కొత్త కథలను సృష్టిస్తున్న కుటుంబ క్రైమ్ కథా చిత్రమ్...
‘దృశ్యం’తో ఊపందుకున్న ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్లు
మధ్యతరగతి ఎదుర్కొనే సమస్యలే సక్సెస్ సీక్రెట్
కుటుంబ బంధాలకు రైటు... చట్ట వ్యతిరేక పంధాతో చేటు
ఒకప్పుడు మంచి పనులు చేసేవాడు హీరో... అది కూడా చట్టబద్ధంగా... మరోవైపు చెడ్డ పనులు, అది కూడా చట్ట వ్యతిరేక పనులన్నీ విలన్ ముఠా చేసేది. కుటుంబం అంటే సదరు నేరం వల్ల బాధపడే బాధితులుగా మాత్రమే ఉండేది. రాను రాను పరిస్థితులు పూర్తిగా మారిపోతూ వచ్చాయి. చట్ట వ్యతిరేక పనులు చేసేవాళ్లు హీరోలుగా తెరకెక్కడం ఎప్పటి నుంచో సర్వసాధారణంగా మారిపోగా కుటుంబమే కథలో నేరాల కేంద్రబిందువుగా మారడం ఇప్పుడు సరికొత్త ట్రెండ్. కుటుంబ సభ్యులంతా కలిసికట్టుగా నేరాలు చేయడమో లేదా ఒకరు చేసిన నేరాన్ని దాచిపెట్టడమో వంటి కథాంశాలు సరికొత్త సక్సెస్ సీక్రెట్స్‌గా అవతరించాయి.
ఇంటి ‘దృశ్యం’ మారిపోయింది...
‘కుటుంబం కోసం ఏమైనా చేస్తాం...’ అనే మాటను ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో విన్నాం. కానీ ఇప్పుడు దర్శకులు ఆ మాటకు కొత్త అర్థం చెబుతున్నారు. కుటుంబాన్ని కాపాడటానికి చట్టాన్ని అతిక్రమించడానికైనా, నేరాన్ని దాచిపెట్టడానికైనా, అవసరమైతే పోలీసులనే తప్పుదోవ పట్టించడానికైనా వెనుకాడని కుటుంబాలు ఇప్పుడు వెండితెరపై దర్శనమిస్తున్నాయి. ఈ ధోరణికి మలయాళ సినిమా ‘దృశ్యం’ ఊపు తెచ్చింది అని చెప్పాచ్చు.
మోహన్‌లాల్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమాలో ఓ మధ్య తరగతి కుటుంబం తమ కుటుంబ సభ్యులు చేసిన నేరాన్ని ఎలా కప్పి పుచ్చింది? దాని కోసం ఎన్ని రకాల ఎత్తులు పై ఎత్తులు వేసింది? అనేది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ సూపర్‌హిట్ అవడం, థియేటర్లు కిక్కిరిసిపోవడం, పలు భాషల్లోకి రీమేక్ కావడంతో పాటు వరుస సిరీస్‌లు రావడం కూడా మనం చూసిందే. అక్కడ నుంచి దర్శక–నిర్మాతలు ప్రస్తుతం అలాంటి కథల్ని హిట్ కాన్సెప్ట్‌గా చూస్తున్నట్టు ఆ తర్వాత అదే బాటలో వస్తున్న పలు సినిమాలు నిరూపిస్తున్నాయి.
ఇల్లే కదా ‘నేర’సీమ...
గృహమే కదా స్వర్గసీమ అన్నది ఒకనాటి మాట... ‘ఇల్లే కదా నేరా’ల థీమా అన్నట్టుగా ప్రస్తుతం కథలు రూపొందుతున్నాయి. ఇటీవల తమిళంలో సీనియర్ హీరో అర్జున్ నటించిన ‘బ్లాస్ట్’ కూడా అలాంటి చిత్రమే. ఆ సినిమాలో సాదా సీదాగా బ్రతికే ఓ కరాటే మాస్టర్ కుటుంబం అనుకోకుండా ఓ తీవ్రమైన నేరానికి పాల్పడుతుంది. తమ ఇంటిపై దాడికి వచ్చిన అరడజను మంది గూండాలను కుటుంబ సభ్యులు అంతా కలిసి కట్టుగా హత్య చేస్తారు.
అంతేకాకుండా ఆ మృతదేహాలన్నింటినీ ఇంటి ఆవరణలోనే గొయ్యి తవ్వి పాతిపెడతారు. అక్కడ నుంచి తండ్రీ కూతురు కలిసి చేసే పోరాటాలు, ఆ తర్వాత తల్లి కూడా వారితో చేతులు కలపడం, ఆఖరికి మామయ్య కూడా నేను సైతం అంటూ వీరితో కలిసి ఫైట్స్ చేయడం... వంటివి ఫ్యామిలీ బాండింగ్‌ను మాత్రమే కాదు... సినిమా కధల కొత్త ట్రెండ్‌ను కూడా పట్టి చూపిస్తాయి. ఈ సినిమా తమిళంలో రిలీజై విజయం సాధించడం, తెలుగు సహా పలు భాషా ప్రేక్షకుల నుంచి ఓటీటీలోనూ మంచి ఆదరణ దక్కించుకుంది.
ఇంటింటా ఆయుధాలు...
‘‘శత్రువులు ఇంటి మీదకు దాడి చేస్తున్నారు. మన ఇంట్లో ఉన్న ఆయుధాలన్నీ బయటకు తీయండి’’ అంటుంది కోడలు. మన దగ్గరేమున్నాయి ఆయుధాలు? అని ప్రశ్నించిన కుటుంబ సభ్యులకు ‘కత్తి పీట నుంచి కారప్పాడి’ దాకా ఉన్న ఆయుధాల జాబితాను గుర్తు చేసి, వారి చేత బట్టించి యుద్ధం చేయిస్తుంది. ఈ సన్నివేశం ఇటీవలే రిలీజ్ అయిన ‘మా ఇంటి బంగారం’ సినిమాలోనిది. ఈ సినిమాలో కుటుంబం అంతా కలిసి కట్టుగా ఉండడం, కలిసి పండగల నుంచి భోజనాల దాకా చేయడం దాకా ఎంత అందంగా చూపించారో... అవసరమైతే అందరూ కలిసికట్టుగా పోరాటాలు కూడా చేస్తారని కూడా అంతే బలంగా చూపించారు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అంచనాలను మించిన విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.
ఇల్లే థ్రిల్లు...
థ్రిల్లర్ సినిమా తీయాలంటే ఎక్కడెక్కడికో వెళ్లనక్కరలేదు. ఒక సగటు మనిషి ఇంట్లోకి తొంగి చూస్తే చాలు అన్నట్టుగా ఈ ట్రెండ్ కొనసాగుతోంది. ఒక ఇంటి ఆడపడుచును కొన్ని రోజులుగా వేధిస్తున్న ఓ పోకిరి కమ్ రౌడీ హత్యకు గురవుతాడు. విశేషం ఏమిటంటే... ఆ రౌడీ హత్య తమ ఇంట్లోని వాళ్లే చేశారని తల్లి, తండ్రి, ఇద్దరు కూతుర్లున్న ఆ ఇంట్లోని వాళ్లంతా బలంగా నమ్మడం.
అయితే ఎవరు చేశారో ఎవరికీ తెలియకపోవడం... అక్కడ నుంచి ఆ ఇంటి సభ్యులందరూ ఒకరిని ఒకరు అనుమానించడం... ఇలా దాదాపుగా ఇంటి చుట్టూ పరిభ్రమించే కథతో రూపొందిన మలయాళ సినిమా ‘పరిమళ అండ్ కో’ కూడా హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. వినోదాన్ని కూడా పంచిన ఈ సినిమాలో సభ్యులందరూ తమ ఇంటి పరిస్థితులను ‘దృశ్యం’ సినిమాకు అన్వయించుకోవడం ఆ సినిమాను పదే పదే ప్రస్తావించడం కూడా కనిపిస్తుంది. ఈ తరహా ట్రెండ్‌కు హాస్యం కూడా జత చేయవచ్చునని నిరూపించిందీ సినిమా.
భావోద్వేగమే బలం
ప్రేమికురాలి కోసం లేదా స్నేహితుడి కోసం చేసే నేరాల కథలతో చాలా సినిమాలే వచ్చాయి. అయితే కుటుంబం కోసం చేసే ఉమ్మడి పోరాటం ప్రేక్షకులకు మరింత బలంగా కనెక్ట్ అవుతోంది. ‘మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం’ అనే భావన ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ను తట్టి లేపుతోంది. తెరమీది పాత్రలతో ప్రేక్షకులు త్వరగా మమేకమవడానికి దోహదం చేస్తోంది. అంతేకాకుండా ఈ కథలు ఒక వ్యక్తి సెంట్రిక్‌గా నడవడం లేదు. ఒక్క హీరోకో, హీరోయిన్‌కో మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులందరికీ ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అది కూడా ఆకట్టుకునే అంశమే.
