విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతోన్న తొలి సినిమా జన నాయగన్. రాజకీయాల్లో ఎంట్రీకి ముందు ఇదే చివరి సినిమా అని ప్రకటించారు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉన్న ఇప్పటికీ విడుదల కాలేదు. సెన్సార్ సమస్యలతో పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల సెన్సార్ సమస్యలు క్లియర్ కావడంతో ఎట్టకేలకు ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది.
ఈ నేపథ్యంలో జన నాయగన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇండియాలోనే మూడు భాషల్లో కలిపి 7 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఇప్పటికే రూ.20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. టికెట్ బుకింగ్ ప్రీ-సేల్స్‌లో అత్యధిక వాటా తమిళ వెర్షన్ కావడం విశేషం.
ప్రముఖ ట్రేడింగ్ సైట్ శాక్‌నిల్క్ ప్రకారం ఈ చిత్రానికి తమిళనాడు అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది, అడ్వాన్స్ బుకింగ్‌లలో రూ. 7.90 కోట్లు రాబట్టింది. కర్ణాటక బెంగళూరులో రూ. 6.03 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత కేరళ బాక్సాఫీస్ వద్ద రూ. 1.91 కోట్లు వసూలు చేసింది. ఇక నగరాల విషయానికొస్తే బెంగళూరు రూ. 5.99 కోట్ల అడ్వాన్స్ అమ్మకాలతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో చెన్నై (పరిమిత ఓపెనింగ్స్‌తో) రూ. 1.86 కోట్లు వసూలు చేసింది. ఇక్కడ దేశంలోనే అత్యధిక ఆక్యుపెన్సీ నమోదైంది. కోయంబత్తూరు రూ. 90 లక్షలతో మూడవ స్థానంలో ఉండగా,.. హైదరాబాద్, మదురై, కొచ్చి, తిరువనంతపురం తరువాత స్థానాల్లో నిలిచాయి. లియో, గోట్ సినిమాలతో పోలిస్తే.. జన నాయగన్ కాస్తా వెనకంజలోనే ఉంది.
కాగా.. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, ప్రియమణి, నరైన్, నాజర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా జూలై 23న విడుదల కానుంది.


