రూ. 25,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం
డజనుకు పైగా కంపెనీలు పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధం
ముంబై: దేశీయ ప్రాథమిక మార్కెట్ ఆగస్టులో భారీ ఐపీఓల రాకతో కళకళలాడనుంది. ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న సానుకూల స్పందన, స్థిరపడుతున్న మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 12కు పైగా కంపెనీలు తమ తొలి పబ్లిక్ ఆఫర్‌కు సిద్ధమయ్యాయి. రాబోయే నెలలో మార్కెట్లోకి రానున్న ఈ ఐపీఓల ద్వారా కంపెనీలు రూ.25,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
వీటిలో కొత్త షేర్ల జారీ తో పాటు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు వాటాలు విక్రయించే ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) లు కూడా ఉన్నాయి. ‘స్టాక్ మార్కెట్ స్థిరీకరణ సాధించడం, ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడంతో ఇన్నాళ్లూ వేచి చూసిన కంపెనీలు ఇప్పుడు ఐపీఓలకు సన్నద్ధమయ్యాయి. 2026లో ఐపీఓల ద్వారా సుమారు 20 బిలియన్ డాలర్ల (రూ. 1.66 లక్షల కోట్లకు పైగా) నిధులు సమీకరించే అవకాశం ఉంది’ అని ఈక్విరస్ క్యాపిటల్ ఎండీ భవేశ్ షా తెలిపారు.
జెప్టో: క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో అత్యంత భారీ ఆఫర్‌తో మార్కెట్లోకి వస్తోంది. కంపెనీ కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 8,010 కోట్లు సేకరించడమే కాకుండా, ఓఎఫ్‌ఎస్ రూపంలో 11.34 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది.
ట్రూహోమ్: ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రూ. 3,000 కోట్ల ఐపీఓను ప్రతిపాదించింది. ఇందులో రూ.1,500 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ.1,500 కోట్ల ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించనుంది.
ఎలివేట్ క్యాంపసెస్: ఈ కంపెనీ పూర్తిగా తాజా ఇష్యూ ద్వారానే రూ. 2,550 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.
షిప్‌రాకెట్: లాజిస్టిక్స్ ప్లాట్‌ఫారమ్ షిప్‌రాకెట్ మొత్తం రూ. 2,342.35 కోట్ల నిధుల సమీకరణలో భాగంగా రూ. 1,100 కోట్ల తాజా షేర్లను, ప్రమోటర్ల ద్వారా రూ. 1,242.35 కోట్ల షేర్లను జారీ చేయనుంది.
ఈ వారంలో మూడు పబ్లిక్ ఇష్యూలు
ఈ వారంలో ప్రధానంగా మూడు పబ్లిక్ ఇష్యూలు సబ్‌్రస్కిబ్షన్ కోసం రానున్నాయి. వీటన్నింటిలో మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ ఐపీఓ అతి పెద్ద ఆఫర్. రూ. 9,275 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో వస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూ జూలై 29న (బుధవారం) ప్రారంభమై జూలై 31న ముగియనుంది. ధర శ్రేణిని రూ. 560 – రూ. 590గా నిర్ణయించారు.
ఈ ఐపీఓలో రూ. 8,000 కోట్ల విలువైన తాజా షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు రూ. 1,275.22 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించనున్నారు. అలాగే క్లీన్ ఎనర్జీ రంగానికి చెందిన జునిపర్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జూలై 30న (గురువారం) ప్రారంభమై ఆగస్టు 3న ముగియనుంది. ఈ కంపెనీ ఎలాంటి ఓఎఫ్‌ఎస్ లేకుండా, పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారానే రూ. 1,800 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మూడో ఇష్యూ అయిన ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ కూడా జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు అందుబాటులో ఉండనుంది. పూర్తిగా తాజా షేర్ల జారీ రూపంలో రానున్న ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 290 కోట్ల నిధులను సేకరించనుంది.