తండ్రి ప్లాన్ వేస్తే తల్లి సహకరిస్తుంది. పిల్లలు పరిస్థితులకు అనుగుణంగా వాస్తవాలు దాచిపెట్టడం లేదా అబద్ధాలు అడడం వంటి చేతనైన పనులు చేస్తూ తమ వంతు పాత్ర పోషించడం వెరసి ప్రతి పాత్ర కథలో కీలకంగా మారుతోంది. ప్రతీ ప్రేక్షకుడూ ఒక ఇంట్లో ఏదో ఒక పాత్ర పోషించేవాడే కాబట్టి ప్రేక్షకుడికి ‘నా’ అనే అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమాల్లో నేరాలు తప్పని సరై మాత్రమే చేసేవి కావడంతో చట్టపరంగా తప్పు చేసినా ‘ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు?‘ అనే నైతిక సందిగ్ధత కథను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. కుటుంబం చేసిన పని చట్టపరంగా తప్పు. కానీ వారి పరిస్థితి అర్థం చేసుకున్న ప్రేక్షకుడు వాళ్లవైపే నిలబడతాడు. ఇదే ఈ చిత్రాల విజయ రహస్యం.
సస్పెన్స్... సక్సెస్...
థ్రిల్లర్ జోనర్‌లో సినిమాల విజయాలకు దోహదం చేసేది సస్పెన్స్. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని దాచడం కంటే, కుటుంబమంతా కలిసి రహస్యాన్ని కాపాడటం చాలా క్లిష్టం. ఒక్కొక్కరు ఒక్కో రకమైన మైండ్‌సెట్‌తో ఉంటారు కాబట్టి చిన్న పొరపాటు జరిగినా మొత్తం ప్లాన్ కూలిపోతుంది. ఈ అంశమే కథలో ప్రతి సన్నివేశాన్ని ఉత్కంఠభరితంగా మార్చేస్తుంది.
ఓటీటీ... వెరైటీ...
ప్రేక్షకులు ఇప్పుడు కేవలం యాక్షన్ లేదా మాస్ సినిమాలకే పరిమితం కావడం లేదు. ఓటీటీ వేదికలపై సందడి చేస్తున్న వందల వేల సినిమాలు చూస్తున్న నవతరం ప్రేక్షకుడు కొత్త కొత్త అనుభూతులను కోరుకుంటున్నాడు. ముఖ్యంగా మానసిక సంఘర్షణలు, కుటుంబ బంధాలు, క్రైమ్, థ్రిల్లర్ అంశాలు కలిసిన కథలకు మన వాళ్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోందనే విషయం ఓటీటీపై సక్సెస్ సాధించిన సినిమాలు, వెబ్‌బ సిరీస్‌లు నిరూపిస్తున్నాయి. దీంతో రచయితలు కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.
ఆలోచింపజేసే కథలు
యాగం నుంచి త్యాగం దాకా మన కుటుంబం బాగు కోసం ఏదైనా చేయాలనే తపన పెంచే కథలు చాలానే వచ్చాయి. అయితే ఫ్యామిలీ కోసం ఏం చేసినా తప్పు కాదని ఈ కథలు చెబుతున్నాయి. ఇందులో పాత్రలు అతీంద్రియ శక్తులు కలిగిన వ్యక్తి కాదు. మన పక్కింటి వ్యక్తిలా కనిపించే సాధారణ తండ్రి, తల్లి, పిల్లలే కథానాయకులు. అదే ఈ సినిమాల అతి పెద్ద బలం. ఈ జానర్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే... చివరికి ప్రేక్షకుడే ఒక ప్రశ్న వేసుకుంటాడు. ‘నా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తే నేనేం చేస్తాను?’ అనే ప్రశ్న కథ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకుల్ని వెంటాడుతుంది.
అందుకే ఈ సినిమాలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చర్చల్లో నిలుస్తుంటాయి.. కుటుంబ బంధాలు, నైతిక సంఘర్షణ, క్రైమ్, సస్పెన్స్... ఈ నాలుగు అంశాలను సమతుల్యం చేయగలిగితే ఇలాంటి సినిమాలకు ప్రేక్షకాదరణ కొనసాగే అవకాశాలు బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న వెంకీ, త్రివిక్రమ్‌ల ‘ఆదర్శ కుటుంబం’ వంటి సినిమాల కథలు ఇలాగే సాగుతాయనే వార్తలు వస్తున్నాయి.
