలో తీసుకునే చిన్న ఆర్ధిక నిర్ణయాలు భవిష్యత్తులో కోట్ల రూపాయల తేడాను చూపిస్తాయి. అందుకే 20ల్లో డబ్బును నిర్లక్ష్యం చేయడం కాదు, దానికి సరైన దిశ చూపించడం అత్యంత అవసరం.

సంపద సృష్టికి గుర్తుంచుకోవాల్సిన 5 గోల్డెన్‌ రూల్స్‌
→ జీతం పెరిగినపుడల్లా కనీసం 50 శాతం పెట్టుబడికి మళ్లించండి 
→ మొదటిజీతం నుండే సిప్‌ ప్రారంభించండి 
→ 6 నుంచి 9 నెలల ఖర్చులకు ఎమెర్జెన్సీ ఫండ్‌ ఏర్పాటు చేయండి 
→ టర్మ్‌ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పనిసరి 
→ నైపుణ్యాలు పెంచుకునేందుకు కొంత ఖర్చు చేయండి  

– సాక్షి, వెల్త్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement