ఆగస్టులో పండగే పండగ | Telugu Movies Released In The Month Of August 2026, Ravi Teja, Nani, Yash, Suriya & More Set For Big Releases | Sakshi
Sakshi News home page

ఆగస్టులో పండగే పండగ

Jul 19 2026 5:51 AM | Updated on Jul 19 2026 11:53 AM

Telugu movies released in the month of August 2026

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమాల పండగ అంటే సంక్రాంతి అని ఠక్కున చెప్పేస్తారు. తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపేందుకు  హీరోలు, దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. సంక్రాంతి తర్వాత దసరా, దీపావళి వంటి పండగలకు కూడా పలు చిత్రాలు రిలీజ్‌కి ముస్తాబవుతుంటాయి. అదే విధంగా వేసవి సెలవుల్లోనూ సినిమాల సందడి నెలకొంటుంది. ఈ ఏడాది వేసవి పూర్తయింది.

అయితే ఈసారి ఆగస్టు నెలలో కూడా వెండితెరపై సినిమాల సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది. ఇప్పటికే రవితేజ ‘ఇరుముడి’, యశ్‌ ‘టాక్సిక్‌’, సూర్య ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’, నాని ‘ది ప్యారడైజ్‌’, శర్వానంద్‌ ‘భోగి’, వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ వంటి సినిమాలతో పాటు ‘అగధ, అనకాపల్లి, హుషారు పిట్టలు’ వంటి సినిమాలు ఆగస్టు స్లాట్‌ను బుక్‌ చేసుకున్నాయి. అదేవిధంగా మహేశ్‌బాబు నటించిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘దూకుడు’ కూడా రీ రిలీజ్‌ కానుంది. మరి... ఆగస్టులో వెండితెరపై సందడి చేయనున్న ఆ సినిమాల విశేషాలు ఏంటో చూద్దాం...  

7న కొరియన్‌ కనకరాజు 
వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. మేర్లపాక గాంధీ రచన–దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించగా, సత్య కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘వరుణ్‌ తేజ్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్, మేర్లపాక గాంధీ హిలేరియస్‌ స్టోరీ టెల్లింగ్, యూవీ క్రియేషన్స్‌–ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్‌ నిర్మాణ విలువలతో ‘కొరియన్‌ కనకరాజు’ ఒక పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

 హారర్, కామెడీ, ట్విస్ట్‌లతో ఇండియన్, కొరియన్‌ నేపథ్యాల్లో రూపొందిన ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని విభిన్నమైన పాత్ర పోషించారు. రాయలసీమ గ్రామీణ నేపథ్యాన్ని, కొరియా వాతావరణాన్ని చక్కగా బ్లెండ్‌ చేస్తూ వినోదాత్మకంగా మేర్లపాక గాంధీ ఈ కథను తెరకెక్కించిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. సౌత్‌ కొరియాలోని అద్భుతమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన పాటలు, ముఖ్యమైన సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తాయి. హీరో ప్రభాస్‌ విడుదల చేసిన మా మూవీ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది.  

7న అనకాపల్లి  
విక్రమ్‌ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ముఖ్య పాత్రను పోషించారు త్రినాథరావు నక్కిన. తారక్‌ పొన్నప్ప, ఇంద్రజ అబ్సర్, మహబూబ్‌ బాషా, శ్రీనివాస్‌ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్‌ ఇతర పాత్రలు పోషించారు. భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్‌ బ్యానర్ల మీద కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు.

కాండ్రేగుల కుమార్‌ రాజా కోప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ మూవీ ఆగస్టు 7న విడుదల కానుంది. ‘‘రా అండ్‌ రస్టిక్‌ మూవీగా ‘అనకాపల్లి’ రూపొందింది. ఇప్పటికే విడుదలైన మా సినిమా టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దేవ్‌ జండ్‌ సంగీతం అందించిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ‘అమ్మోరు దిగినాది...’, ‘లబ్బరు బొమ్మ...’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యాయి. అలాగే  రొమాంటిక్, ఫీల్‌ గుడ్‌ లవ్‌ సాంగ్‌ ‘ఎలగే పిల్ల...’కి అనూహ్యమైన స్పందన వస్తోంది. మా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది’’ అని చిత్రబృందం తెలిపింది.  

14న అగధ  
ప్రముఖ నిర్మాత–దర్శకుడు ఎం.ఎస్‌. రాజు రచన, దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అగధ’. కామాక్షీ భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గు΄్తా, జోవికా విజయ్‌ కుమార్, సిజ్జు, రోషన్, శ్రేయ రాణి రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. ‘అగధ’. శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది. ‘‘ఈ మూవీలో మహాదేవి పాత్రలో కామాక్షి భాస్కర్ల నటించగా ఆమె ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. అలాగే నటుడు శ్రవణ్‌ రెడ్డి పోషించిన సింహ పాత్ర లుక్‌కి, జోవిక విజయ్‌ కుమార్‌ నటించిన హరిణి పాత్ర క్యారెక్టర్‌ పోస్టర్‌కి చక్కని స్పందన వచ్చింది.