ఇంటి చుట్టం సరే... బయటి చట్టం సంగతేమిటి?
ఈ కొత్త ట్రెండ్ విజయవంతమవుతోంది, దీని వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలోపేతం అవుతాయనే భావన వస్తున్నా మరో వైపు చట్ట వ్యతిరేక కార్యకలాపాల ప్రశ్న ఏంటి? అనే ప్రశ్న వస్తోంది. ఒకప్పుడు ఇంట్లోని వ్యక్తి తప్పనిసరై నేరం చేసినా ఇంటిల్లిపాది కలిసి చట్టానికి అప్పగించే స్థాయిలో కథలు ఉండేవి. కానీ ఇప్పుడు తప్పులు/నేరాలు చేసినా తమ కుటుంబం తమను రక్షిస్తుంది అనే భావన ఏర్పడితే... ఇవి సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇదే లైన్ తీసుకుని దర్శకులు కొత్త ట్విస్టులు, భిన్నమైన నేపథ్యాలతో సినిమాలు తీస్తూ పోతే, రకరకాల ఎత్తులు పై ఎత్తులు వేస్తూ సగటు మనిషి కూడా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవచ్చుననే సందేశం ఇస్తూ పోతే... అది సామాజిక భధ్రతకు భంగకరం కాదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
హాలీవుడ్ నుంచి ఓటీటీ మీదుగా...
ప్రపంచ సినిమాను పరిశీలిస్తే కుటుంబం కోసం చట్టాన్ని ధిక్కరించే కథలు కొత్తవి కావు. హాలీవుడ్‌లో ‘ది గాడ్ ఫాదర్’ సిరీస్‌లో మాఫియా కుటుంబమే కథకు కేంద్రబిందువు. అక్కడ నేరం కుటుంబ వ్యాపారమే. హిస్టరీ ఆఫ్ వయొలెన్స్‌లో గతాన్ని దాచుకున్న కుటుంబం హింసలో చిక్కుకుంటుంది. తన కుమార్తెను రక్షించేందుకు ఒక తండ్రి చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం... ‘ప్రిజనర్స్, నైవ్స్ అవుట్’ వంటి చిత్రాల్లో కుటుంబ సభ్యులందరూ ఒక హత్య రహస్యంలో అనుమానితులుగా మారడం కనిపిస్తుంది. బాలీవుడ్‌లోనూ ఈ తరహా సినిమాలు అప్పుడప్పుడూ కనిపించాయి.
కుటుంబ రహస్యాలే కథను నడిపించే ‘కపూర్ అండ్ సన్స్’, కుటుంబ బంధాలు, మోసం, నేరం, నైతిక సందిగ్ధతల కలయిక ‘మోనికా ఓ మై డార్లింగ్ గిలీ’ వంటి సినిమాల్లో కనిపిస్తుంది. సోనీ లివ్‌లో ప్రసారమవుతున్న ‘ఉన్ దేఖీ’ కూడా ఇదే జోనర్ సినిమానే. ఒక ధనిక కుటుంబం చేసిన హత్యను మొత్తం కుటుంబం, వారి అనుచరులు కలిసి ఎలా కప్పిపుచ్చుతారనేది ‘ఉన్ దేఖీ’ కథ... ఇది వరుస సిరీస్‌లతో ఘన విజయం సాధించింది. అయితే ఇవన్నీ ధనిక కుటుంబాలో, ప్రముఖుల కుటుంబాలకో సంబంధించిన కథలు కాగా సకుటుంబ సపరి‘వార్’ సమేత ‘క్రైమ్’ని నేలకు దించి సగటు మధ్య తరగతి కుటుంబాల కథలుగా మార్చింది ‘దృశ్యం’ సినిమానే అన్నది నిర్వివాదం.
ఉపసంహారం...
విజయాల వేటలో ఉన్న దర్శకులు, రచయితలను ఇప్పుడు కుటుంబ సమేత నేరాల కాన్సెప్ట్‌ను ఎంచుకుంటున్నారు. అయితే ప్రతీ సినిమాకీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలే కీలకంగా మారకూడదు. కమర్షియల్ సక్సెస్ ఎంత ముఖ్యమో సామాజిక శ్రేయస్సు కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడాన్ని ప్రోత్సహించడం అంటే వెలుగులు అందిస్తున్న సమాజ భవిష్యత్తును చీకటిమయం చేయడమేనని మరచిపోకూడదు.
– సత్యబాబు, ‘సాక్షి’ సిటీ బ్యూరో


