టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్తని కోల్పోయిన ఈయన.. ఇప్పుడు తన సోదరి చనిపోయిన విషయాన్ని వెల్లడించాడు. తన చిన్నక్క జ్యోతి గత 14 రోజులుగా న్యూమోనియాకి చికిత్స తీసుకుంటూ మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచారని పోస్ట్ పెట్టాడు.
(ఇదీ చదవండి: రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?)
'నా ప్రియమైన చిన్నక్క మెహర్ జ్యోతి సుంకర ఈ రోజు రాత్రి 9:45 గంటలకు విజయవాడలో స్వర్గస్తులయ్యారు. వైరల్ న్యూమోనియాతో గత 14 రోజులుగా చికిత్స పొందుతూ అనంత లోకాలకు వెళ్లిపోయారు. నా చిన్నప్పటి నుంచి తను నా అండ. ప్రేమగా నా కూతురి పెళ్లి దగ్గరుండి జరిపించి శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో ఆనందపడిన మా అక్క ఇప్పుడు ఆ దేవుడి దగ్గరకు ఇంత తొందరగా వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు' అని మెహర్ రమేశ్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.
2023లో మెహర్ రమేశ్ తల్లి చనిపోగా, గతేడాది మార్చిలో అక్క కన్నుమూశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్త మృతి చెందగా ఇప్పుడు చిన్నక్కని కోల్పోయిన సంగతి ఈ దర్శకుడు బయటపెట్టారు. ఇలా మెహర్ రమేశ్ ఇంట్లో వరస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఇకపోతే గత నెల ప్రారంభంలోనే మెహర్ రమేశ్ కుమార్తె పెళ్లి జరిగింది. ఈ దర్శకుడు చివరగా 2023లో వచ్చిన 'భోళా శంకర్' తీశారు. అప్పటినుంచి మరో ప్రాజెక్ట్ చేయలేదు.
(ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలనటి దుర్మరణం)