‘అగధ’ నా కలల ప్రాజెక్ట్‌. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఓ విజువల్‌ వండర్‌లా అనిపించే సినిమా ఇది. భావోద్వేగాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్‌ అద్భుతంగా పని చేశారు. ముఖ్యంగా కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌ రెడ్డి, ఉల్కా గు΄్తా, జోవిక తమ పాత్రల్లో అసాధారణ నటన కనబరిచారు. మైథలాజికల్‌ అంశాలు, మిస్టరీ, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్, అత్యున్నత విజువల్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులు కొత్త అనుభూతిని పొందుతారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించిన మా చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు.  

14న పళ్ళ బురుసు 
 ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు సుధాకర్‌ రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌. ఈ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘పళ్ళ బురుసు’. ఉదయ్‌ చౌహాన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రజ్వల్, గోమతి కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణని, అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌ని శుక్రవారం విడుదల చేశారు మేకర్స్‌. ‘ఆ... ఏందిరా పళ్ళ బురుసా? తేలేదురా, ఈడు పళ్ళ బురుసు తేడు... నా నొప్పి తక్కువ కాదు’ అంటూ సుధాకర్‌ రెడ్డి, ‘నా బిడ్డ పెళ్లి... మా అయ్య లొల్లి... ఏందో ఈ పళ్ళ బురుసు’ అంటూ మురళీధర్‌ గౌడ్‌ చెప్పే డైలాగ్స్‌ గ్లింప్స్‌లో ఉన్నాయి.  

15న హుషారు పిట్టలు 
అన్షు, వాసవి గణేషన్‌ జంటగా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. బిక్షు దర్శకత్వంలో పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్‌ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్‌ పతాకంపై వెంకట్‌ యాదవ్‌ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఏషియన్‌ సురేష్‌ ఫిలింస్‌ సంస్థలు ఆగస్టు 15న రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు బిక్ష, నిర్మాత  వెంకట్‌ యాదవ్‌ మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘హుషారు పిట్టలు’. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టీజర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. అయితే కొంతమంది తెలియక బ్యాడ్‌ కామెంట్లు పెట్టారు.

 కానీ, సినిమా విడుదల తర్వాత మా చిత్రంలో ఉన్న అసలు కథ అందరికీ తెలుస్తుంది. ఈ సినిమాలో అన్ని రకాల భావోద్వేగాలున్నాయి. ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఎంతో ఫ్రొఫెషనల్‌గా తీసిన సినిమా ఇది. ఈ సినిమా విడుదల తర్వాత అందరూ ఓ మంచి సినిమా చూశామనే అనుభూతికి లోనవుతారు. ఈ మూవీ రిలీజ్‌ తర్వాత ఇతర భాషల వాళ్లు ‘హుషారు పిట్టలు’ గురించి మాట్లాడుకుంటారు’’ అని తెలిపారు.  

21న ఇరుముడి...  
రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఆయన కెరీర్‌లో 77వ సినిమాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘నిన్ను కోరి, మజిలీ, ఖుషి’ చిత్రాల ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్‌ కథానాయికగా నటిస్తుండగా రవితేజ కుమార్తె పాత్రలో బేబీ నక్షత్ర నటిస్తోంది. సాయికుమార్, అజయ్‌ ఘోష్, రమేష్‌ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్‌కుమార్‌ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్‌ కంచెరపాలెం, కార్తీక్‌ అడుసుమల్లి, మహేష్‌ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టి. సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధాలు, భావోద్వేగాలతో ముడిపడిన ఈ యాక్షన్‌ మూవీలో అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపించనున్నారు రవితేజ. అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాల నేపథ్యంలో సాగే ‘ఇరుముడి’ కథలో ఓ అందమైన కుటుంబం, ఫ్యామిలీ ఎమోషన్స్, తండ్రీ కూతుళ్ల మధ్య బాండింగ్‌ వంటి అంశాలు ఉంటాయని చిత్రయూనిట్‌ పేర్కొంది. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు...’ పాటకి అద్భుతమైన స్పందన వచ్చింది.  

21న దిప్యారడైజ్‌  
నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘దిప్యారడైజ్‌’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మంచు మోహన్‌బాబు, రాఘవ్‌ జుయల్, సంపూర్ణేష్‌ బాబు, కయాదు లోహర్, సోనాలి కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు, ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో ఈ ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్‌ ప్రకటించినా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత ఫైనల్‌గా ఆగస్టు 21న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది. ప్రత్యేకించి ఆ తేదీకి ఎందుకంటే వరుసగా మూడు వారాల పాటు ఓనం, మిలాద్‌–ఉన్‌–నబీ, రాఖీ, శ్రీకృష్ణ జన్మాష్టమి వంటి పండగలు కలిసి రానున్నాయి. ఈ సెలవులు తమ సినిమాకి కలిసి వస్తాయని చిత్రబృందం భావించి, ఈ తేదీని ఫిక్స్‌ చేసిందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘‘పాన్‌ వరల్డ్‌ మూవీ ‘దిప్యారడైజ్‌’ ఇప్పటికే భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. విడుదలైన ప్రతి అప్‌డేట్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతూనే ఉన్నాయి.

దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తన అద్భుతమైన విజన్‌తో ఈ సినిమాని ఒక్కో అడుగు విస్తరిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. సుధాకర్‌ చెరుకూరి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సంగీత సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ తన ఎనర్జిటిక్‌ స్కోర్‌తో సినిమాపై అంచనాలను మరింత పెంచారు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.  

26న టాక్సిక్‌  
 ‘కేజీఎఫ్, కేజీఎఫ్‌ 2’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత యశ్‌ హీరోగా నటించిన తాజా పాన్‌ ఇండియా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌’. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, నయనతార, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌ హీరోయిన్లుగా నటించారు. మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, కేవీఎన్‌ప్రొడక్షన్స్, జీ మ్యూజిక్‌ కంపెనీపై రూపొందిన ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో ఆగస్టు 26న విడుదల కానుంది.

ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు విడుదల హక్కులను  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత ‘దిల్‌’ రాజు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... 2026 మార్చి 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ తొలుత ప్రకటించింది. అయితే ఆ తేదీకి రిలీజ్‌ని పోస్ట్‌ పోన్‌ చేసి, జూన్‌ 4న విడుదల చేస్తామని తెలిపారు మేకర్స్‌. అయితే ఆ తేదీకి కూడా రిలీజ్‌ వాయిదా పడి, ఫైనల్‌గా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

విశాల్‌ మిశ్రా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘తబాహీ...’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్‌ చేయగా అద్భుతమైన స్పందన వచ్చినట్లు మేకర్స్‌ ప్రకటించారు.   

14న విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌
సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. వెంకీ అట్లూరి రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్‌గా నటించారు. రాధిక శరత్‌కుమార్, రవీనా టాండన్‌ కీలక పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యున్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ‘‘సార్‌ (వాత్తి), లక్కీ భాస్కర్‌’ వంటి వరుస విజయాల తర్వాత నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించిన తెలుగు–తమిళ చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌. 

కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో సూర్య పాత్ర సరికొత్తగా ఉంటుంది. ‘సార్, లక్కీ భాస్కర్‌’ వంటి హిట్స్‌ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ స్థాయిలో రూపొందిన మా చిత్రం కుటుంబ భావోద్వేగాలు, హృదయాన్ని హత్తుకునే అంశాలతో కూడిన పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట ‘నేనో బటర్‌ ఫ్లై...’కి మంచి స్పందన వచ్చింది.   ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ చిత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకొని, ఈ ఏడాది అత్యంత ఆదరణ పొందే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లలో ఒకటిగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది.  

30న దూకుడు రీ రిలీజ్‌
మహేశ్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘దూకుడు’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటించారు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రశాష్‌రాజ్, ఎమ్మెస్‌ నారాయణ, నాజర్, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి, చంద్రమోహన్, సుమన్‌ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించిన ఈ సినిమా 2011 సెప్టెంబరు 23న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఈ మూవీని ఆగస్టు 30న 4కె వెర్షన్‌లో రీ రిలీజ్‌ చేయనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, మెరుగైన సౌండ్‌ క్వాలిటీతో వస్తున్న ‘దూకుడు’ని చూసేందుకు ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ సినిమాను రీ రిలీజ్‌ చేస్తుండటంతో అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్‌ వర్గాల్లోనూ ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఇదిలా ఉంటే... మహేశ్‌ బాబు హీరోగా నటించిన ‘ పోకిరి’, ‘ఒక్కడు’, ‘బిజినెస్‌ మేన్‌’, ‘మురారి’ వంటి చిత్రాలు ఇప్పటికే రీ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే.  

28 న భోగి  
శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న పాన్‌–ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ మూవీ ‘భోగి’. సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో డింపుల్‌ హయతి, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో రక్షా బంధన్‌ పండగ సందర్భంగా ఆగస్టు 28న ఈ చిత్రం విడుదల కానుంది.

‘‘1960ల నాటి నేపథ్యంలో సాగే ‘భోగి’ చిత్రం తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఫిక్షనల్‌ విలేజ్‌లో జరిగే పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది. ఈ ఏడాది వరుస విజయాలతో దూసుకు పోతున్న శర్వానంద్‌ ‘భోగి’ చిత్రంతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు, ఈ పాన్‌ ఇండియా పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా కోసం శర్వానంద్‌–సంపత్‌ నందిల కాంబినేషన్‌ తొలిసారి కలిసింది.

ఈ కాంబినేషన్‌ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. శర్వానంద్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్, పుట్టినరోజు పోస్టర్లకు అదిరి పోయే రెస్పాన్స్‌ వచ్చింది. పల్లెటూరి యువతిగా అనుపమ పరమేశ్వరన్‌ ఫస్ట్‌ లుక్‌కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.  

పైన పేర్కొన్న సినిమాలే కాదు. మరికొన్ని చిన్న చిత్రాలు కూడా ఆగస్టులో విడుదలకు ముస్తాబవుతున్నాయి.

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement